Share News

2024: విజయాలతోమొదలై వివాదాలతోముగిసి...

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:51 AM

ఎప్పుడూ విజయాలు అపజయాలను మాత్రమే లెక్క వేసుకునే టాలీవుడ్‌ చిత్రపరిశ్రమను ఈ ఏడాది పలు వివాదాలు చుట్టుముట్టాయి.

2024: విజయాలతోమొదలై వివాదాలతోముగిసి...

ఎప్పుడూ విజయాలు అపజయాలను మాత్రమే లెక్క వేసుకునే టాలీవుడ్‌ చిత్రపరిశ్రమను ఈ ఏడాది పలు వివాదాలు చుట్టుముట్టాయి. సంక్రాంతి హిట్లతో జోరుగా మొదలైన ప్రయాణం అదే ఊపులో కొనసాగింది. అయితే ఒకదాని వెంట ఒకటిగా వచ్చిపడిన వివాదాలతోనే టాలీవుడ్‌ ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. మొత్తానికి 2024 వివాదాలతో గుర్తుండిపోతుందనేది సినీ విశ్లేషకుల మాట.

2024లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో నెటిజెన్స్‌ వెతికిన నటీనటులు ఎవరు? వారిలో మన దేశానికి చెందిన వారెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం మీకు తెలుసా? షారూక్‌.. సల్మాన్‌.. అల్లు అర్జున్‌.. ఇలా రకరకాల పేర్లు మీ మనసులో మెదులుతున్నాయి కదా.. కానీ వీరెవ్వరూ కాదు. ఈ ఏడాది గూగుల్‌ జాబితాలో పవన్‌ కళ్యాణ్‌ రెండో స్థానంలో.. హీనాఖాన్‌ ఐదో స్థానంలో.. నిమ్రత్‌ కౌర్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీనాఖాన్‌ గతంలో ‘‘యేరిస్తా క్యా ఖేల్‌తా హై’’, ‘‘కసూతి జిందగీ కే’’ మొదలైన సీరియల్స్‌లో నటించింది. తనకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చిందని ప్రకటించిన వెంటనే ఆమె గురించి తెలుసుకోవటానికి నెటిజెన్స్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేయటం మొదలుపెట్టారు. ఇక నిమ్రత్‌ కౌర్‌ బాలీవుడ్‌లో సుప్రసిద్ధ నటి. లంచ్‌బాక్స్‌, దస్‌వీ, ఎయిర్‌లిఫ్ట్‌ వంటి సినిమాలలో ఆమె నటించారు. ఆమె అభిషేక్‌ బచ్చన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన వెంటనే ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది.

gh.jpg

అవార్డులు

70వ జాతీయ పురస్కారాలు టాలీవుడ్‌కు నిరాశ మిగిల్చాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ ఎంపికైంది. తమిళ చిత్రం ‘తిరు చిత్రంబలం’కు గాను నిత్యామీనన్‌ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ ఎంపికైనా ఫోక్సో కేసు నేపథ్యంలో పురస్కారాన్ని కేంద్రం వెనక్కుతీసుకుంది. సినీ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా చిరంజీవి పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.


hj.jpg

గూగుల్‌ సెర్చ్‌లో రెండో స్థానం! పవన్‌ గురించి వెతికేశారు...

మొదటి పది స్థానాల్లో ఉన్న నటులు వీరే

1) కాట్‌ విలియమ్స్‌ (అమెరికన్‌ కమెడియన్‌)

2) పవన్‌ కళ్యాణ్‌

3) ఆడమ్‌ బ్రాడీ (అమెరికన్‌ నటుడు)

4) ఎల్లా పుర్‌నిల్‌ ( బ్రిటన్‌కు చెందిన నటి)

5) హీనా ఖాన్‌

6) కిరెన్‌ కుల్కిన్‌ (అమెరికన్‌ నటుడు)

7) టెర్రెన్స్‌ హవార్డ్‌ (అమెరికన్‌ నటుడు)

8) నిమ్రత్‌ కౌర్‌

9) సుటన్‌ ఫాస్టర్‌ (అమెరికన్‌ నటుడు)

10) బ్రిగెట్టి బోజో (వెనిజువెలా నటి)


hj.jpg

ఈ తారల సందడి లేదు

ఈ ఏడాది తెలుగులో కొందరు అగ్రహీరోయిన్‌ల సందడి అసలు కనిపించలేదు. వారు నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. గతేడాది సమంత నటించిన ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాలు విడుదలయ్యాయి. అవి రెండూ కూడా సమంతకు నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ఒక్కటి కూడా విడుదలవ్వలేదు. ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించినా అది ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే సమంత ‘సీటాడెల్‌: హనీబన్నీ’ వెబ్‌సిరీస్‌ ద్వారా అభిమానులను ఎంటర్‌టైన్‌ చేశారు.

మరో అగ్రకథానాయిక అనుష్క శెట్టి కూడా ఈ ఏడాది పెద్దతెరపై కనిపించలేదు. మూడేళ్ల విరామం తర్వాత ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెటి ్ట’తో గతేడాది టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్కశెట్టి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే అదే ఊపును ఆమె ఈ ఏడాది కొనసాగించలేకపోయారు. ఆమె నటించిన సినిమాలేవి 2024లో విడుదలవ్వలేదు. ఆ లోటు తీర్చేలా కొత్త ఏడాదిలో ‘ఘాటీ, కథనార్‌’ చిత్రాలతో ఆమె ప్రేక్షకులను అలరించనున్నారు. మరో సీనియర్‌ హీరోయిన్‌ త్రిష కూడా ఈ ఏడాది తెలుగు సినిమాల్లో కనిపించలేదు. చిరంజీవి సరసన నటించిన ‘విశ్వంభర’ విడుదల చివర్లో వాయిదాపడడంతో ఆమె ఎంట్రీ మిస్సయ్యింది. విజయ్‌ నటించిన ‘గోట్‌’ చిత్రంతో త్రిష ప్రత్యేక గీతంలో కనిపించారు. ఈ ఏడాది ధనుష్‌తో వివాదంతో వార్తల్లో నిలిచిన నయనతార కూడా తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేయలేదు. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘నయనతార: బియాండ్‌ ది ఫెరీ టేల్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయింది. టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించిన పూజాహెగ్డేకు వరుస అపజయాలు షాక్‌ ఇచ్చాయి. ‘రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య’ చిత్రాలు వరుసగా డిజాస్టర్‌ అవ్వడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె హిందీలో నటిస్తున్న ‘దేవా, హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’, తమిళంలో సూర్య, విజయ్‌ సరసన నటిస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది ఆమె ఒక్క తెలుగు సినిమా చేయలేదు.


j;k.jpg

పెళ్లి కళ

2024లో టాలీవుడ్‌కు పెళ్లి కళ కనిపించింది. పలువురు సినీతారలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరిలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేశారు. మార్చిలో హీరోయిన్‌ అదితీరావు హైదరీ, హీరో సిద్ధార్థ్‌ను పెళ్లాడారు. అలాగే కృతి కర్బందా, నటుడు పులకిత్‌ సామ్రాట్‌ ఒక్కటయ్యారు. తాప్సీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మతియాస్‌ బోని పెళ్లాడారు. జూలైలో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను పెళ్లాడారు. హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ రహస్య గోరఖ్‌ల వివాహం ఆగస్టులో జరిగింది. సెప్టెంబర్‌లో హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ తన స్నేహితుడు, ప్రియడు సాయి విష్ణుని వివాహం చేసుకున్నారు. గాయని గాయకులు రమ్యబెహరా, అనురాగ్‌ కులకర్ణి ప్రేమవివాహం ఆగస్టులో జరిగింది. ఈ నెల 4న నాగచైతన్య, శోభితా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. 12న గోవాలో కీర్తిసురేశ్‌ వివాహం వ్యాపారవేత్త ఆంతోని తట్టిల్‌తో జరిగింది. దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి, సందీప్‌రాజ్‌, నటుడు సుబ్బరాజు, సాయికిరణ్‌, శ్రీసింహ ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు.


gbhlj.jpg

చుట్టుముట్టిన వివాదాలు

ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమను పలు వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. యువ హీరో రాజ్‌తరుణ్‌పై లావణ్య అనే యువతి ఛీటింగ్‌ కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా అనే నటి వలలో పడి తనను దారుణంగా మోసగించాడని లావణ్య ఆరోపించింది. ఆర్‌.జె.శేఖర్‌ భాషా కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నారు. కొంత కాలానికి ఈ వివాదం సద్దుమణిగింది.

నటి సమంత- నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సమంత, అక్కినేని కుటుంబంతో పాటు చిత్రపరిశ్రమ సురేఖకు దీటుగా బదులిచ్చింది. నాగార్జున సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అలాగే నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత కూడా పతాక శీర్షికల్లో నిలిచింది.

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై ఆయన సహాయకురాలు లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసులో జానీ మాస్టర్‌ అరెస్ట్‌ అయి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆయనకు ఇచ్చిన జాతీయ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో డ్యాన్స్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ నుంచి ఆయన సభ్యత్యాన్ని రద్దు చేశారు.

సీనియర్‌ నటుడు మోహన్‌బాబు కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. మోహన్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని మనోజ్‌ పోలీస్‌ కేసు పెట్టారు. మనోజ్‌ ఆహ్వానం మేరకు వెళ్లిన మీడియాపై మోహన్‌బాబు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్టుకు గాయాలు కాగా, మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది.

నటి కస్తూరి తెలుగు ప్రజల పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ అంశంలో ఆమెను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట ఉన్నారు.

పుష్ప-2 బెనిఫిట్‌ షో చూడటానికి అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌కి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అరెస్టయిన బన్నీ బెయిల్‌పై విడుదలయ్యారు.

బెంగళూరు రేవ్‌ పార్టీలో అరెస్టయిన నటి హేమ కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల రామ్‌గోపాల్‌ వర్మపై కేసులు నమోదయ్యాయి. పోలీసులకు దొరక్కుండా కొన్నాళ్లు అజ్ఞాతవాసంలో గడిపిన వర్మ కోర్టు జోక్యంతో ఊరట పొందారు.


jkl.jpg

భారీ హిట్లు

మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, నాగార్జున

‘నా సామిరంగ’ చిత్రాలతో ఈ ఏడాది సంక్రాంతి విజయాలను అందుకున్నారు. ఇక చిన్నసినిమాగా బరిలోకి దిగిన ‘హను-మాన్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 300 కోట్లకు పైబడి వసూళ్లను సాధించి అబ్బురపరిచింది. వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ ప్రేక్ష కులను నిరాశపరిచింది. ‘టిల్లూ స్క్వేర్‌’ చిత్రంతో యువహీరో సిద్ధు జొన్నలగడ్డ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మార్చిలో విడుదలైన ఈ చిత్రం రూ. 130 కోట్ల వసూళ్లతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక ద్వితీయార్థంలో ప్రభాస్‌ తన పవర్‌ చూపించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడి’ చిత్రం రూ. వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా శివ కొరటాల దర్శకత్వం వహించిన ‘దేవర 1’ సినిమా టాలీవుడ్‌తో పాటు హిందీ బెల్ట్‌లోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాతో నాని మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కిరణ్‌ అబ్బవరం ఎదురుచూపులు ఫలించి, ఆయన హీరోగా నటించిన ‘క’ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్‌ మిస్టరీ కథతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. బ్యాంకింగ్‌ రంగంలో మోసాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ. వందకోట్ల వసూళ్లను అధిగమించింది. జాతీయ స్థాయిలో ‘పుష్ప 2’ ప్రభంజనం కొనసాగుతోంది. దాదాపు 12 వేలకు పైబడి స్ర్కీన్లలో విడుదలైన ఈ చిత్రం ఉత్తరాది బెల్ట్‌లో వీరవిహారం చేస్తోంది. రూ. 2 వేల కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది.

సుజాత V.P.L.

సైనిక్‌పురి, సికింద్రబాద్‌

Updated Date - Dec 29 , 2024 | 04:59 AM