Share News

ఆత్మను ఎవరైనా చూశారా?

ABN , Publish Date - Dec 20 , 2024 | 06:43 AM

పాయాసి తన రెండో వాదాన్ని సమర్ధించుకుంటూ ‘‘ఒకవేళ ఈ లోకంలో చేసిన సత్కర్మల ఫలితం స్వర్గలోకంలోనే దొరికితే...

ఆత్మను ఎవరైనా చూశారా?

పాయాసి తన రెండో వాదాన్ని సమర్ధించుకుంటూ ‘‘ఒకవేళ ఈ లోకంలో చేసిన సత్కర్మల ఫలితం స్వర్గలోకంలోనే దొరికితే... ఆ ఫలాన్ని స్వర్గలోకంలోనే అనుభవించాలి కదా! వాటిని అనుభవించడానికి మళ్ళీ ఈ లోకానికి ఎందుకు రావాలి? అలాగే... పుణ్యకర్మలను ఆచరించే మానవులు ఆత్మహత్య ఎందుకు చేసుకోరు? ఆత్మహత్య ద్వారా వారు త్వరగా స్వర్గలోకానికి చేరుకొని, అక్కడ సకల భోగాలు అనుభవించవచ్చు కదా?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు కుమార కాశ్యపుడు ‘‘మునుపు ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్యకు ఒక కొడుకు ఉన్నాడు. రెండో భార్య గర్భవతిగానే ఉంది. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తి మరణించాడు. ఆ తరువాత మొదటి భార్య కొడుకు తన సవతి తల్లితో ‘‘ఈ ఇంట్లో నీదంటూ కించిత్తు ఆస్తి కూడా లేదు’’ అన్నాడు. తనకు కొడుకు పుడితే వాడికి కూడా ఆస్తిలో సగభాగం ఉంటుందనీ, అమ్మాయి పుడితే ఆ బిడ్డను పోషించే బాధ్యత పెద్ద భార్య కొడుకుదేననీ ఆమె చెప్పింది. కానీ ఆ పిల్లవాడు ‘‘ఈ ఇంట్లో నీదంటూ కించిత్తు ఆస్తి లేదు’’ అనే మాటను పదేపదే వల్లిస్తూ ఉండేవాడు. అతడి ప్రవర్తనతో భీతిల్లిన ఆమె ప్రసవ సమయం రాకముందే బిడ్డను కనాలని తన పొట్టను కోసుకుంది. ఫలితంగా ఆమె మరణించడమే కాదు, ఆమె గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. అందుకే ఓ రాజా! పుణ్యాత్ములు స్వర్గప్రాప్తికోసం త్వరపడరు. కర్మ పరిపాకం కోసం ప్రతీక్షిస్తూ, ప్రజలకు మేలు చేస్తూనే ఉంటారు’’ అని చెప్పాడు.

దాన్ని చూడలేరు...

ఆ తరువాత తన మూడోవాదాన్ని పాయాసి వినిపిస్తూ ‘‘ఒకవేళ ఆత్మే గనుక ఉన్నట్టైతే, అది శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవడం వల్లే మరణం సంభవిస్తుందని భావిస్తే... మరి మరణం తరువాత మనిషి నుంచి ఆత్మ ఎక్కడి నుంచి, ఎలా బయటకు వెళుతుంది? దీన్ని ఎవరైనా చూశారా? మరణించే మనిషిని గమనిస్తున్నప్పుడు... ఆత్మ ఎప్పుడు, ఎలా బయటకు వెళుతుంది? శరీరంలోని ఏ అంగం ద్వారా బహిర్గతం అవుతుంది? అనే విషయం అంతుపట్టదు. పైగా ఆత్మ శరీరాన్ని వదిలిన తరువాత.. మరణించిన వ్యక్తి శరీరం తేలిక కావడానికి బదులు మరింత బరువవుతుంది’’ అన్నాడు. ఈ వాదాన్ని కుమార కాశ్యపుడు ఖండిస్తూ ‘‘మరణ సమయంలో ఆత్మ బయటకు వెళుతుంది. కానీ దాన్ని ఎవరూ చూడలేరు. అది ఎలా అంటే... స్వప్నంలో జీవుడు రకరకాల స్థలాలలో పరిభ్రమిస్తూ... తనకు ఇష్టం వచ్చినదాన్ని చూస్తాడు. తనకు ఇష్టం వచ్చిన దానిలోకి వెళ్తాడు. కానీ అతణ్ణి ద్వారపాలకుడు కానీ, తోటమాలి కానీ ఆపలేడు సరికదా.. కనీసం చూడనైనా లేరు. అలాగే ప్రాణం, శ్వాస, జ్ఞానేంద్రియాలతో కూడి ఉన్నప్పుడు శరీరం తేలికగా ఉంటుంది. కానీ అవి లేనప్పుడు బరువెక్కిపోతుంది. ఇలా వీటి ఆధారంగా జీవుడు పరలోకానికి వెళ్ళడు, అసలు ‘పరలోకం లేదు’ అనడం మూర్ఖత్వం అన్నాడు. అయితే ఇక్కడ కుమార కాశ్యపుడు ఆత్మకు బదులు ఆయుర్విజ్ఞాన వాయువులను పేర్కొన్నాడు. వాటిని ‘ఆత్మ’ అని అనలేదు. ఆత్మ లేదని కూడా చెప్పలేదు. కానీ పరలోకాల గురించి చాలా దృఢంగా ప్రతిపాదించాడు. అతని మాటల్లో స్థవిరవాదుల సిద్ధాంతం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాచీన బౌద్ధులు శరీరాంతర్గతమైన చైతన్యాన్ని సూటిగా కాకుండా మరో విధంగా ఒప్పుకున్నారు. కాగా పాయాసి మళ్ళీ తన సిద్ధాంతాన్ని చైతన్యం ఆధారంగా సమర్థించుకోవాలని ప్రయత్నించాడు. ‘‘ఇంద్రియాలన్నీ ఉన్నా మరణం ఆసన్నమైన వ్యక్తి ఎందుకు చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు కుమార కాశ్యపుడు ‘‘శంఖానికి ధ్వనించే శక్తి ఉన్నా... ఒక వ్యక్తి దాన్ని తీసుకొని ఊదేవరకూ ధ్వనించదు. అదే విధంగా శరీరంలో ఆయువు, శ్వాస, విజ్ఞానం ఉన్నప్పుడే దానిలో చలనం ఉంటుంది. ఇవన్నీ శరీరంలో ఉన్నప్పుడే ఇంద్రియాలు తమతమ విషయాలను గ్రహించగలుగుతాయి’’ అని చెప్పాడు.


పద్ధతి సరైనది కాకపోతే...

చివరిగా... జీవుడు శరీరం నుంచి వేరయ్యే దృశ్యాన్ని చూడాలని పాయాసి అనుకున్నాడు. మరణం దగ్గరపడిన ఒక వ్యక్తిని ఖండ ఖండాలుగా నరికి, ఆత్మ శరీరం నుంచి ఎలా బహిర్గతం అవుతుందో చూడడానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం విఫలమైంది. జీవుడు కనిపించలేదు. దాంతో అతనిలోని నాస్తికత ఇంకా దృఢపడింది. పాయాసి నాస్తికతను పోగొట్టడానికి బుద్ధుడి శిష్యుడైన కుమార కాశ్యపుడు చాలా ప్రయత్నించాడు. అగ్ని ప్రజ్వలించే ప్రక్రియను ఉదాహరిస్తూ ‘‘అరణ్యంలో ఉండే ఒక అగ్ని ఉపాసకుడికి ఒక పిల్లవాడు లభించాడు. ఆ పిల్లవాణ్ణి అతను పెంచాడు. ఆ బాలుడు పెరిగి పన్నెండేళ్ళ వయసువాడయ్యాడు. ఒక రోజు ఆ అగ్ని ఉపాసకుడు దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్తూ,, తన అగ్ని ప్రజ్వలన కార్యాన్ని పిల్లవాడికి అప్పగించాడు. అగ్ని ఒకవేళ ఆరిపోతే... ఈ కర్రలు సమిధులు తదితరాలను ఉపయోగించి మళ్ళీ ప్రజ్వరిల్లజేయమన్నాడు. అతను వెళ్ళాక ఆ పిల్లవాడు ఆటలలో మునిగి అగ్నిహోత్రాన్ని పట్టించుకోకపోవడంతో... అది చల్లారిపోయింది. దాన్ని రాజెయ్యడానికి అతను ప్రయత్నించినప్పప్పటికీ, అతను అనుసరించిన పద్ధతి సరైనది కాకపోవడంతో ఫలితం లేకపోయింది. కొద్దిరోజుల తరువాత ఆ అగ్ని ఉపాసకుడు తిరిగి వచ్చాడు, అగ్ని చల్లారిన విషయం గ్రహించాడు. ఆ పిల్లవాడితో ‘‘నీకు అగ్ని పుట్టించే పద్ధతి తెలియదు. అందుకే నీవు చేయలేకపోయావు’’ అన్నాడు. తరువాత అరణులను ఉపయోగించి త్వరగా అగ్నిని వెలిగించాడు. కాబట్టి ఓ రాజా! నువ్వు కూడా అవివేకి అయిన బాలుడిలా... సరైన పద్ధతి లేకుండా పరలోకాన్ని అన్వేషిస్తున్నావు. ఈ వ్యర్థమైన పరలోక చింతనలో నీ జీవితం దుఃఖమయం అయిపోగలదు’’ అంటూ పాయాసి వాదనలన్నిటినీ ఖండించాడు. పరలోకం ఉందని, పాపపుణ్యాలు, వాటి ఫలితాలు ఉన్నాయని నిరూపించాడు.

(ఆధారం: ‘సుత్తపిటకం’లోని ప్రథమ నికాయమైన ‘దీఘనికాయం’లో భాగమైన పాయాసి

రాజ సుత్తము)

పాయాసి పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎలాంటి సాధన లేకుండానే తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఆ విషయం అతనికి అర్థం కాలేదు. అందుకే అతను పాలీ సాహిత్యంలో ఒక మిధ్యా వాదిగా, భౌతిక వాదిగా మిగిలిపోయాడు. బుద్ధ భగవానుడి శిష్యులు నాస్తికతను, భౌతికతను ఖండించి, సమాజంలో ఆస్తికతను పెంపొందించారు. దానికి పాయాసి- కుమార కాశ్యపుల వృత్తాంతం బలమైన నిదర్శనం.

Updated Date - Dec 20 , 2024 | 06:44 AM