Women Entrepreneurs: ఊహలకు రెక్కలు తొడిగి...
ABN , Publish Date - Dec 04 , 2024 | 04:53 AM
ఇద్దరు యువతులు... చదువు అవ్వగానే ఉద్యోగం... అక్కడ స్నేహం. కొత్తగా ప్రయత్నించాలనే ఉత్సాహం... తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే తాపత్రయం.
ఇద్దరు యువతులు... చదువు అవ్వగానే ఉద్యోగం... అక్కడ స్నేహం. కొత్తగా ప్రయత్నించాలనే ఉత్సాహం... తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే తాపత్రయం. ఇరువురి ఆలోచనలు కలిశాయి. వాటిని ఆచరణలో పెట్టడం కోసం... కొలువులు వదిలి... కలలగన్న లోకంలోకి అడుగుపెట్టారు. ఊహలకు ర్కెలు తొడిగి... వినోద పరిశ్రమకు సృజనాత్మక హంగులు అద్దుతున్నారు. బాలీవుడ్ తారలు, ప్రముఖ బ్రాండ్‌ల ప్రాజెక్టులకు రూపకర్తలై... అభినందనలే కాదు... నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. ఆన్యా జైన్, మేఘనా సెహగల్ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
అందాల తార అనన్యా పాండే నటించిన ‘కాల్ మీ బే’ ఓటీటీ సిరీస్ ప్రారంభ సన్నివేశం చూసేవుంటారు. కాలేజీని తలపించే డిజైన్, యువతరాన్ని ప్రతిబింబించేలా యానిమేషన్... ఆ సిరీస్‌కు అదనపు ఆకర్షణ అయ్యాయి. అలాగే అమితాబ్‌బచ్చన్ మనవరాలు, శ్వేత నందా కూతురు నవ్య నవేలీ నందా ‘వాట్స్ ద హెల్ నవ్య’ పాడ్‌కాస్ట్ కూడా! అందులో నవ్య... నవతరం యువతీ యువకుల మధ్య సాన్నిహిత్యం, ప్రేమ, మహిళల నిర్ణయాధికారానికి సంబంధించిన అంశాలను చర్చిస్తుంది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఏమేం అంశాలు ఉండాలో, ఎలాంటి చర్చలు పెట్టాలనేది ఆన్యా జైన్, మేఘనా సెహగల్ సూచిస్తారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో సారూప్యత ఏమిటంటే... యువతులు, తెలివైన మహిళలు కేంద్రంగా సాగే కార్యక్రమాలు. ఇలా విజయవంతమైన ప్రాజెక్టులను తెరపైనే కాదు... తెర వెనుక కూడా నడిపిస్తున్నారు వీరు.
ప్రతికూలతలను అనుకూలంగా...
ఓటీటీ షోలు, బడా బ్రాండ్‌లకు వినూత్నమైన ప్రచార చిత్రాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆన్య, మేఘన. దాని కోసం ‘రన్ ఫ్రెన్‌జీ’ పేరుతో ఏడాదిన్నర కిందట ప్రొడక్షన్ ఏజెన్సీని నెలకొల్పారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ జంటగా కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ‘చిన్నపిల్లలు... మీవల్ల ఏమవుతుంద’ని అన్న చోటనే ‘మీరైతేనే చేయగలర’ని అనిపించుకున్నారు. ఆన్యా వయసు 23. మేఘనాకు 27. ప్రతికూల పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా మలుచుకోగల సమర్థులు ఈ ఇద్దరూ. అందుకు వారు పెట్టిన పెట్టుబడి... సృజనాత్మక ఆలోచనలు. ఆత్మవిశ్వాసంతో వేసే అడుగులు.
ఉద్యోగం వదిలి...
కలలను ఛేదించే క్రమంలో ఇద్దరూ సొంత ఊళ్లను వదిలి ముంబయికి వచ్చారు. ఆన్యా స్వస్థలం ఢిల్లీ. మేఘనది కోల్‌కత. ఇద్దరూ కలిసి ఓ కంపెనీలో పని చేశారు. అక్కడే వీరికి పరిచయం ఏర్పడింది. ఓ ప్రాజెక్టు కోసం ఢిల్లీ వెళ్లే క్రమంలో ఒకే విమానం ఎక్కారు. ఆ సమయంలోనే ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకున్నారు. అప్పుడే వారికి అర్థమైంది... తామిద్దరి ఆలోచనలే కాదు, లక్ష్యాలూ ఒకటేనని. తను అనుకున్నది సాధించాలనే పట్టుదలతో అప్పటికే చేస్తున్న ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంది ఆన్య. రాజీనామా ఇచ్చి నోటీస్ పిరియడ్‌లో కొనసాగుతోంది. విషయం తెలసుకున్న మేఫ ున... తిరిగి ముంబయికి రాగానే కొలువుకు స్వస్తి చెప్పింది. ఇద్దరూ కొద్ది రోజుల్లోనే రెండు మూడు ప్రాజెక్టులు దక్కించుకున్నారు. వాటిని విజయవంతంగా పూర్తి చేశాక... తమకంటూ ఒక బ్రాండ్ ఉండాలనే ఉద్దేశంతో ‘రన్ ఫ్రెన్‌జీ’ ప్రారంభించారు. అది మొదలు... వినూత్న, సృజనాత్మక ఆలోచనలతో నవతరాన్ని మెప్పించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. బాలీవుడ్‌ను డిజిటల్ యుగం వైపు మళ్లిస్తున్న ద్వయంగా కూడా కొందరు వీరి గురించి గొప్పగా చెబుతున్నారు.
నటి కావాలనుకొని...
హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకోవాలన్నది మేఘన చిన్ననాటి కల. ‘ఎప్పుడూ అమ్మానాన్నలకు చెప్పేదాన్ని... నేను నటి కావాలని అనుకొంటున్నానని. అయితే ఆ కలను నెరవేర్చుకొనే మార్గాలు అప్పుడు నాకు తెలియదు. విచిత్రమేమంటే... అనుకోకుండా ఇవాళ నేను బాలీవుడ్ పరిశ్రమలోనే ఉన్నాను. కాకపోతే కెమెరా వెనుక’ అంటుంది మేఘన. బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివిన ఆన్య కోరిక... మీడియా రంగంలో స్థిరపడాలని. కొన్ని ప్రయత్నాల తరువాత అనూహ్యంగా ‘భూల్ భులాయా2’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం దక్కింది. ‘ఆ చిత్రం పూర్తయ్యాక అనుకున్నాను... దర్శకత్వం మీద దృష్టి పెట్టకూడదని. ఎందుకంటే అక్కడ సెట్‌ను నిర్వహించే తీరు నాకు నచ్చింది. నటులు, సాంకేతిక నిపుణులు, బడ్జెట్... ఇలా సినిమాకు సంబంధించి అన్నీ అందులో ఇమిడి ఉంటాయి. దాని నిర్వహణ అంత సులువు కాదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అలాంటి సవాళ్లను స్వీకరిస్తేనే కదా... మనమేంటో ప్రపంచానికి తెలిసేది. ఆ స్ఫూర్తితో క్రియేటివ్ ప్రొడక్షన్ అయితే నా ఆలోచనలకు సరిగ్గా సరిపోతుందని భావించాను. కారణం... మనలోని సృజన కు రెక్కలు తొడగవచ్చు. అదే సమయం లో సెట్ నిర్వహణ చూసుకోవచ్చు. దీనికి మేఘన కూడా జత కలవడంతో నా పని సులువైంది’ అంటూ చెప్పుకొచ్చింది ఆన్య.
అనుభవం లేదన్నవారే...
‘‘మొదట్లో చాలామంది మా వయసు చూసి ప్రాజెక్టులు అప్పజెప్పడానికి సంకోచించారు. అనుభవం లేదని తిప్పి పంపారు. కానీ మేమిద్దరం కలిసి గతంలో ఎడిటర్లు, డిజైనర్లు, వీడియోగ్రాఫర్లు... ఇలా అందరితో పని చేశాం. సృజనాత్మకంగానే కాదు, వినూత్నంగా, నవతరాన్ని మెప్పించే సామర్థ్యం మాలో ఉందనేది మా నమ్మకం. ఆ ఆత్మవిశ్వాసం తోనే ముందడుగు వేశాం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ, మేమేంటో నిరూపించు కున్నాం. కాదన్నవారు, అనుభవం సరిపోదన్న వారే ఇప్పుడు మాకు వరుస ప్రాజెక్టులు ఇస్తున్నారు. తమ అంచనాలకు మించి మా పనితనం ఉందంటూ అభినందిస్తున్నారు’’ అంటుంది ఈ మిత్ర ద్వయం.
బడా బ్రాండ్‌ల వరుస...
ఏడాది తిరిగేలోపే బడా బ్రాండ్‌లు ఈ జంట కోసం వరుస కట్టాయి. ‘క్రెడ్, డిస్నీ హాట్‌స్టార్, లవ్ చైల్డ్ బై మసాబా, గూగుల్ పిక్సెల్, బుక్ మై షో, ఎన్‌బీఏ స్టైల్, టీరా బ్యూటీ... ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ‘కాఫీ విత్ కరణ్’ కోసం ఆన్య, మేఘన చేసిన యూట్యూబ్ ప్రోమోలు, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్, డిజైన్లు, యానిమేషన్లు అయితే మరో స్థాయిలో ఉన్నాయనేది బాలీవుడ్ మాట. ప్రస్తుతం తమ సంస్థను ఐరోపాల్లో కూడా విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు ఈ ఇద్దరు. సృజనాత్మకత, కష్టపడే తత్వంతోపాటు క్రమబద్ధమైన ఒక వ్యవస్థను నెలకొల్పడమే తమ విజయానికి కారణం అంటారు.