Share News

Snake Plant : ఇంట్లో స్నేక్‌ ప్లాంట్‌ పెంచవచ్చా?

ABN , Publish Date - Dec 19 , 2024 | 06:15 AM

ఇంటి అందాన్ని పెంచే ఇండోర్‌ ప్లాంట్స్‌ అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని తెచ్చే మొక్కలకు విపరీతమైన ఆదరణ ఉంటోంది. ఈ కోవలోనే ఇటీవల స్నేక్‌ ప్లాంట్‌ని పెంచేవారి

Snake Plant : ఇంట్లో స్నేక్‌ ప్లాంట్‌ పెంచవచ్చా?

ఇంటి అందాన్ని పెంచే ఇండోర్‌ ప్లాంట్స్‌ అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని తెచ్చే మొక్కలకు విపరీతమైన ఆదరణ ఉంటోంది. ఈ కోవలోనే ఇటీవల స్నేక్‌ ప్లాంట్‌ని పెంచేవారి సంఖ్య పెరుగుతోంది. ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రం చేసి సానుకూల శక్తిని పెంచడంతోపాటు వాస్తు ప్రకారం అదృష్టాన్ని, సంపదను అందిస్తుంది ఈ మొక్క. స్నేక్‌ ప్లాంట్‌ను ఇంట్లో పెంచితే కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

ఇంట్లో గాలి శుభ్రం: స్నేక్‌ ప్లాంట్‌కి గాలిని శుభ్రం చేసే గుణం ఉందని నాసా ప్రకటించింది. ఈ మొక్కని ఇంట్లో పెంచడం వల్ల మనం తరచూ ఉపయోగించే రూం ఫ్రెషనర్స్‌, మస్కిటో కాయిల్స్‌ నుంచి వెలువడే రసాయనాలను పీల్చుకుని లోపలి గాలి విషపూరితం కాకుండా చేస్తుంది. పరిశ్రమల నుంచి వెలువడే పార్మాల్డిహైడ్‌, బెంజీన్‌, కార్బన్‌డయాక్సైడ్‌ వంటి వాయువులను కూడా సులభంగా గ్రహిస్తుంది.

ఆక్సిజన్‌ని ఇస్తుంది: శీతాకాలంలో చలిగా ఉంటుందనీ ఎండాకాలంలో దోమలు వస్తాయనీ మనం గది కిటికీలు, తలుపులు వేసుకుని నిద్రిస్తుంటాం. గదికి వెంటిలేషన్‌ లేని పక్షంలో మనం పీల్చే గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గి ఇబ్బంది కల్గుతుంది. ఇలాంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే గదిలో కనీసం ఎనిమిది అంగుళాల పొడవున్న ఉన్న స్నేక్‌ ప్లాంట్‌ని ఉంచుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రిపూట మూసి ఉన్న గదిలో పెరిగే కార్బన్‌డయాక్సైడ్‌ని వేగంగా పీల్చుకుని అధిక మొత్తంలో ఆక్సిజన్‌ని విడుదల చేస్తుంది.

పొడిగాలి నుంచి రక్షణ: వాతావరణంలో మార్పుల కారణంగా పొడిగాలులు వీస్తూ ఉంటాయి. ఇలాంటపుడు ఇంట్లో ఉండే గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. దీంతో చెవులు, ముక్కు, గొంతు తడారిపోయి దురదగా అనిపిస్తుంటాయి. దగ్గు, వికారం, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇంట్లోని ప్రతి గదిలో చిన్న స్నేక్‌ ప్లాంట్‌ కుండీలు అమర్చుకుంటే ఈ సమస్యలు ఏర్పడవు. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

ఆయుర్వేద ఔషధం: ఈ మొక్క ఆకుల్ని ఆయుర్వేద చికిత్సలో భాగంగా ఉపయోగిస్తుంటారు. చర్మ వ్యాధుల నివారణకు, పాము కాటు విరుగుడి మందుగా, కుష్టు వ్యాధిని నయం చేసేందుకు, కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఈ మొక్క ఆకులు బాగా పనిచేస్తాయి. ఈ ఆకులు అత్యంత విషపూరితమైనవి కాబట్టి చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు అందకుండా జాగ్రత్తగా కుండీలు అమర్చుకోవాలి.

అదృష్టానికి, సంపదకు: స్నేక్‌ ప్లాంట్‌ కుండీని ఇంట్లో సరైన దిశలో ఉంచినపుడు అదృష్టం, సంపద కలిసి వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కుండీని ఆగ్నేయంలో పెడితే సంపద, నైరుతిలో పెడితే ఆరోగ్యం, తూర్పులో పెడితే సానుకూల శక్తి పెరుగుతాయి. ఈశాన్యం, ఉత్తరం దిశల్లో స్నేక్‌ ప్లాంట్‌ కుండీని పెట్టకూడదు. ఇంటి సింహ ద్వారానికి సమీపంలో, లివింగ్‌ రూమ్‌లో ఈ మొక్క కుండీని పెట్టడం వల్ల సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి.

Updated Date - Dec 19 , 2024 | 06:15 AM