Share News

Ahana Krishna : ‘అహా’నా స్టైలంటా!

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:05 AM

ట్రెండ్‌ను ఫాలో అవదు... అలాగని ట్రెండ్‌ను సెట్‌ చేయదు. కానీ ఆమెకంటూ ఒక ట్రెండ్‌ ఉంది. సినిమాల్లో నటిస్తూనే... సామాజిక మాధ్యమాల్లో యమ బిజీగా ఉంటుంది. నచ్చింది చేస్తూ... విభిన్న డ్రెస్సుల్లో

 Ahana Krishna : ‘అహా’నా స్టైలంటా!

ట్రెండ్‌ను ఫాలో అవదు... అలాగని ట్రెండ్‌ను సెట్‌ చేయదు. కానీ ఆమెకంటూ ఒక ట్రెండ్‌ ఉంది. సినిమాల్లో నటిస్తూనే... సామాజిక మాధ్యమాల్లో యమ బిజీగా ఉంటుంది. నచ్చింది చేస్తూ... విభిన్న డ్రెస్సుల్లో ఆకట్టుకొంటూ... ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తుంది. నవతరం ఫ్యాషన్‌ ఐకాన్‌గా ‘ఇన్‌స్టా’ంట్‌గా వేలకు వేలు లైక్‌లు కొట్టేస్తున్న మళయాళ మనోహరి... అహానా కృష్ణ ట్రెండీ టచ్‌ ఇది.

మళయాళ చిత్ర పరిశ్రమలోనే ప్రధానంగా పని చేస్తున్నా... సామాజిక మాధ్యమాల్లో సరిహద్దులు దాటిన అభిమానం ఉంది అహానా కృష్ణకు. ఇన్‌స్టాగ్రామ్‌లో ముప్ఫై లక్షలకు పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లో పదిహేను లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్‌ దీనికి అదనం. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న అహానా... సామాజిక మాధ్యమాల్లో పెట్టే ప్రతి పోస్ట్‌కూ క్షణాల్లో లైక్‌లు లక్ష దాటుతున్నాయి.

పదేళ్ల కిందట పరిశ్రమలో ప్రయాణం మొదలుపెట్టినా... ఇప్పటికి ఆమె నటించిన చిత్రాలు పది దాటలేదు. కానీ స్టార్‌ హీరోయిన్లకు తీసిపోని ఫాలోయింగ్‌. అందుకు ముఖ్య కారణం... నెట్టింట ఆకట్టుకొనే ఆమె డ్రెస్సింగ్‌ స్టయిల్‌. పాశ్చాత్య వస్త్రధారణలో అహానా లుక్‌ ఎంతగా అలరిస్తుందో... సంప్రదాయ దుస్తుల్లోనూ అంతే అబ్బుర పరుస్తుంది. రెండిటికీ సమప్రాధాన్యం ఇస్తుంది ఈ నటి. బ్లాక్‌ లేస్‌ అవుట్‌ఫిట్‌లో ఫొటోషూట్‌ చిత్రాలను అహానా ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. గంటల వ్యవధిలోనే ఆ ఫొటోలకు లెక్కకు మించి లైక్‌లు వచ్చాయి. వేలల్లో నెట్టింట చక్కర్లు కొట్టాయి. అంతకుముందు ఆఫ్‌ షోల్డర్‌ టాప్‌, టై హై స్లిట్‌ ప్యాంట్‌తో మెరిసిన ఫొటోలూ తక్కువేంకాదు. లక్షకు పైగా లైక్‌లు సంపాదించాయి.

మళయాళ నటుడు కృష్ణ కుమార్‌ నలుగురు కూతుళ్లలో అహానా పెద్దమ్మాయి. అహ్మాదాబాద్‌ ‘ముద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌’లో అడ్వర్‌టైజింగ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌లో పీజీ చదివింది. ఆమె స్వస్థలం కేరళ రాజధాని తిరువనంతపురం. సరిగ్గా పదేళ్ల కిందట తొలిసారి వెండితెర మీద తళుక్కుమంది. కథాబలంతో పాటు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకొంటూ... అడుగులు వేస్తోంది. మాధ్యమం ఏదన్నది ఆమెకు ముఖ్యం కాదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ... తనకు పేరు తెస్తాయనుకున్న కథలను ఓకే చేస్తూ... ఒక విభిన్నమైన కెరీర్‌ను నిర్మించుకుంది. అందులో భాగంగానే వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది. కొన్ని మ్యూజిక్‌ వీడియోల్లోనూ కనిపించి.. అన్ని వర్గాల అభిమానులకూ చేరువ అయ్యే ప్రయత్నం చేస్తోంది. రెండు మూడు పాటలూ పాడి... తన సంగీత అభిరుచినీ చాటుతోంది.

ఇవన్నీ ఒకటైతే... సామాజిక మాధ్యమాల్లో ఆమె ట్రెండీ టచ్‌ మరొక ఎత్తు. ఫ్యాషన్‌పై తన ఆసక్తితో పాటు... విభిన్నమైన వస్త్రధారణతో ఫ్యాషన్‌ ఐకాన్‌ గానూ వేలమంది మనసు దోచుకొంటోంది. ఇదే ఆమెకు సినిమాలకు మించి గుర్తింపు తెచ్చి పెడుతోంది. డ్రెస్సింగ్‌లోనూ ఆమెకంటూ ఒక అభిరుచి ఉంది. ఎక్కువగా వి-నెక్‌ టాప్స్‌, డ్రెస్‌లు ఇష్టపడే ఈ తార... ఆకర్షణీయమైన రంగులు, పాలెట్స్‌, ప్యాటరన్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. సంప్రదాయ సల్వార్‌ సూట్‌ అయినా... వెస్టరన్‌ అవుట్‌ఫిట్స్‌ అయినా... ఆమె ధరిస్తే ‘ఆహా’ అనాల్సిందే. కళ్లు చెదిరే వర్ణాలు, హుందాగా కనిపించే వస్త్రశ్రేణులు, సరికొత్త హంగులతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనకాడదు. ‘హీరామండీ’ స్ఫూర్తితో ఇటీవల ఆమె చేసిన ఓ డిజైన్‌... నెటిజనులనే కాదు, ఫ్యాషన్‌ పండితులను కూడా మైమరిపించింది. స్టయిలిష్‌ జంప్‌సూట్స్‌, స్వెటర్స్‌, టీషర్ట్స్‌, క్యాజువల్‌ అవుట్‌ఫిట్స్‌ కలెక్షన్‌ అహానా వద్ద లెక్కకు మించి ఉన్నాయి. యువత అభిరుచిని, నయా ట్రెండ్‌ను పట్టేయడం, ఏ వెరైటీ అయినా తనకు నప్పేలా మార్చుకోవడం... ఇవే అహానాను స్టైల్‌ ఐకాన్‌ను చేశాయి.

Updated Date - Jun 26 , 2024 | 05:05 AM