Share News

Buddhism : స్వర్గం, నరకం లేవు...

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:57 AM

పచ్చని గడ్డి, కలప, మొక్క జొన్న పైర్లతో ధనధాన్య సమృద్ధమైన సేతవ్యా గ్రామాన్ని పాయాసికి కోసల రాజు ప్రసేనజిత్తు బహుమతిగా ఇచ్చాడు. ఒకసారి కుమార కాశ్యపుడు దాదాపు 500 మంది భిక్షువులతో కలిసి కోసల రాజ్యంలో తిరుగుతూ, సేతవ్యా గ్రామానికి

Buddhism : స్వర్గం, నరకం లేవు...

పచ్చని గడ్డి, కలప, మొక్క జొన్న పైర్లతో ధనధాన్య సమృద్ధమైన సేతవ్యా గ్రామాన్ని పాయాసికి కోసల రాజు ప్రసేనజిత్తు బహుమతిగా ఇచ్చాడు. ఒకసారి కుమార కాశ్యపుడు దాదాపు 500 మంది భిక్షువులతో కలిసి కోసల రాజ్యంలో తిరుగుతూ, సేతవ్యా గ్రామానికి ఉత్తరాన ఉన్న శింశుపారణ్యంలో బస చేశాడు. బుద్ధుడి ప్రత్యక్ష శిష్యులలో కుమార కాశ్యపుడు అగ్రగణ్యుడు. అతను అనుభవజ్ఞుడు, విద్యావంతుడు, వివేకి. తాత్త్విక విషయాలను వివరించగలిగే నేర్పరి. పైగా అర్హమైన స్థానానికి ఎదిగినవాడు.

నాలుగు వాదాలు...

పాయాసి భౌతికవాది. కనిపించే వాటిని తప్ప వేరేవాటిని ఒప్పుకొనేవాడు కాదు. అతనికి ఆస్తికత సన్నగిల్లింది. పరలోకాలు, పాప పుణ్యాలు కనిపించవు కాబట్టి వాటిని నమ్మేవాడు కాదు. జీవుడు మరణానంతరం మళ్ళీ పుడతాడనే సిద్ధాంతాన్ని కూడా అతను అంగీకరించేవాడు కాదు. కానీ పాయాసి సిద్ధాంతాన్ని కుమార కాశ్యపుడు ఒప్పుకోలేదు. అప్పుడు తన సిద్ధాంతాన్ని సమర్థించుకోవడానికి నాలుగు వాదాలను పాయాసి ప్రతిపాదించాడు.

  • చైతన్య స్వరూపమైన ఆత్మ కనిపించదు కదా, అందుకే అది లేదు. స్వర్గ-నరకాలు లేవు. అందుకే మరణానంతరం మానవుడు తిరిగి జన్మించడు.

  • మనిషి మళ్ళీ పుట్టడు కాబట్టి... ధార్మికులైన ఆస్తికులను కూడా మరణభయం వెంటాడుతుంది. మళ్ళీ ఈ లోకానికి రాలేమనే ఆలోచనే ఆ భయానికి కారణం. చావంటే అందరికీ భయమే. మరణం అనివార్యం అని తెలిసి కూడా జ్ఞానులను సైతం ఈ భీతి ఎందుకు వెంటాడుతుంది?

  • ఆత్మ అనేది అసలు లేనే లేదు, కాబట్టి మనిషి మరణించినప్పుడు అది ఎవరికీ కనిపించదు. లేనిది ఎలా కనిపిస్తుంది?

  • ఆత్మ శరీరం నుంచి వేరయ్యాక ఆ శరీర భారం తగ్గాలి. కానీ శరీర భారం ఇంకాస్త పెరుగుతుంది. అందుకే ఆత్మ లేదు.

స్వర్గం గురించి ఎందుకు తెలుసుకోలేమంటే...

పాయాసి రాజు ప్రస్తావించిన పై వాదనలను కుమార కాశ్యపుడు వరుసగా ఖండించాడు. మొదటి వాదంపై మాట్లాడుతూ ‘‘మృత్యు దండనను పొందిన అపరాధిని ఉరి తీసే ముందు.. అతడు మిత్రులతో, బంధువులతో కలవడానికి రాజు ఎలాగైతే అనుమతించడో... అదే విధంగా నరకంలో తీవ్ర దుర్గతి పాలైన ప్రాణి భూలోకానికి వచ్చి, పరలోకం గురించి మీకు చెప్పడానికి యముడు అనుమతించడు. ఇక ‘త్రాయస్త్రింశ లోకం’లో, అంటే స్వర్గంలో ఉన్న ప్రాణి అక్కడి భోగభాగ్యాలను విడిచి మళ్ళీ ఈ కష్టసాధ్యమైన భూలోక జీవితంలోకి ప్రవేశించాలని అనుకోడు. అపవిత్రం, దుర్గంధభూయిష్టం, హేయం అయిన మలకూపం నుంచి బయటపడి... స్వచ్ఛమైన వస్త్రాలను ధరించి, పంచేంద్రియాలతో, పంచభోగాలను అనుభవించే మనిషి మళ్ళీ ఇలాంటి చోట ప్రవేశించాలని ఎలా అనుకోడో... అదే విధంగా స్వర్గలోకంలో నివసించిన ప్రాణి మళ్ళీ భూలోకానికి రావడానికి అసలు ఇష్టపడడు. అంతేకాదు, స్వర్గలోకంలో అతడు అనుభవించే భోగభాగ్యాలను, స్థితిగతులను భూలోకంలో నివసించే మానవులు తెలుసుకోకపోవడానికి మరో కారణం ఉంది. భూలోకంలో నివసించే మనుషులకు వంద సంవత్సరాల కాలం... స్వర్గవాసులకు ఒక్క రోజుతో సమానం. అలాంటి వేయి దైవీ సంవత్సరాలు స్వర్గ లోక దేవతల ఆయుఃప్రమాణం. అలాంటప్పుడు... స్వర్గలోక నివాసులైన వారు ఆ లోకంలో రెండు మూడు రోజులు భోగభాగ్యాలను అనుభవించి, ఆ విషయాలను మీతో చెప్పడానికి భూలోకానికి తిరిగి వస్తే... అంతవరకూ వారి మాటలు వినడానికి మీరు జీవించి ఉంటారా? అందుకే చనిపోయిన వ్యక్తి మళ్ళీ తరిగి వచ్చి, పరలోకం గురించి చెబితేనే పరలోకాన్ని నమ్ముతాననడం అవివేకం. అది తెలివైన ఆలోచన కాదు’’ అన్నాడు. కానీ కుమార కాశ్యపుడు వర్ణించిన దేవతల దీర్ఘాయువును పాయాసి ఒప్పుకోలేదు. అది ఉత్త భ్రమ అన్నాడు. ‘‘స్వర్గలోక దేవతల దీర్ఘాయువు గురించి నేను ఎప్పుడూ వినలేదు. అందుకే నేను ఈ విషయాన్ని అంగీకరించను’’ అన్నాడు. కుమార కాశ్యపుడు అంతటితో వదిలిపెట్టలేను. అతణ్ణి ఒప్పించడానికి ఒక జన్మాంధుడి ఉదాహరణ ఇచ్చాడు. ‘‘సూర్య తేజం వల్ల వచ్చే తెలుపు రంగును, చంద్రప్రభ వల్ల వచ్చే వెన్నెలను చూడలేని ఒక పుట్టు గుడ్డివాడు... సూర్య చంద్రుల అస్తిత్వాన్ని స్వీకరించనట్టే... పాయాసి కూడా పారలౌకిక విషయాలను అంగీకరించలేడు’’ అన్నాడు. ‘‘కుమార కాశ్యపుడు చెప్పిన ప్రకారం. పారలౌకిక విషయాలను మనిషి తన మామూలు కళ్ళతో చూడలేడు. దానికి దివ్య చక్షువు అవసరం. కాబట్టి పరలోకం లేదని అనడం కూడా ఆధారం లేని విషయమే’’ అని చెప్పాడు.

ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు

జేఎన్‌యు, న్యూఢిల్లీ.

91 98189 69756

Updated Date - Dec 06 , 2024 | 04:57 AM