బడ్జెట్‌లో దీపావళి
ABN , Publish Date - Oct 30 , 2024 | 06:10 AM
దీపావళి... ఖర్చుతో కూడుకున్న పండగే! అందులో సందేహం లేదు. అయితే ఖర్చులు తడిచి మోపెడవకుండా, కొద్దిపాటి బడ్జెట్‌లోనే పండుగను జరుపుకునే మార్గాలెన్నో ఉన్నాయి.
దీపావళి... ఖర్చుతో కూడుకున్న పండగే! అందులో సందేహం లేదు. అయితే ఖర్చులు తడిచి మోపెడవకుండా, కొద్దిపాటి బడ్జెట్‌లోనే పండుగను జరుపుకునే మార్గాలెన్నో ఉన్నాయి. అవే ఇవి!
క్యాండిల్స్ బదులుగా దివ్వెలు!: బల్బులు, క్యాండిల్స్‌తో దీపావళి వెలుగులు విరజిమ్మాలంటే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి ఈ దీపావళినాడు మట్టితో తయారైన ప్రమిదలు సేకరించి, వాటి మీద ఆక్రిలిక్ కలర్స్‌తో డిజైన్లు గీయండి. వీటిలో నూనె లేదా మైనం నింపి వెలిగించండి. మట్టి ప్రమదలు ఎక్కువ సమయం పాటు వెలగడమే కాదు, వాటిని తయారుచేసిన వారికీ మేలు చేసినవాళ్లం అవుతాం!
పువ్వుల రంగోలి!: రసాయనాలతో తయారైన కృత్రిమ రంగులకు బదులు పూల రేకులు, పసుపు, బియ్యం పిండిలతో రంగోలి తయారుచేయండి. వీటి ఖరీదు తక్కువ. పైగా అలంకరణ కూడా తేలికే!
బడ్జెట్‌లో వెలుగులు!: ఇంట్లో పనికి రాని గాజు సీసాలను సేకరించి వాటికి రంగులేయండి. వాటి లోపల ఫెర్రీ లైట్లను నింపి, కిటికీల దగ్గర ఉంచి ఆన్ చేయండి. ఈ సీసాల్లో చిన్న చిన్న సందేశాలు, తీపి పదార్థాలనూ ఉంచి, స్నేహితులకు, పొరుగింటి వారికీ పండగ సందర్భంగా బహుమతిగా ఇవ్వవచ్చు.
దుపట్టాతో డెకరేషన్!: గది సీలింగ్ నుంచి మూలలకు రంగురంగుల దుపట్టా లేదా చీరలతో అలంకరించుకోవచ్చు. కిటికీలకు, తలుపుల దగ్గర కర్టెన్లుగానూ వాడవచ్చు. బెడ్ వెనకాల గోడకు డిజైన్‌లా దుపట్టాలను అలంకరించి, వాటి మీద అక్కడక్కడా పువ్వులను గుచ్చండి. గదులకు పండగ శోభ వస్తుంది.
కాగితం తోరణాలు: పూల తోరణాలకు బదులుగా రంగురంగుల కాగితాలతో తోరణాలు తయారుచేసి, వాకిళ్లకు కట్టుకోవచ్చు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల కాగితాలను ఇందుకు ఉపయోగించుకోవచ్చు.
పూల రేకులతో: మొత్తంగా పూల దండలు కొనడం ఖరీదైన వ్యవహారమే! అయితే లూజ్ ఫ్లవర్స్ తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తెచ్చి, విడదీసి, రేకులను కలిపి మాలగా కుట్టుకోవచ్చు. కొంత సృజనాత్మకతను జోడించి, ఆకులతో కలిపి ఆకర్షణీయంగా గుచ్చుకోవచ్చు. ఈ మాలలను గుమ్మాలకు వేలాడదీసుకుంటే, ఇంటికి పండుగ శోభ వచ్చేస్తుంది.
డాండియా!: డిజె లేదని దిగాలు పడవలసిన అవసరం లేదు. స్నేహితులను పోగు చేసి డాండియా ఆడుకోవచ్చు. వినసొంపైన గుజరాతీ లేదా బాలీవుడ్ ప్లేలిస్ట్ తయారుచేసుకుని దీపావళి రాత్రి డాండియాతో హంగామా చేయవచ్చు. ఇందుకోసం డాండియా స్టిక్స్, మిలమిలమెరిసే డాండియా దుస్తులు ఉంటే చాలు.
భలే బహుమతులు!: ప్రమిదలకు ఆకర్షణీయమైన రంగులతో పెయింట్ చేసి స్నేహితులకు ఇవ్వవచ్చు. మైనం కొని క్యాండిల్స్ తయారుచేసి బహుకరించవచ్చు. స్వీట్లు తయారుచేసే సామర్థ్యం ఉంటే వాటిని అందంగా గిఫ్ట్ ప్యాక్ చేసి స్నేహితులకు బహుకరించవచ్చు.