Share News

ఆమె జీవితం పాఠమైంది

ABN , Publish Date - Sep 12 , 2024 | 05:04 AM

ధనుజ కుమారి... చదివింది తొమ్మిదో తరగతే. కానీ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆమె జీవితం ఇప్పుడు పాఠ్యగ్రంథం. ఈ పారిశుధ్య కార్మికురాలు... ఒక మురికివాడతో పెనవేసుకున్న తన జీవితాన్ని అక్షరబద్ధం చేశారు.

ఆమె జీవితం పాఠమైంది

ధనుజ కుమారి... చదివింది తొమ్మిదో తరగతే.

కానీ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆమె జీవితం ఇప్పుడు పాఠ్యగ్రంథం.

ఈ పారిశుధ్య కార్మికురాలు... ఒక మురికివాడతో పెనవేసుకున్న

తన జీవితాన్ని అక్షరబద్ధం చేశారు.

పేదరికం, వివక్షల మధ్య నలిగిపోతున్న జనం వేదనను

తన గొంతుతో చాటిచెబుతున్నారు.

‘‘తిరువనంతపురం రాజ్‌భవన్‌. రోజూ నా వృత్తిలో భాగంగా ఆ పక్కనుంచే వెళ్తాను. కానీ ఈ ఏడాది ఆగస్టు పదిహేనో తేదీన... మొదటిసారిగా ఆ భవనంలోకి... ప్రత్యేక అతిథిగా, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆహ్వానంతో అడుగుపెట్టాను. నేను, నా కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళగానే... గవర్నర్‌ నవ్వుతూ పలకరించారు. మా యోగక్షేమాలు తెలుసుకున్నారు. ‘‘మీరు శక్తిమంతమైన మహిళ’ అంటూ నన్ను ప్రశంసించారు. సమాజంలో చాలామంది తోటి మనిషిగానైనా పరిగణించని నాకు... ఇంతకన్నా గొప్ప గౌరవం ఏముంటుంది? గవర్నర్‌ ఎదుట నా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. ఒక్కసారిగా నా జీవితమంతా కళ్ళముందు కదిలింది.

ప్రతిరోజూ పోరాటమే...

మాది తిరువనంతపురంలోని చెంగల్‌చూలా (ప్రస్తుతం రాజాజీనగర్‌) మురికివాడ. నిమ్నకులానికి చెందిన కుటుంబంలో పుట్టాను. తీవ్రమైన పేదరికంలో నా బాల్యం సాగింది. రెసిడెన్షియల్‌ స్కూళ్ళలో తొమ్మిదో తరగతి వరకూ చదివాను. ఒకసారి డైరీ గురించి క్లాసులో మా టీచర్‌ చెప్పారు. ‘నేను కూడా రాస్తే బాగుంటుంది కదా?’ అనుకున్నాను. కొన్నాళ్ళపాటు నా దినచర్యను అందుబాటులో ఉన్న కాగితాల మీద రాసుకొనేదాన్ని. వాటిని ఏం చెయ్యాలో నాకు తెలీదు. అందుకే కొన్నాళ్ళకు చింపి పారేసేదాన్ని. అయితే భావాలను కాగితం మీద పెట్టడం మాత్రం అలవాటయింది. ఇంట్లో పరిస్థితుల వల్ల చదువు ఆపేశాను. పధ్నాలుగేళ్ళ వయసులో పెళ్ళయింది. నా భర్త సతీశ్‌ వాద్య కళాకారుడు. చెంగల్‌చూలాలోనే మా కాపురం. నా భర్తకు వచ్చే ఆదాయం చాలేది కాదు. నేను కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేదాన్ని. తరువాత మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలుగా చేరాను. కూలీ నాలీ చేసుకొనే వారు ఎక్కువగా ఉండే మా మురికివాడ ఒకప్పుడు నేర కార్యకలాపాలకు పేరు పడింది. అక్కడ జీవితం ప్రతిరోజూ పోరాటమే. కులం, రంగు, మతం... ఇలా ప్రతి విషయంలోనూ మేము వివక్ష ఎదుర్కొంటూనే ఉంటాం. ఇప్పుడు నాకు 48 ఏళ్ళు. నా కళ్ళముందు తిరువనంతపురం ఎంతో మారింది. ఎన్నో ఆధునిక సౌకర్యాలు వచ్చాయి. కానీ చెంగల్‌చూలా మాత్రం అలాగే ఉంది. రీసెర్చ్‌ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో మా ప్రాంతానికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు. కానీ ఎలాంటి ప్రగతీ ఉండదు. ఇది సహజంగానే మాకు ఆగ్రహం కలిగిస్తుంది. కానీ మా ఆవేదననైనా, ఆగ్రహాన్నైనా వ్యక్తం చేసే అవకాశాలు చాలా తక్కువ. అయితే అలాంటి ఒక అవకాశం నాకు ఊహించని విధంగా దొరికింది.

చర్చ కోసం, మార్పు కోసం...

ఎప్పుడూ వార్తల్లో ఉండే చెంగల్‌చూలాలో కొన్నేళ్ళ క్రితం రైటర్స్‌ మీట్‌ జరిగింది. స్థానికులను కూడా మాట్లాడాలని ఆహ్వానించారు. నేను కూడా మా పరిస్థితుల గురించి చెప్పాను. సమావేశం పూర్తయ్యాక... రచయిత సత్యన్‌ నన్ను పిలిచారు. ‘‘మీ మాటల్లో కోపం ఉంది. దాన్ని అక్షరాల్లో పెడితే బాగుంటుంది. ఇక్కడి మీ జీవితానుభవాల గురించి ఒక పుస్తకం రాయండి. మిగిలిన ప్రాంతాలవారు ఈ కాలనీ గురించి చదివినప్పుడు... అది సామాజికమైన చర్చకు, తద్వారా మార్పునకు దోహదం చేస్తుంది’’ అని అన్నారు. ‘‘మీరు తప్పకుండా రాయాలి. ఏవైనా సలహాలు కావాలంటే ఫోన్‌ చెయ్యండి’’ అంటూ తన వివరాలు ఇచ్చారు. కొన్నాళ్ళు ఆలోచించాక... నా అనుభవాల్ని రాయడం ప్రారంభించాను. ఆ సంగతే సత్యన్‌ గారికి చెప్పాను. ‘‘ఒక ఎడిటర్‌ ఉన్నారు. మీరు ఎలా రాసినా... దాన్ని చక్కటి భాషలో మార్చి రాస్తారు’’ అని ఆయన సూచించారు. ‘‘వద్దు సార్‌! నేను చదివింది తొమ్మిదో తరగతే. నా పుస్తకంలో భాష ఆ స్థాయిలోనే ఉండాలి’’ అని చెప్పాను. ఆయన కూడా సరేనన్నారు. కొన్ని నెలల్లో నా పుస్తకాన్ని పూర్తి చేశాను. దానికి ‘చెంగల్‌చూలయిల్‌ ఎంతె జీవితమ్‌’ (చెంగల్‌చూలాలో నా జీవితం) అని పేరు పెట్టాను. నేను ఊహాశక్తి, సృజనాత్మకత ఉన్న రచయితను కాదు. సాహిత్య భాషలో రాయడం నాకు చేతకాదు. నాకు ఎదురైన సంఘటనలు, నేను ఎదుర్కొన్న కష్టాలు, పడిన వేదనలు, సంతోషకరమైన రోజులు, నేను ధరించిన దుస్తులు, తిన్న తిండి, తిరిగిన ప్రదేశాలు... ఇలా ప్రతిదీ నాకు వచ్చిన భాషలో రాశాను. ఇది సాహిత్యం కాదు. నా జీవితం... ఒక విధంగా నా చుట్టూ ఉన్న సమాజం జీవితం


అటు గుర్తింపు, ఇటు ఈసడింపులు...

2014లో సిందా పబ్లికేషన్స్‌ నా రచనను పుస్తక రూపంలోకి తెచ్చింది. దానికి వచ్చిన స్పందన నేను ఎన్నడూ ఊహించనిది. తద్వారా ఎందరో ప్రముఖులు నాకు పరిచయం అయ్యారు. ‘‘మీ రచన సహజంగా ఉంది. మీకు ఎదురైన సంఘటనలను నిక్కచ్చిగా వెల్లడించారు’’ అనే అభినందనలు... ‘‘మా గొంతు వినిపించావు’’ అంటూ స్థానికుల ఆత్మీయ వచనాలు... అన్నిటికన్నా సంతోషం కలిగించిన విషయమేమిటంటే ‘‘ఈ పుస్తకంలో భిన్నమైన అనుభవాలు ఉన్నాయి. ఈ తరానికి ఇది ఒక స్ఫూర్తిమంతమైన కథ...’’ అంటూ దాన్ని ఇటీవలే కేరళలో అతి పెద్ద విశ్వవిద్యాలయమైన ‘కాలికట్‌ యూనివర్సిటీ’ ఎంఏ సిలబ్‌సలో, ‘కన్నూర్‌ యూనివర్సిటీ’ బీఏ సిలబ్‌సలో చేర్చారు. సామాజిక వివక్ష గురించి విశ్వవిద్యాయాల్లో బోధించడం చాలా మంచి విషయం. దీనివల్ల రాబోయే తరంలోనైనా మంచి మార్పు వస్తుందని నా ఆశ. ఇప్పుడు మరో పుస్తకం రాసే పనిలో ఉన్నాను. అది కూడా చెంగల్‌చూలా గురించే. ఇక, నా వ్యక్తిగత విషయాలకు వస్తే... ప్రస్తుతం ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ‘హరిత కేరళం’ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ‘హరిత కర్మ సేన’లో శానిటరీ వర్కర్‌గా ఉంటున్నాను. రోజూ ఇంటింటికీ వెళ్ళి చెత్త సేకరించే ఆ వృత్తే అప్పుడూ ఇప్పుడూ నా జీవనాధారం. మా ఇద్దరు అబ్బాయిలు నిధీశ్‌, సుధీశ్‌ కూడా వాద్య కళాకారులే. స్థానిక మహిళల కోసం ‘వింగ్స్‌ ఆఫ్‌ విమెన్‌’ అనే సంస్థను, దానికి అనుబంధంగా ఒక గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నాను. సామాజిక కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాముల్ని చేస్తున్నాను. మన సమాజంలో వివక్ష ఇంకా పాతుకొనే ఉంది. మా అబ్బాయిలు కూడా చేదు అనుభవాలు ఎన్నో ఎదుర్కొన్నారు. రచయిత్రిగా గుర్తింపు ఒకవైపు, అట్టడుగు కులానికి చెందినదానిగా ఈసడింపులు మరొకవైపు నాకు ఎదురవుతూనే ఉన్నాయి. అవి లేని సమాజం రావాలి. అందరూ హుందాగా, గౌరవంతో, తమ శ్రమకు తగిన గుర్తింపుతో బతకాలి. అదే నా కల.’’

అక్కడ జీవితం ప్రతిరోజూ పోరాటమే. కులం, రంగు, మతం... ఇలా ప్రతి విషయంలోనూ మేము వివక్ష ఎదుర్కొంటూనే ఉంటాం. ఇప్పుడు నాకు 48 ఏళ్ళు. నా కళ్ళముందు తిరువనంతపురం ఎంతో మారింది. కానీ చెంగల్‌చూలా మాత్రం అలాగే ఉంది. రీసెర్చ్‌ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో మా ప్రాంతానికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు. కానీ ఎలాంటి ప్రగతీ ఉండదు.

Updated Date - Sep 12 , 2024 | 05:04 AM