Beauty Tips : అందం.. అప్రమత్తంగా...
ABN , Publish Date - Sep 28 , 2024 | 12:53 AM
మనం పాటించే చిన్నపాటి నియమాలు, జాగ్రత్తలు మేకప్ ప్రభావాన్ని ఇనుమడింపజేస్తాయి. కాబట్టి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో సాధారణంగా దొర్లే వీలున్న పొరపాట్ల పట్ల అప్రమత్తంగా నడుచుకోవాలి. అవేంటంటే...
మేకప్
మనం పాటించే చిన్నపాటి నియమాలు, జాగ్రత్తలు మేకప్ ప్రభావాన్ని ఇనుమడింపజేస్తాయి. కాబట్టి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో సాధారణంగా దొర్లే వీలున్న పొరపాట్ల పట్ల అప్రమత్తంగా నడుచుకోవాలి. అవేంటంటే...
అన్నీ అవసరం లేదు: కాస్మటిక్స్ షాప్‌లోకి అడుగు పెట్టగానే అంతులేనన్ని ఉత్పత్తులు కళ్లను కట్టిపడేస్తాయి. ఏం కొనాలో అర్థం కాని పరిస్థితిలో, అమోమయానికి లోనై అవసరం లేని అప్లికేటర్స్ అన్నిటినీ కొనేయడం సరి కాదు. నిజానికి ఐల్యాష్ కర్లర్, భిన్నమైన మేకప్ స్పాంజ్‌లను కొనవలసిన అవసరం లేదు. అలాగే పలు రకాల బ్లష్‌లూ, లిప్‌స్టిక్‌లూ కొనవలసిన అవసరం ఉండదు. ప్రారంభంలో బేసిక్ మేకప్ కిట్ కొనుక్కుంటే సరిపోతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఒక్కొక్క ప్రొడక్ట్ జోడించుకుంటూ వెళ్లాలి. మస్కారా, లిప్‌స్టిక్, ఐబ్రో పెన్సిల్, ఫౌండేషన్‌లతో మేకప్ మొదలుపెట్టుకోవాలి. ఈ ఉత్పత్తులుండే మేకప్ కిట్‌ను ఎంచుకోవాలి.
శుభ్రమైన ముఖానికే మేకప్: సాధారణంగా చాలా మంది మేక్‌పకు ముఖం ఎలా ఉన్నా ఫరవాలేదనుకుంటారు. మేకప్ చాటున అన్నిటినీ దాచేయవచ్చనుకుంటారు. కానీ మేక్‌పకు ముఖాన్ని సిద్ధం చేసుకోవాలంటే, ముందుగా ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. గంటల తరబడి ముఖం మీద ఉండిపోయిన మాయిశ్చరైజర్, సన్‌స్ర్కీన్ మీద మేకప్ అప్లై చేసుకోవడం సరి కాదు. ఈ నియమం లిప్‌స్టిక్‌కు మాత్రమే మినహాయింపు. లిప్‌స్టిక్ లేదా గ్లాస్‌ను తేలికగా రీఅప్లై చేసుకోవచ్చు. అయితే కాస్త ఖాళీ సమయం దొరికినా న్యాప్కిన్‌ను నీళ్లలో ముంచి, పెదవుల మీది లిప్‌స్టిక్ పూర్తిగా తొలగించి తిరిగి అప్లై చేసుకుంటే, మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాం.
మురికి బ్రష్‌లతో తంటా: మురికి మేకప్ బ్రష్షులతో చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వారాంతాల్లోని తీరిక సమయాలను కేటాయించాలి. గోరువెచ్చని నీళ్లను గిన్నెలో నింపి, ఒక టీస్పూన్ షాంపూ కలిపి, బ్రష్ కుంచెలన్నీ మునిగేలా పది నిమిషాలు నానబెట్టి, వేళ్లతో సున్నితంగా రుద్ది శుభ్రం చేసి, తాజా నీళ్లలో కడగాలి. తర్వాత బ్రష్‌లను టవల్ మీద ఆరబెట్టి, దాచుకోవాలి. మేకప్ బ్రష్‌లు అదనంగా కొని పెట్టుకుంటే, అత్యవసరమైన సమయాల్లో అక్కరకొస్తాయి. పైగా ఖరీదైన బ్రష్‌లనే ఎంచుకోవాలనే నియమమేమీ లేదు. నాణ్యత విషయంలో రాజీ పడినా మేక్‌పలో అంతగా మార్పులుండవు.
కనుబొమలు ప్రధానమే: చాలా మంది ముఖంలోని అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఇచ్చి, కనుబొమలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాగని వాటిని అవసరానికి మించి దిద్దుకున్నా, ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కాబట్టి తీర్చిదిద్దిన కనుబొమల కోసం, మ్యాట్ ఐషాడోతో కనుబొమలు దిద్దుకోవాలి. కనుబొమల రంగుకు దగ్గరగా లేదా అంతకంటే లేత రంగులో ఉండే ఐబ్రో పెన్సిల్‌నే ఉపయోగించాలి.
మేక్‌పతో నిద్ర: ఇది సరి కాదు. ఎంత అలసటతో పక్క మీద వాలిపోయినా, మేకప్ తొలగించడం మర్చిపోకూడదు. లేదంటే చర్మ రంథ్రాలు పూడుకుపోయి, ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. తర్వాతి రోజు ముఖం తాజాగా వెలిగిపోవాలంటే ముందు రోజు వేసుకున్న మేకప్ పూర్తిగా తొలగించి, చర్మానికి గాలి సోకేలా చూసుకోవాలి. మేకప్ తొలగించడానికి క్లీన్సింగ్ మిల్స్ లేదా స్వచ్ఛమైన కొబ్బరినూనె ఉపయోగించవచ్చు. మేకప్ తొలగించి, సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, తప్పనిసరిగా నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.