Share News

Language Skills : తెలుగు నేర్పాల్సింది తల్లులే

ABN , Publish Date - Dec 04 , 2024 | 11:32 PM

తెలుగు భాష అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సంస్థల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఒకటి. దీనికి గత కొన్నేళ్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ వి.ఎల్‌. ఇందిరాదత్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఒక వైపు ప్రముఖ వాణిజ్య సంస్థ ‘కేసీపీ’కి సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తూ-

Language Skills : తెలుగు నేర్పాల్సింది తల్లులే

తెలుగు భాష అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సంస్థల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఒకటి. దీనికి గత కొన్నేళ్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ వి.ఎల్‌. ఇందిరాదత్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఒక వైపు ప్రముఖ వాణిజ్య సంస్థ ‘కేసీపీ’కి సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తూ- మరో వైపు తెలుగుపై మమకారంతో - ప్రపంచ తెలుగు సమాఖ్యకు సంబంధించిన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. ప్రస్తుత తరం వారు తెలుగు నేర్చుకోవాల్సిన అవశ్యకత గురించి, పిల్లలకు తెలుగు నేర్పటంలో తల్లుల పాత్ర గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ

‘‘మా నాన్నగారు ముక్యాలరాజా (రాజా వాసిరెడ్డి రామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్‌) గారికి తెలుగు అంటే చాలా ఇష్టం. ఆయన మాకు తెలుగు చదవటం, రాయటం నేర్పారు. ఆయన కూడా తెలుగులో రాసేవారు. చిన్నతనంలో మమ్మల్ని ఇంట్లోనే చదివించారు. మా తాతగారికి అమ్మాయిలు బయటకు వెళ్లటం ఇష్టం ఉండేది కాదు. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు- అమ్మ, నాన్నగారు- తాతయ్యతో పోట్లాడి నన్ను మద్రాసుకు తీసుకువెళ్లి స్కూల్లో వేశారు. మిగిలిన రాజకుటుంబాలలోని పిల్లల మాదిరిగానే నేను కూడా చెన్నైలో చదువుకున్నా. ఆ సమయంలో కూడా నా సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగే! నా వివాహం అయిన తర్వాత మా కుటుంబాలలో తెలుగే మాట్లాడుకొనేవాళ్లం. ఇక ప్రపంచ తెలుగు సమాఖ్య స్థాపించిన తర్వాత తెలుగు మా జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. ఇక్కడొక విషయం చెప్పాలి. నేను చదువుకొనే రోజుల్లో ఉపాధ్యాయులకు నిబద్ధత ఎక్కువగా ఉండేది. అప్పుడు ఉండేదంటే- ఇప్పుడు లేదని చెప్పటం నా ఉద్దేశం కాదు. కానీ మా చిన్నతనంలో ఉపాధ్యాయులకు బోధన పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. అవసరమైతే ఒక గంట అదనంగా ఉండి మరీ చదువుచెప్పేవారు. ప్రస్తుతం అలాంటి ఉపాధ్యాయులు తక్కువనే అనిపిస్తుంది.

తెలుగు ఒక వారధి...

ఈమధ్య కాలంలో ఇంగ్లీషులో మాట్లాడటం ఒక హోదా చిహ్నంగా మారిపోయింది. చిన్న గ్రామాల్లో తల్లితండ్రులు కూడా పిల్లలతో ‘మమ్మీ, డాడీ’ అని పిలిపించుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల్ల దైనందిక జీవనంలో తెలుగు పదాల వినియోగం రోజు రోజుకు తగ్గిపోతోంది. దీనికి కారణం- ఇటు తల్లితండ్రుల్లోను, అటు పిల్లలోను తెలుగు భాష, సంస్కృతుల పట్ల సరైన అవగాహన లేకపోవటమే! సంస్కృతి, సంప్రదాయాలకు భాషకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. అవి ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా రావటానికి భాష వారధిగా ఉపయోగపడుతుంది. మన మూలాలను తెలియజెబుతుంది. మన పూర్వీకుల గొప్పతనం తెలుస్తుంది. ఇవన్నీ మన భాషను నేర్చుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు. తరచి చూస్తే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలా తెలుగు భాష వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే తల్లితండ్రులు, పిల్లలు అందరూ భాషను నేర్చుకుంటారనేది నా ఉద్దేశం. అందుకోసం ప్రపంచ తెలుగు సమాఖ్య తరపున గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పరీక్షలు పెడుతున్నాం. దీనిలో పాల్గొనే వారు ఇంగ్లీషు పదాలు వాడకుండా మాట్లాడాలి. ఇలాంటి ప్రయత్నాల వల్ల మళ్లీ తెలుగు పట్ల మమకారం పెరుగుతుందనేది మా ఉద్దేశం. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. చాలా మందికి తెలుగు మాట్లాడటం వచ్చు. కానీ చదవటం, రాయటం రాదు. తెలుగులో ఉన్న తియ్యదనం తెలిస్తే- వీరందరూ కూడా తప్పకుండా చదవటం, రాయటం నేర్చుకుంటారు. సంస్కృతం, ఫ్రెంచ్‌ మాదిరిగా తల్లితండ్రులు తమ పిల్లలను తెలుగు కూడా నేర్చుకోవాలని ప్రోత్సహించాలి. నా ఉద్దేశంలో తల్లులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పించాలి. ‘‘తెలుగు రాకపోయినా ఇంగ్లీషు వస్తే నడిచిపోతుంది కదా! అలాంటప్పుడు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి?’’ అని కొందరు అడుగుతూ ఉంటారు. మన పూర్వీకులు- మనకు వారసత్వంగా గొప్ప సంస్కృతి సంప్రదాయాలు అందించారు. ఉదాహరణకు పండుగలనే తీసుకోండి. ప్రతి పండుగ వెనక ఒక కారణం ఉంటుంది. అది మన జీవనంతోను.. సంస్కృతితోను ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు బొమ్మల కొలువులను తీసుకుందాం. తమిళనాడులో దసరాకు బొమ్మల కొలువులు పెడతారు. మన వాళ్లు సంక్రాంతికి పెడతారు. దీని వెనక కొన్ని కారణాలున్నాయి. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మూల భాష అంటే తెలుగు రావాలి కదా! అప్పుడే వారు తమ సంస్కృతి గొప్పదానన్ని తెలుసుకోగలుగుతారు.


ప్రారంభం ఇలా...

1992లో లాంగ్‌ ఐలాండ్‌లో ‘తానా’ సభలు జరిగాయి. అప్పుడు కొందరు ముఖ్యులు మాట్లాడుకుంటున్న సమయంలో- ‘విదేశాల్లోనే తెలుగు వారు భాష గురించి మాట్లాడకుంటున్నారు. వారే ఒక సంఘంగా ఏర్పడ్డారు. అలాంటప్పుడు మన దేశంలో ఒక సంస్థ ఎందుకు ఉండకూడదు?’ అనే చర్చ జరిగింది. ఈ చర్చ నుంచి ఆవిర్భవించినదే- ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’. దీన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రారంభించారు. మొదట్లో కోయంబత్తూరుకు చెందిన నాయుడుగారు అధ్యక్షులుగా ఉండేవారు. ఆ తర్వాత డీవీఎస్‌ రాజుగారు అఽధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత నా భర్త దత్తుగారు పగ్గాలు చేపట్టారు. ఆయన తర్వాత నేను ఆ పదవి స్వీకరించా. అప్పటి నుంచి నేనే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నా. తెలుగు భాషాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేయటంతో పాటుగా ప్రతి రెండేళ్లకు ఒక ఉత్సవం నిర్వహిస్తాం. ఈ ఉత్సవాలలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు, యువ వాణిజ్యవేత్తల కోసం కొన్ని సెమినార్లు నిర్వహిస్తాం. వీటిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ పాల్గొంటారు. ఇలా ఇప్పటిదాకా వివిధ నగరాలలో 11 ఉత్సవాలు నిర్వహించాం. 12వ ఉత్సవం వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్నాం. దీనిలో సుమారు రెండువేల మంది దాకా పాల్గొంటారని భావిస్తున్నాం. ప్రపంచ తెలుగు సమాఖ్య తరపున- తెలుగు భాష వారసత్వాన్ని భవిష్యత్‌ తరాల వారికి అందించేలా విశాఖపట్నంలో ఒక మ్యూజియాన్ని నిర్మించాం. మాకు ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు బాగా సహకరించాయి. భవిష్యత్తులో ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నాం.’’

సంగీతం కోసం...

చెన్నైలోని ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యాలయంలో మేము తెలుగు నేర్పుతామని ప్రకటిస్తే- సుమారు వందమంది వరకూ వచ్చారు. వారందరూ తమిళం వాళ్లే! చాలామంది 60 ఏళ్ల పైబడినవారే! వీరిలో ఎక్కువ మందికి సంగీతం అంటే మక్కువ. కీర్తనలు తెలుగులో ఉంటాయి కాబట్టి వాటి అర్థం తెలుసుకోవటం కోసం తెలుగు నేర్చుకుంటున్నారు. త్వరలోనే మరో క్లాసు కూడా మొదలుపెడుతున్నాం.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Dec 04 , 2024 | 11:32 PM