Share News

ఆమ్‌ ఆద్మీ... ఆతిశీ

ABN , Publish Date - Sep 18 , 2024 | 06:09 AM

విద్యావేత్త... ఉద్యమాల బాట... సమాజం పట్ల బాధ్యత... రాజకీయ చతురత... అన్నీ కలిపితే ఆతిశీ మార్లినా సింగ్‌. త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమె... ఆ పీఠం అధిరోహించనున్న అతిపిన్న

ఆమ్‌ ఆద్మీ... ఆతిశీ

విద్యావేత్త... ఉద్యమాల బాట... సమాజం పట్ల బాధ్యత... రాజకీయ చతురత... అన్నీ కలిపితే ఆతిశీ మార్లినా సింగ్‌. త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమె... ఆ పీఠం అధిరోహించనున్న అతిపిన్న వయస్కురాలిగానూ చరిత్ర సృష్టించనున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ... ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత కానున్నారు. ఈ ప్రస్థానంలో పూల వర్షాలే కాదు... పార్టీ కోసం కఠిన పరీక్షలు, సవాళ్లు అన్నిటినీ స్వీకరించారు.

ఆతిశీ మార్లినా సింగ్‌... ఇప్పుడు ఈ పేరు దేశంలో ఒక సంచలనం. నవ శకానికి శ్రీకారం. ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనం అధిష్టించిన మూడో మహిళగానే కాదు... అక్కడి విద్యా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తిగా... నవతరం మెచ్చిన రాజకీయ శక్తిగా ఎదిగిన నేపథ్యం ఆమెది. దేశ రాజధానిలో పుట్టి పెరిగిన ఆతిశీ తల్లితండ్రులు విజయ్‌సింగ్‌ తోమర్‌, త్రిప్తా వాహి... ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు. పంజాబీ మూలాలున్న కుటుంబం. మార్క్స్‌, లెనిన్‌ కలిపి తమ కూతురి పేరులో ‘మార్లినా’ జోడించారు ఆతిశీ తల్లితండ్రులు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు తన ఇంటిపేరు తొలగించి, ‘ఆతిశీ’ మాత్రమే ఉంచుకున్నారు. ‘ప్రజలు నా పని గురించి మాట్లాడాలి. నా వారసత్వం గురించి కాకూడదని భావించి ఆ నిర్ణయం తీసుకున్నా’ అని ఓ సందర్భంలో చెప్పారామె.


రేసులో ముందు...

ఢిల్లీ కేబినెట్‌లో ఒకేఒక్క మహిళా మంత్రి ఆతిశీ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లేకపోయినా... తొలిసారి మంత్రి పదవి చేపట్టినా... ఆమె ఎంతో పరిణతి కనబరిచారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొంది... అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమెకు రాజకీయ గురువు ‘ఆప్‌’ (ఆమ్‌ ఆద్మీ పార్టీ) అధినేత కేజ్రీవాల్‌. అవినీతి ఆరోపణలపై గత మార్చిలో ఆయన అరెస్టయిన నాటి నుంచి ఆతిశీ... ఢిల్లీ రాజకీయాల్లో కేంద్ర బిందువయ్యారు. పార్టీని ముందుండి నడిపించారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్‌ సిసోడియా అరెస్టు తరువాత... ఆయన స్థానంలో కేబినెట్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆతిశీ 14 శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వాటిల్లో ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా శాఖతో పాటు కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, స్త్రీశిశు సంక్షేమం, నీటిపారుదల వంటి శాఖలు ఉన్నాయి.

కేజ్రీవాల్‌ బెయిలుపై బయటకు వచ్చాక తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సీఎం రేసులో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌తో పాటు సౌరబ్‌ భరద్వాజ్‌, గోపాల్‌ రాయ్‌, కైలాస్‌ గెహ్లాట్‌ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు ఆతిశీకి పట్టం కట్టారు. వాస్తవానికి కేజ్రీ జైలుకు వెళ్లినప్పుడు ఆయన వారసురాలిగా ఆతిశీ పేరే వినిపించింది. అయితే జైలు నుంచే పరిపాలిస్తానని కేజ్రీ ప్రకటించడంతో నాడు ఆ ఊహాగానాలకు తెర పడింది.


ఎందుకంత ప్రాధాన్యం...

అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో నెంబర్‌ వన్‌, టూగా ఉన్న కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా అరెస్టులతో గందరగోళం ఏర్పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించేదెవరనే చర్చ మొదలైంది. ఆ సమయంలో అన్నీ తానై ముందుండి ప్రజలకు, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చారు ఆతిశీ. వాగ్ధాటితో ప్రత్యర్థుల నోటికి తాళాలు వేయడంలో ఆమె దిట్ట. కేజ్రీపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను, విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. సహచర మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌తో కలిసి పాలన గాడి తప్పకుండా చూసుకున్నారు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేశారు. నిత్యం జనం మధ్యనే ఉంటూ, సాధ్యమైనన్ని సమావేశాలు పెట్టి, అరెస్టులతో మసకబారిన ‘ఆప్‌’ ప్రతిష్టను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ప్రజల్లో పార్టీకి మద్దతు కూడగట్టేందుకు శ్రమించారు. హరియాణా నుంచి ఢిల్లీకి రోజుకు వంద మిలియన్‌ గ్యాలెన్ల నీటిని విడుదల చేయకపోవడంతో గత జూన్‌లో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలయ్యారు. పార్టీని పటిష్టం చేసి, సుస్థిర పాలన అందించడానికి ఎంతటి ఒత్తిడినైనా భరించడానికి, ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండడం ఆతిశీ బలం.

విద్యా విధానంపై చెరగని ముద్ర...

‘ఆప్‌’లో అందరికంటే ఉన్నత విద్యావంతురాలు ఆతిశీ. 2015లో నాటి విద్యాశాఖ మంత్రి సిసోడియాకు సలహాదారుగా వ్యవహరించడంవల్ల ఆ శాఖపై ఆమెకు పట్టు దొరికింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పును కేజ్రీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ క్రమంలో నూతన విద్యా విధానం రూపకల్పనలో, సిసోడియా సలహాదారుగా ఆతిశీ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన పాఠ్యప్రణాళికలను రూపొందించడంలో ఎంతో పురోగతి సాధించారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు విలువలనూ నేర్పేందుకు కృషి చేశారు. ఒక రకంగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాన్ని మార్చిన ఘనత ఆమెది.మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ అనుభవం కలిసివచ్చింది.


ఏడేళ్లు శ్రమించి...

ఆతిశీ మొదటి నుంచి చదువులో టాప్‌. ఢిల్లీ ‘స్ర్పింగ్‌డేల్స్‌ స్కూల్‌’లో ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత... ‘సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ’లో హిస్టరీతో డిగ్రీ (2001) పూర్తి చేశారు. స్కాలర్‌షి్‌పపై ‘ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ’లో మాస్టర్స్‌ చదివారు. 2005లో ‘రోడ్స్‌ స్కాలర్‌షి్‌ప’తో ఆక్స్‌ఫర్డ్‌లోని ‘మగ్డాలెన్‌ కాలేజీ’లో డబుల్‌ మాస్టర్స్‌ పట్టా పొందారు. ‘ఆప్‌’తో అనుబంధానికి ముందు ఆతిశీ మధ్యప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఏడేళ్లు నివసించారు. అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సేంద్రియ సాగు, ప్రగతిశీల విద్యావిధానంపై అధ్యయనం చేశారు. పలు ఎన్‌జీఓలతో కలిసి పని చేశారు. ఆ తరువాత ‘ఆప్‌’ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి అధినాయకత్వంతో కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. 2013 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్‌ కమిటీలో సభ్యురాలయ్యారు. పార్టీ విధాన రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. తనపై నమ్మకం ఉంచి, అవకాశం ఇచ్చిన ప్రతిసారీ ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అందుకే సీఎం ఎవరని నిర్ణయించే క్షణంలో అధినేత ఆమె పక్షాన నిలిచారు. ఈ సందర్భంగా ఆతిశీ మాట్లాడుతూ... ‘ఢిల్లీకి ఒక్కరే సీఎం. అది కేజ్రీవాల్‌ మాత్రమే. మళ్లీ ఆయన్ను గెలిపించి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే మా ముందున్న లక్ష్యం’ అన్నారు. ఏదిఏమైనా మరి కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆతిశీపై అతిపెద్ద బాధ్యతే పెట్టింది పార్టీ.

అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో నెంబర్‌ వన్‌, టూగా ఉన్న కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా అరెస్టులతో గందరగోళం ఏర్పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించేదెవరనే చర్చ మొదలైంది. ఆ సమయంలో అన్నీ తానై ముందుండి ప్రజలకు, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చారు ఆతిశీ. అంతేకాదు... కేజ్రీపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను, దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు.

Updated Date - Sep 18 , 2024 | 06:09 AM