Shri Kanakamahalakshmi : భక్త జన కల్పవల్లి
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:14 AM
తెలుగు నెలల్లో తొమ్మిదోదైన మార్గశిర మాసంతో హేమంత ఋతువు ఆరంభం అవుతుంది. భగవద్గీతలో ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే ఈ నెలను సాక్షాత్తూ
డిసెంబర్ 2నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు
తెలుగు నెలల్లో తొమ్మిదోదైన మార్గశిర మాసంతో హేమంత ఋతువు ఆరంభం అవుతుంది. భగవద్గీతలో ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే ఈ నెలను సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీప్రదమైన మాసం కూడా. మార్గశిర మాసం, అందునా గురు(లక్ష్మి)వారం శ్రీమహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. మార్గశిర లక్ష్మివారాల్లో ఆమెను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయనే విశ్వాసం ఉంది. అందుకే ఆ రోజుల్లో ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడానికి నోములు చేసుకుంటారు. మహాలక్ష్మి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. అటువంటి ఆలయాల్లో మహరాష్ట్రలోని కొల్హాపూర్ ఆలయం ప్రసిద్ధమైనది కాగా... విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి సన్నిధి కూడా ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.
నగరానికి రక్షగా...
విశాఖపట్నం ఒకప్పుడు కళింగ గజపతుల పాలనలో ఉండేదని, రాజ్య రక్షణ కోసం సాగరతీరంలోని ఒక కొండ మీద బురుజు నిర్మాణం చేపట్టారని, తవ్వకాలు జరుపుతుండగా శ్రీమహాలక్ష్మి విగ్రహం బయటపడిందని, దాన్ని కొండకు సమీపంలో ప్రతిష్ఠించారనీ ఒక కథ ఉంది. అమ్మవారు కొలువైన ప్రాంతాన్ని ఇప్పటికీ బురుజుపేటగానే వ్యవహరిస్తారు. కాగా కనకమహాలక్ష్మి ఆవిర్భావం గురించి మరో కథనం కూడా వినిపిస్తుంది. తమోగుణంతో నిండిన ఒక శక్తికి శివభక్తుడైన వ్యక్తి మీద ఆగ్రహం కలిగింది. అతణ్ణి తన వజ్రాయుధంతో చంపడానికి సిద్ధమయింది. అప్పుడు శివుడు సాక్షాత్కరించి, అదే వజ్రాయుధంతో ఆ శక్తి చేతులు నరికి, ఆమెలోని తమోగుణాన్ని నిష్ఫలం చేసి, కనకమహాలక్ష్మిగా నామకరణం చేశాడట. అప్పుడు ఆ శక్తి శాంతించింది, కరుణతో నిండిపోయింది. పరమ శివుడి ఆజ్ఞ మేరకు ప్రజల ఆలనా, పాలనా చూడడమే సంకల్పంగా అక్కడ కొలువయింది. ప్రజలకు రక్షణ శక్తిగా ఉండడానికి వీలుగా తనకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించవద్దని ఆదేశించిందనీ. కుల, మతాలకు అతీతంగా అందరూ స్వయంగా తనను ఆరాధించుకోవచ్చనీ, ఎటువంటి ప్రతిబంధకాలు కల్పించవద్దని శాసించిందనీ చెబుతారు. ఆ ప్రకారం అమ్మవారి విగ్రహానికి పైన పైకప్పు లాంటిది ఏదీ ఉండదు. ఇప్పటికీ భక్తులు తమ స్వహస్తాలతోనే అమ్మవారికి పూజలు చేస్తారు.
నెల రోజుల వేడుక...
విశాఖపట్టణం ఒకప్పుడు చిన్న ఊరు. ఆంగ్లేయుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో... బురుజుపేటలో రోడ్డు విస్తరణ కోసం... రోడ్డుకు అడ్డంగా ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ఒక పక్కకు జరిపారు. వెంటనే ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. అనేకమంది మృత్యువాత పడ్డారు. అమ్మవారిని కదిలించిన కారణంగానే ఈ విపత్తు వాటిల్లిందన్న ప్రజల ఆందోళనకు అధికారులు స్పందించి, అమ్మవారిని యథాస్థితికి చేర్చారు. వెంటనే వ్యాధి తగ్గడంతో ప్రజల్లో విశ్వాసం మరింత గాఢమయింది. ఆనాటి నుంచి అమ్మవారిని కొలిచే భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీ కనకమహాలక్ష్మి ఖ్యాతి దశదిశలా పాకింది. అమ్మవారికి ప్రియమైన మార్గశిరంలో మాసోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ముఖ్యంగా లక్ష్మివారాల్లో రోజంతా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ నెలరోజుల్లో లక్షలాదిమంది అమ్మవారిని దర్శించుకుంటారు. మహిళలు కుంకుమ పూజలు, అభిషేకాలు చేస్తారు. భక్తులపాలిట కల్పవల్లిగా... సిరులు అందించే సౌభాగ్యప్రదాయినిగా కనకమహాలక్ష్మి ఆరాధిస్తారు.
ఫ ఆయపిళ్ళ రాజపాప