Beauty Tips : ముఖంపై ముడతలు నివారించండిలా
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:30 AM
వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు సహజం. కానీ ప్రస్తుతం చిన్నవయసువారిని కూడా ఈ సమస్య వేధిస్తోంది. చర్మంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. పోషకాహార లోపం...
బ్యూటీ
వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు సహజం. కానీ ప్రస్తుతం చిన్నవయసువారిని కూడా ఈ సమస్య వేధిస్తోంది. చర్మంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. పోషకాహార లోపం, ఒత్తిడి, కాలుష్యం కారణంగా కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి ముఖంపై ముడతలు ఏర్పడతాయి. మంచి పోషకాహారం తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అవేంటో చూద్దాం!
తేనె: చర్మ కణాలను రక్షించడంలో తేనెదే ప్రథమ స్థానం. ఇది చర్మంపై తేమ నిలిచి ఉండేలా చేస్తుంది. స్వచ్చమైన తేనెను ముఖమంతా రాసి బాగా ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంపై ముడతలు తగ్గి ఆరోగ్యంగా ఉంటుంది.
కలబంద: కలబంద గుజ్జులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఈ గుజ్జును ముఖమంతా పట్టించి ఇరవై నిమిషాల తరవాత మంచినీటితో కడగాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మంలో హైడ్రేషన్ స్థాయి పెరిగి ముఖం మీద గీతలు, ముడతలు తగ్గుతాయి.
కొబ్బరినూనె: కొబ్బరినూనెలోని ఫాటీ యాసిడ్స్ చర్మానికి పోషణనిస్తాయి. ఒక బౌల్‌లో అయిదు చెంచాల కొబ్బరి నూనె వేసి కొద్దిగా వేడి చేయండి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ముఖమంతా రాస్తూ ఒకే దిశలో మర్దన చేయండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ప్రయోజనం ఉంటుంది.
ఆలివ్ ఆయిల్: ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్, ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌తో ముఖం మీద మసాజ్ చేసినపుడు ఇవి చర్మకణాల్లో ఒత్తిడిని తగ్గిస్తాయి. ముఖమంతా రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల నుదుటి మీద గీతలు, కంటి చుట్టూ ఉండే ముడతలు పోతాయి.
పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు, మృతకణాలను తొలగించేందుకు సహాయం చేస్తుంది. కొంచెం పెరుగును ముఖమంతా పట్టించి ఇరవై నిమిషాల తరవాత నీళ్లతో కడగాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా ఉంటుంది.
గ్రీన్ టీ: ఇది మంచి టోనర్‌గా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీని తయారుచేసిన తరవాత ఒక స్ర్పే బాటిల్‌లో పోసి తరచూ ముఖం మీద స్ర్పే చేసుకుంటూ ఉంటే ముడతలు, గీతలు, నల్లని మచ్చలు మాయమవుతాయి.
అరటిపండు: ఒక బౌల్‌లో అరటిపండును గుజ్జులా చేసి దానికి ఒక చెంచా తేనె, రెండు చెంచాల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా పట్టించాలి. బాగా ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం తాజాగా ఉంటుంది.
రోజ్‌వాటర్: ఒక గిన్నెలో రెండు చెంచాల రోజ్‌వాటర్, రెండు చెంచాల గ్లిజరిన్, ఒక చెంచా నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేయాలి. పదిహేను నిమిషాల తరవాత నీళ్లతో కడిగేస్తే ముఖం మీద పేరుకున్న మురికి తొలగిపోతుంది. చర్మం స్టిఫ్‌గా మారుతుంది.
కోడిగ్రుడ్డు: గ్రుడ్డులోని తెల్ల సొనని తీసుకుని ముఖం మీద పొరలా పరచాలి. బాగా ఆరిన తరవాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా మంచి ఫలితముంటుంది.
నిద్ర: మంచి నిద్ర శరీరానికి స్వాంతన కలిగిస్తుంది. దీనివల్ల హార్మోన్ల పనితీరు సజావుగా ఉంటుంది. రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకుంటే ఒత్తిడి, అలసట తగ్గి వార్దక్య ఛాయలు దగ్గరికి రాకుండా ఉంటాయి.