Share News

సాగరంలో సాహసి

ABN , Publish Date - Dec 26 , 2024 | 06:37 AM

‘‘సముద్రంలో వేట ఎప్పుడూ కత్తిమీద సామే. ఎంత అనుభవం ఉన్నవారికైనా ప్రతి రోజూ ఒక అగ్నిపరీక్షే. పడవ ఎక్కి వెళ్ళినవారు సరుకు తీసుకొస్తారా? క్షేమంగా తిరిగొస్తారా?... మత్స్యకార కుటుంబాలను నిత్యం వేధించే ప్రశ్నలివి....

సాగరంలో సాహసి

ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ... బ్యాంకులో ఉద్యోగం... వీటికన్నా ‘ఫిషర్‌ఉమన్‌’ అనే గుర్తింపే తనకు ఎక్కువ సంతృప్తినిస్తోందంటోంది సుభిక్షా కుమార్‌.

తమిళనాడులోని పెరియతలైకి చెందిన ఈ 23 ఏళ్ల అమ్మాయి చేపల వేటలోనే కాదు...

ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, సీ-వ్లోగర్‌గా కూడా తనదైన ముద్ర వేస్తోంది.

‘‘సముద్రంలో వేట ఎప్పుడూ కత్తిమీద సామే. ఎంత అనుభవం ఉన్నవారికైనా ప్రతి రోజూ ఒక అగ్నిపరీక్షే. పడవ ఎక్కి వెళ్ళినవారు సరుకు తీసుకొస్తారా? క్షేమంగా తిరిగొస్తారా?... మత్స్యకార కుటుంబాలను నిత్యం వేధించే ప్రశ్నలివి. ఆ కష్టాలను, వేదనలను చూస్తూ పెరిగాను. సముద్రం నా జీవితంతో విడదీయలేని భాగం అయిపోయింది. నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోని పెరియతలై మత్స్యకారవాడలో. నా తల్లితండ్రులు పెద్దగా చదువుకోలేదు. కానీ నన్ను బాగా చదివించాలని మా నాన్న కుమార్‌ ఆశపడ్డారు. ఆయన కోరిక తీర్చడానికి కష్టపడి చదివాను. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలినయ్యాను. మా ఇంట్లో నేనే తొలి గ్రాడ్యుయేట్‌ను. ఒక ఫైనాన్స్‌ సంస్థలో, తరువాత ఒక ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగాలు చేశాను. ఆ సమయంలో ఎంతో ఒత్తిడిగా ఉండేది. ఇంటికి దూరంగా ఉండడం దానికి కారణం అనుకున్నాను. కానీ ఏదో వెలితి వెంటాడుతూ ఉండేది. ఇంతలో కొవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో లాక్‌డౌన్‌ విధించారు. దాంతో నా కుటుంబం నివసిస్తున్న తూత్తుకుడికి తిరిగి వచ్చాను. నేను కోల్పోతున్నదేమిటో అప్పుడు నాకు అర్థమయింది.


పట్టు వదల్లేదు...

‘‘మీతో నేనూ సముద్రంలో వేటకి వస్తా’’నని మా నాన్నతో అన్నప్పుడు... అది పరిహాసానికని అనుకున్నారు. ఎందుకంటే అది పురుషులకే పరిమితమైన వృత్తి. మగవాళ్ళు సముద్రంలోకి వెళ్ళి మత్స్య సంపదతో తిరిగి వస్తే... మహిళలు వాటిని వేరు చేసి, విక్రయిస్తూ ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది. వేటకి వెళ్ళే మహిళలు కొందరు ఉన్నారని విన్నాను, కానీ అది చాలా అరుదు. నేను పదేపదే అడగడంతో ‘‘పెరియతలై దగ్గర సముద్రం చాలా కల్లోలంగా ఉంటుంది. కెరటాలు చాలా బలంగా ఉంటాయి. పరిస్థితులు నిరంతరం సవాల్‌ విసురుతూ ఉంటాయి. నువ్వు మాతో వచ్చి ప్రమాదాల్లో పడడం నాకు ఇష్టం లేదు’’ చెప్పారు నాన్న. అయినా నేను మొండిపట్టు వదల్లేదు. చివరికి ‘‘సరే! ఒకసారి తీసుకువెళ్తాను. అంతా నీకే అర్థమవుతుంది’’ అన్నారు. ఇక... సముద్రంలో నా మొదటి అనుభవాన్ని ‘అద్భుతం’ అనే చెప్పాలి. అందరు మత్స్యకారుల్లాగానే మేము కూడా అర్థరాత్రి ఒంటి గంటకు ఫైబర్‌ పడవల్లో బయలుదేరాం. అవి అమావాస్య రోజులు. చాలా చీకటిగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు చెదిరిపోయిన వజ్రాల్లా మెరుస్తున్నాయి. ముందుకు వెళుతున్న కొద్దీ సముద్రం అందాన్ని చూసి నేను మైమరచిపోయాను. అదే సమయంలో చాలా ఎత్తుగా లేస్తున్న అలలు పడవను పైకి లేపి, మళ్ళీ కింద పడేస్తున్నప్పుడు... చాలా భయం వేసింది. మెల్లగా అలవాటు పడ్డాను. వలలు విసరడం, లాగడం, చేపల్ని పడవలో కుప్పలు పోయడం... ఇలా అన్ని పనులు ఉత్సాహంగా చేశాను. ఉదయం పది గంటలకు తిరిగి తీరాన్ని చేరుకున్నాం. ఆ తరువాత నాన్నకు నామీద నమ్మకం వచ్చింది. అప్పటినుంచి నేను కూడా వాళ్ళ బృందంలో భాగమైపోయాను.


అదే పెద్ద సమస్య...

సముద్రంలో వేటకు కేవలం శరీర దారుఢ్యం మాత్రమే కాదు, ధైర్యం కూడా కావాలి. రకరకాల చేపలను, రొయ్యలను పట్టుకోడానికి వివిధ రకాల వలలు ఉపయోగించాలి. సముద్రంలోకి వలలు విసిరేటప్పుడు, వాటిని సముద్రంలోకి లాగేటప్పుడు చాలా కచ్చితత్వంతో పని చెయ్యాలి. కల్లోలంగా ఉండే కెరటాల్లో, తుపాను వాతావరణంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త, సమయస్ఫూర్తి అవసరం. సాధారణంగా మా బృందంలో నాన్న, నేను, నా తమ్ముడు లియాండర్‌, మరికొందరు సహాయకులు ఉంటాం.. సుమారు పన్నెండు నాటికల్‌ మైళ్ళ వరకూ మా ప్రయాణాలు సాగుతాయి. ఇంత చేసినా కొన్ని రోజులు ఖాళీ చేతుల్తో వెనక్కి రావలసి ఉంటుంది. ఇదివరకు మా నాన్న ఏదీ దొరక్క విచారంగా వెనక్కి రావడం చూసేదాన్ని. ఇప్పుడు అది నా అనుభవంలోకి వచ్చింది. మహిళగా నాకు ఎదురైన సమస్య... పడవల్లో కనీస సదుపాయాలు ఉండకపోవడం. సముద్రం మధ్యలో టాయిలెట్‌కు వెళ్ళాల్సి వస్తే చాలా కష్టం. దాన్ని అధిగమించడం నేర్చుకున్నాను.


గర్వంగా ఉంది...

ఈ వృత్తి నాకు కొత్త ఆదాయ మార్గాలను కూడా చూపించింది. ఇప్పుడు నేను విజయవంతమైన సీఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ని. చేపలతో, రొయ్యలతో ఏడు రకాల పచ్చళ్ళను తయారు చేస్తున్నాను. వాటిని స్థానికంగానే కాదు, ఇన్‌స్టాగ్రామ్‌ సాయంతో విక్రయిస్తున్నాను. విదేశాలకు వెళ్ళేవారు కూడా వాటిని కొంటున్నారు. దీనిద్వారా మరికొందరు మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నాను. అలాగే మత్స్యకారుల జీవితాన్ని, సముద్రం అందాలను ప్రజలకు చూపించడానికి ‘సీ వోగ్లర్‌’గానూ మారాను. మా ప్రయాణాలను, ప్రజలకు సముద్ర ఉత్పత్తుల అందించడానికి మత్స్యకారులు చేసే సాహసాలను, చేపల వేటలో మెళకువలను వీడియోలు తీసి పోస్ట్‌ చేస్తున్నాను. నా యూట్యూబ్‌ ఛానెల్‌కు 2.5 లక్షల మంది సబ్‌స్రైబ్రర్లు, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు 1.34 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దక్షిణాదిలో ‘ఏకైక మహిళా సీ వ్లోగర్‌’ నేనే కావడం గర్వంగా ఉంది. మహిళలు కూడా ఈ వృత్తిలో రాణించగలరనడానికి నేనే ఉదాహరణ. ఒకప్పుడు నేను ఎదుర్కొన్న ఒత్తిడి ఇప్పుడు మాయమయింది. తరతరాల వారసత్వమైన ఈ వృత్తిని కొనసాగిస్తున్నందుకు సంతృప్తిగా ఉంది. ఒక విధంగా ఇది నా మూలాల్లోకి నేను చేస్తున్న ప్రయాణం. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించడం, వీలైనన్ని ప్రాంతాలకు పర్యటించి, సముద్రపు వేటలో కొత్త నైపుణ్యాలు తెలుసుకోవడం... ప్రస్తుతానికి ఇవీ నా లక్ష్యాలు.’’

Updated Date - Dec 26 , 2024 | 06:37 AM