Perfumes : అత్తర్లు రాసుకుందాం
ABN , Publish Date - Dec 07 , 2024 | 04:01 AM
Ayurvedic Tradition: Using Fragrant Oils for Daily Rituals
మానసిక ఆనందం కోసం సువాసన భరితమైన పరిమళ ద్రవ్యాలను శరీరానికి రాసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ ఉదయం వృత్తి సంబంధిత పనులు ప్రారంభించే ముందు... అలాగే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా అత్తర్లు రాసుకోవడం భారతీయ సంప్రదాయం. ఇది వ్యక్తిగత శ్రద్దకు నిదర్శనం. నలుగురిలో ప్రత్యేకంగా నిలిపేందుకు, వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు అత్తర్ల సువాసనలు కొలమానంగా పని చేస్తాయి. ప్రకృతిలో సహజంగా దొరికే పూలు, మూలికలు, సుగంధ ద్రవ్యాల నుంచి తయారు చేసిన అత్తర్లు రాసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!
ఒత్తిడిని తగ్గిస్తూ...
తేలికపాటి సువాసన గల అత్తర్లు రాసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ జాతి సువాసన గల అత్తర్లని చేతి మణికట్టుమీద రాసుకుంటే రోజంతా మనసు ఉత్సాహభరితంగా ఉంటుంది. మెదడు ఉత్తేజితం అవుతుంది. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ అత్తర్లు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటాయి. వేసుకున్న బట్టల మీద వీటిని కొద్దిగా రాసినా కూడా రోజంతా సువాసన నిలిచి ఉంటుంది.
ఆందోళన లేకుండా...
మల్లె, గులాబీ, చమేలీ వంటి పూల పరిమళాలతో ఉన్న అత్తర్లు రాసుకోవడం వల్ల ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. వీటిని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చేతులమీద, మెడమీద, బట్టలమీద కొద్దిగా రాసుకుంటే రోజంతా తాజా అనుభూతితో ఉండవచ్చు. విసుగు, కోపం, చిరాకు, అలసట వంటి భావనలు దరిచేరవు. ఎలాంటి పరిస్థితులలోనైనా ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది.
మానసిక స్పష్టత కోసం...
తులసి, వట్టివేళ్లు, సాంబ్రాణి వాసనలతో ఉన్న అత్తర్లు ఎదుటివారిని ఆకర్షిస్తాయి. వీటిని ఏదైనా సమావేశానికి హాజరయ్యేముందు రాసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసులోని భావాలను సూటిగా స్పష్టంగా చెప్పగలమనే ధీమా వస్తుంది. సంభాషణలను పొడిగించేలా ఈ సువాసనలు మెదడుని ప్రభావితం చేస్తాయి. మనసులో సంతోషం, ముఖంలో మెరుపు ప్రకటితమవుతాయి.
విశ్రాంతి కోసం...
రోజంతా ఎన్నో పనులతో శారీరకంగా మానసికంగా అలసిపోతుంటాం. రాత్రి పడుకునేముందు లావెండర్, గంధం చెక్క, కుంకుమ పువ్వు సువాసనలు గల అత్తర్లను మెడమీద రాసుకుంటే వెంటనే నిద్ర పడుతుంది. ప్రకృతి సహజంగా ఉండే ఈ సువాసనల వల్ల శరీరానికి అలసట తీరుతుంది. మెదడు కూడా విశ్రాంతి పొందుతుంది. సానుకూల దృక్పథం పెరుగుతుంది. గెలిచి తీరాలన్న పట్టుదల పెరుగుతుంది.