Share News

Health : ఇన్‌ఫ్లమేషన్‌ను తరిమేద్దామిలా!

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:19 AM

శరీరంలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైర్‌సలు ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి.

Health : ఇన్‌ఫ్లమేషన్‌ను తరిమేద్దామిలా!

శరీరంలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైర్‌సలు ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి. వీటికి చికిత్స తీసుకున్న తరవాత కూడా కోలుకోకపోతే అవి ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తాయి. దీనివల్ల కడుపులో మంట, కీళ్లవాపు, చలిజ్వరం, నీరసం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, తినాలనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించేందుకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం!

ఆకు కూరలు : పాల కూర, బచ్చలి కూరలను తరచూ తినడం వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్‌, విటమిన్లు అంది ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు తగ్గుముఖం పడతాయి. క్యాబేజీ ఆకులను సలాడ్‌లు, స్మూతీలు, ఇతర వంటకాల్లో చేర్చుకుని తింటే కడుపులో మంట, చర్మ వ్యాధులు తగ్గుతాయి.

ఆలివ్‌ ఆయిల్‌ : ఇందులో ఉండే ఒలియోకాంతల్‌ సమ్మేళనాలు ఎముకల సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నరాల బలహీనత, క్యాన్సర్‌ వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పలు రకాల సలాడ్స్‌లో ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. టొమాటోలను ఆలివ్‌ ఆయిల్‌లో వేయించి తినడం వల్ల వాటిలోని లైకోపీన్‌ శరీరానికి అంది వాపులు, నొప్పులు తగ్గుముఖం పడతాయి.

స్ట్రాబెరీ : దీనిలో ఉండే ఆంథోసైనిన్స్‌ సమ్మేళనాలు శరీరంలోని వాపులను, దీర్ఘకాలిక వ్యాధులను హరించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెరీ ముక్కలను పెరుగులో కలుపుకుని తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.

గింజలు : బాదం, వాల్‌నట్స్‌, అవిసె గింజలు, గుమ్మడి గింజలను తరచూ తినడం వల్ల శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వృద్దిపొందుతాయి. పలు రకాల గింజల్లో ఉండే క్రొవ్వులు, పీచు పదార్థాలు శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతాయి.


పసుపు : వంటకాల్లో పసుపును తరచూ చేర్చడం వల్ల అందులోని కర్కుమిన్‌ మధుమేహం, క్యాన్సర్‌ కారణంగా వచ్చే వాపులను తగ్గిస్తుంది. పసుపులోని ఇతర ఔషధగుణాలు కీళ్లనొప్పులను నివారిస్తాయి.

అల్లం : ఆహారంలో భాగంగా అల్లం చేర్చుకుంటే దీనిలోని జింజెరోల్స్‌ అనే పదార్థం శరీరంలోని వివిధ భాగాల్లో ఏర్పడే వాపులను, నొప్పులను నివారిస్తుంది. అల్లం టీ తాగితే అరుచి తగ్గి జీర్ణక్రియ మెరుగవుతుంది.

దాల్చిన చెక్క: ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ఓట్‌మీల్‌, స్మూతీలు, ఇతర వంటకాల్లో దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే అరికాలి మంటలు, నీరసం తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

వెల్లుల్లి : ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. వెల్లుల్లిని వంటల్లో ఉపయోగించినా పచ్చిగా తిన్నా అందులోని అల్లిసిన్‌ సమ్మేళనం ఈ ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది.

తులసి : పలు రకాల సలాడ్‌లు, పాస్తా వంటకాల్లో తులసి ఆకులను కలిపి తినడం వల్ల శరీరానికి యూజినాల్‌ సమ్మేళనాలు అంది వాపులు, నొప్పులను హరిస్తాయి. ఉదయాన్నే నాలుగు తులసి ఆకులు తిన్నాకూడా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

గ్రీన్‌ టీ: గ్రీన్‌ టీని తరచూ త్రాగడం వల్ల అందులోని పాలీఫెనాల్స్‌ రక్షణ కవచంలా పనిచేసి ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమైన క్యాన్సర్‌, మధుమేహం, గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులను తరిమికొడతాయి. డార్క్‌ చాక్లెట్‌ను మితంగా తిన్నా కూడా వాపులన్నీ మాయమవుతాయి.

Updated Date - Nov 25 , 2024 | 04:36 AM