Christmas Story: మీకోసం నేనున్నానని...
ABN , Publish Date - Dec 20 , 2024 | 06:53 AM
క్రిస్మస్ కథ... దేవుని పుత్రుడైన ఏసు క్రీస్తు మానవుడిగా మారిన కథ. తన ప్రియ సుతుడైన ఏసును ఈ లోకానికి దేవుడు రక్షకునిగా పంపాడు.
క్రిస్మస్ కథ... దేవుని పుత్రుడైన ఏసు క్రీస్తు మానవుడిగా మారిన కథ. తన ప్రియ సుతుడైన ఏసును ఈ లోకానికి దేవుడు రక్షకునిగా పంపాడు. ఆయన రాకను దేవదూత ముందుగానే ప్రకటిస్తూ... ఏసు జననం మానవాళి అందరికీ గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఆయన జననం ఈ లోకానికి ఒక శుభవార్త. ఒక శుభవార్తను వినడం ఒక వేడుకైన సందర్భం. ఆ సందర్భమే ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకొనే క్రిస్మస్ పర్వదినం అయ్యింది.
మానవులు దైవం నిర్దేశించిన మార్గాన్ని విడిచిపెట్టి జీవితాన్ని పాపభూయిష్టంగా, దుఃఖమయంగా మార్చుకున్నారు. తనను ధిక్కరించినప్పటికీ మానవుల మీద దేవుడు ఆగ్రహించలేదు. వారిని ఉద్ధరించాలని, మంచిదోవ చూపాలని సంకల్పించాడు. ‘దేవుడికి మనమంటే ఎందుకింత ప్రేమ?’ అనే ప్రశ్నకు ‘ఆయనే ప్రేమ’ అనేది యోహాను ఇచ్చిన సమాధానం. అందుకే మనల్ని పాపాలనుంచి, కష్టాల నుంచి కాపాడడం కోసం స్వయంగా తన పుత్రుడినే భూమిపైకి పంపాడు. అలా రక్షకుడిగా ఏసు ప్రభువు ఇలపై అవతరించాడు.
పాపం నుంచి, మరణం నుంచి, దుఃఖం నుంచి మనకు విముక్తి కల్పించడానికి అవతరించిన ఏసుక్రీస్తు... మనలో ఒకడిగా మెలిగాడు. మానవాళితో విడదీయరాని, శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు. మనకోసం ఒక సేవకుడి స్వభావాన్ని స్వీకరించాడు. ఆర్తులకు, దీనులకు ‘మీకోసం నేనున్నా’నని ధైర్యం చెప్పాడు. దారితప్పిన మానవాళికి తన నడవడిక ద్వారా, తన బోధనల ద్వారా గమ్యాన్ని చూపించాడు. రెండువేల ఏళ్ల క్రితం బెత్లెహేములోని ఒక పశువుల పాకలో సామాన్యుడిగా జన్మించిన ఆయన లోకాన్ని శాంతిమయంగా, కరుణాపూరితంగా చేయాలని తపించాడు. ఈ లోకాన్ని పాపాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం స్వయంగా శిలువను ఎక్కి ప్రాణాలు అర్పించాడు. ఈ లోకంలో ఆయన జీవించినది కేవలం ముప్ఫై మూడేళ్ళే. కానీ ఎన్ని యుగాలకైనా శాశ్వతంగా నిలిచే సందేశాన్ని అందించాడు.
‘దేవుణ్ణి ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టే పొరుగువారిని ప్రేమించండి...’ ఈ మాటలను ఆయన బోధనలకు ప్రధాన సారంగా చెప్పుకోవచ్చు. ఏసు క్రీస్తు ఆవిర్భావం ఒక నవశకానికి నాంది. మానవ చరిత్రలో ఒక మహోన్నతమైన ఘట్టం. దాని విశిష్టతను, పవిత్రతను, ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ... ఆయన పుట్టినరోజుగా క్రిస్మ్‌సను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. ఈ పవిత్రమైన రోజున చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఏసు ప్రబోధించిన ప్రధాన సూత్రాలు... ప్రేమ, క్షమ, దయ. ప్రతి మనిషి తనలో ఈ గుణాలను పెంచుకున్నప్పుడు ప్రపంచం ఆనందమయమవుతుంది. వాటిని పెంపొందించుకోవాలనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకుంటేనే క్రిస్మస్ పర్వదినం సార్థకమవుతుంది.