Share News

lifestyle: కుదురుగా... కులాసాగా

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:07 AM

గంటల తరబడి శరీరాన్ని ఒకే భంగిమకు పరిమితం చేస్తే, అవయవాల్లో అసౌకర్యాలు, ఇబ్బందులూ తప్పవు.

lifestyle: కుదురుగా... కులాసాగా

గంటల తరబడి శరీరాన్ని ఒకే భంగిమకు పరిమితం చేస్తే, అవయవాల్లో అసౌకర్యాలు, ఇబ్బందులూ తప్పవు. అయితే కొంత అవగాహనతో మెలుగుతూ, అప్రమత్తంగా ఉండగలిగితే జీవనశైలికి సంబంధించిన ఇలాంటి సమస్యలను అదుపులో పెట్టొచ్చు.

మెలితిప్పే మణికట్టు

అరచేయి మొద్దుబారుతూ, సూదులు గుచ్చుతున్నట్టుగా ఉండి, వేళ్లు బలహీనపడితే...‘కార్పల్‌ టన్నల్‌ సిండ్రోమ్‌’ కావచ్చు. మణికట్టు కంటే చేతిని తక్కువ ఎత్తులో ఉంచి చేసే పనులు (మౌస్‌, కీబోర్డు వాడకం) వల్ల వచ్చే సమస్య ఇది. భుజం నుంచి ముంజేతి వరకూ సాగి, మణికట్టు గుండా అర చేతిలోకి వెళ్లే ‘మీడియన్‌’ అనే నరం ఒత్తిడికి లోనయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.

విరుగుడు ఇలా: పురుషులతో పోలిస్తే మహిళల్లో మణికట్టులో నరాలు వెళ్లే ద్వారం ఇరుకుగా ఉంటుంది. కాబట్టి కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువ. చేతుల కదలికల వల్ల తలెత్తిన ఇబ్బంది కాబట్టి మణికట్టు మీద ఒత్తిడిని తగ్గించటం ఒక్కటే ఈ సమస్యకు విరుగుడు. ఇందుకోసం....

కంప్యూటర్‌ ముందు పని చేసేవాళ్లు ప్రతి రెండు గంటలకు కనీసం 10 నిమిషాలపాటు చేతులకు విశ్రాంతినిస్తూ ఉండాలి.

విశ్రాంతి సమయంలో చేతులు, వేళ్లను బలపరిచే వ్యాయామాలు చేయాలి.

కంప్యూటర్‌ స్ర్కీన్‌, హెచ్చుతగ్గులు లేకుండా కళ్లకు సూటిగా ఉండాలి.

మోచేయి, మణికట్టు ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.


వెన్నులో పోట్లు

గంటలతరబడి కుర్చీలో కూర్చుని పని చేసేవాళ్లకొచ్చే అత్యంత సాధారణ సమస్య ఇది. కుర్చీలో జారగిలబడి కూర్చున్నా, కుర్చీకి వీపు ఆనించకుండా ముందుకు వంగి కూర్చున్నా వెన్నుపాము ఉండాల్సిన భంగిమలో ఉండదు. దాంతో వెన్నులోని లిగమెంట్లు, కండరాలు ఒత్తిడికి గురై నొప్పులు మొదలవుతాయి.

విరుగుడు ఇలా!

వెన్ను నొప్పి వేధిస్తుంటే వెంటనే లేచి నడవాలి. కదలకుండా రెండు గంటలకు మించి కూర్చోకూడదు. ఈ జాగ్రత్తలతోపాటు...

కుర్చీ వీపుకు సమానమైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

కుర్చీకి, వెన్నుకి మధ్య గ్యాప్‌ ఉంటే కుషనింగ్‌ కోసం ‘లంబార్‌ పిల్లో’ అనే దిండు ఉంచుకోవాలి.

తొడలు నేలకు సమాంతరంగా, పాదాలు నేల మీద పూర్తిగా ఆనేలా కూర్చోవాలి.

ఒకవేళ ఎత్తులో కూర్చోవలసివస్తే కాళ్లను గాల్లో వేలాడేలా ఉంచకుండా, ఫుట్‌ స్టూలు వాడాలి.

కుర్చీ హ్యాండ్‌ రెస్ట్‌లు ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

వెన్ను కండరాలు బలపడటం కోసం పొత్తికడుపు వ్యాయామాలు, క్రంచెస్‌ చేయాలి.


మెడ, భుజాల నొప్పులు

ఈ నొప్పులకు కారణం కూర్చున్న ప్రదేశానికి కంప్యూటర్‌ మానిటర్‌, కీబోర్డు అవసరానికి మించి దూరంగా ఉండటమే! ఆ దూరాన్ని తగ్గించటం కోసం మనకు తెలియకుండానే మెడను ముందుకు చాపుతాం! దాంతో భుజాలు ముందుకు వంగుతాయి. ఫలితంగా ఆ ప్రదేశాల్లోని కండరాలు, కణజాలాల మీద ఒత్తిడి పెరిగి, మెడ, భుజాల నొప్పులు మొదలవుతాయి.

విరుగుడు ఇలా!

తరచుగా మెడ, భుజాల స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేస్తూ ఉండాలి.

మెడ పట్టేస్తే, చుబుకాన్ని ఛాతీకి ఆనించి వదిలే ‘చిన్‌ టక్‌’ వ్యాయామం చేయాలి.

కూర్చుని పని చేసేవాళ్లు వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

మెడను అవసరానికి మించి ముందుకు చాపకూడదు.

మెడ, భుజాల నొప్పులు వదలటం కోసం తల తిప్పకుండా పక్కకు, భుజం వైపు వంచి 20 అంకెలు లెక్కపెట్టి తిరిగి యధాస్థానానికి రావాలి. ఇలా రెండో వైపూ చేయాలి.

కంప్యూటర్‌ కుర్చీకి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి.

తరచూ ఫోన్‌ మాట్లాడేవాళ్లు మెడ, భుజం మధ్యలో ఫోన్‌ ఉంచుకుని మాట్లాడే అలవాటు మానుకోవాలి.


కళ్ల మంటలు

కంప్యూటర్‌ మానిటర్‌ అవసరానికి మించి దూరంగా ఉంటే, అక్షరాలు స్పష్టంగా కనిపించక కళ్లను చికిలిస్తాం! ఒకవేళ మరీ దగ్గరగా ఉన్నా, మానిటర్‌ వెలువరించే వెలుగుకు కళ్లు చిన్నవి చేస్తాం! ఈ రెండూ కళ్లను ఇబ్బంది పెట్టేవే! గంటల తరబడి కంప్యూటర్‌ స్ర్కీన్‌ మీద చూపు నిలపటం వల్ల కళ్లు అలసటకు గురవుతాయి. పైగా ఏకాగ్రతతో పని చేస్తున్నప్పుడు కళ్లను తక్కువగా ఆర్పుతూ ఉంటాం. దాంతో కళ్లు పొడిబారి, నీళ్లు కారతాయి.

విరుగుడు ఇలా!:

కంప్యూటర్‌ ముందు పని చేసేవాళ్లు ప్రతి అరగంటకూ కళ్లకు విశ్రాంతినివ్వాలి.

దూరంగా ఉన్న కిటికీ లేదా క్యాలెండర్‌ను 20 సెకండ్లపాటు చూసి, తిరిగి మానిటర్‌ మీదకు దృష్టి మరల్చాలి. ఇలా చేయటం వల్ల కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.

డెస్క్‌లో నుంచి పెన్ను తీసి రాయటం, లేదా పక్కనున్న ఉద్యోగితో రెండు కబుర్లు చెప్పటం...ఇలా కంప్యూటర్‌ నుంచి కొంతసేపైనా దృష్టిని మరల్చే పనులు చేయాలి.

కుర్చీకి కంప్యూటర్‌ మానిటర్‌ కనీసం 20 నుంచి 40 అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి.

కంప్యూటర్‌ మానిటర్‌ పై అంచు కళ్లకు సమాంతరమైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

వెలుగు తగ్గించటం కోసం మానిటర్‌కు ఫిల్టర్‌ షీట్‌ అంటించుకోవాలి.

మనం ధరించే కళ్లజోళ్లు చదవటానికి, దూరానికి సంబంధించినవై ఉంటాయి. కానీ కంప్యూటర్‌తో ఈ రెండు పనులూ ఒకే సమయంలో చేస్తాం. కాబట్టి కంప్యూటర్‌ వాడకానికి సంబంధించిన కళ్లజోళ్లు ప్రత్యేకంగా ఎంచుకుని, వాటిని ఆఫీసు డెస్క్‌లోనే ఉంచే ఏర్పాటు చేసుకోవాలి.

కంప్యూటర్‌ మానిటర్‌ అవసరానికి మించి దూరంగా ఉంటే, అక్షరాలు స్పష్టంగా కనిపించక కళ్లను చికిలిస్తాం! ఒకవేళ మరీ దగ్గరగా ఉన్నా, మానిటర్‌ వెలువరించే వెలుగుకు కళ్లు చిన్నవి చేస్తాం! ఈ రెండూ కళ్లను ఇబ్బంది పెట్టేవే!

Updated Date - Dec 17 , 2024 | 05:08 AM