Yogi Adityanath: సీఎం యోగిని చంపేస్తామంటూ బెదిరింపులు.. ఆ వ్యక్తి కోసం గాలింపు
ABN , Publish Date - Jan 04 , 2024 | 09:25 PM
మన భారతదేశంలోని మోస్ట్ పవర్‌ఫుల్ ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దాంతో..
Yogi Adityanath: మన భారతదేశంలోని మోస్ట్ పవర్‌ఫుల్ ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దాంతో.. అక్కడ క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గింది. బుల్డోజర్ విధానం తీసుకొచ్చినప్పటి నుంచి అవినీతితో పాటు నేరాలు తగ్గుముఖం పట్టాయి. అలాంటి సీఎంను చంపేస్తానంటూ ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అజిత్ యాదవ్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సీఎం యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆయన్ను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ పోస్టు బుధవారం రాత్రి నుంచి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పోస్టుని గమనించిన పోలీసులు.. గురువారం తెల్లవారుజామున రుద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద అజిత్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై తాము దర్యాప్తు చేపట్టామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సంకల్ప్ శర్మ తెలిపారు. అతడ్ని వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు.
కాగా.. అజిత్ యాదవ్ తన సందేశంలో ఒక సంఘటన గురించి కూడా ప్రస్తావించాడు. అక్టోబర్ 2వ తేదీన డియోరియాలోని ఫతేపూర్ గ్రామంలో భూవివాదంపై నెలకొన్న హింసాకాండలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు వ్యక్తులతో కలిపి మొత్తం ఆరుగురు మృతి చెందిన విషయాన్ని ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఓ ప్రభుత్వ స్థలంలో ప్రేమ్ యాదవ్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించినట్లు స్థానిక న్యాయస్థానం గతంలో గుర్తించగా.. దానిని కూల్చివేస్తే తాను సీఎం యోగిని చంపేస్తానని ఆ పోస్టులో హెచ్చరించాడు. దీంతో.. అతని బెదిరింపులకు, ఆ ఘటనకి లింక్ ఉండొచ్చిని అనుమానిస్తున్నారు.
ఇంతకీ అక్టోబర్ 2న చోటు చేసుకున్న ఘటన ఏంటి?
జిల్లా పంచాయితీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్ (50), అతని ప్రత్యర్థి సత్యప్రకాష్ దూబే మధ్య చాలాకాలం వివాదం కొనసాగుతోంది. ఇది కాలక్రమంలో మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే.. దూబే, అతని కుటుంబ సభ్యులు కలిసి ప్రేమ్ యాదవ్‌పై దాడి చేసి హతమార్చారు. ఇందుకు ప్రతీకారంగా యాదవ్ మద్దతుదారులు దూబే ఇంటిపై దాడి చేసి.. అతనితో పాటు భార్య కిరణ్ (52), కుమార్తెలు సలోని (18) & నందాని (10), కుమారుడు గాంధీ (15)లను హత్య చేశారు.