Share News

Navya : ఇలా చేస్తే మెదడుకు హాని

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:33 AM

ప్రతిరోజూ మనం అనుసరించే అలవాట్లు, పద్ధతులు మనకు బాగానే అనిపించినప్పటికీ వాటిలో కొన్ని మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

Navya : ఇలా చేస్తే మెదడుకు హాని

ప్రతిరోజూ మనం అనుసరించే అలవాట్లు, పద్ధతులు మనకు బాగానే అనిపించినప్పటికీ వాటిలో కొన్ని మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. శరీరమంతా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మెదడు పనితీరు సరిగ్గా లేకపోతే జీవిత గమనం చిక్కుల్లో పడుతుంది. అందుకే మెదడుకు హాని కలిగించే అంశాల గురించి తెలుసుకుందాం!

సామాజిక మాధ్యమాలు

రాత్రి సమయాల్లో ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో గడపడం వల్ల మెదడు పూర్తిగా అలసిపోతుంది. ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడడం, ఆటలు ఆడడం, సినిమాలు చూడడంతో పాటు ఇతరత్రా వ్యాపకాల వల్ల మెదడు ఒత్తిడికి గురవుతుంది. ఫోన్‌ నుంచి వెలువడే కాంతి వల్ల నిద్రకు ఉపకరించే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి కాదు. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర కరవవుతుంది. మెదడుకు స్వాంతన లభించదు. రాత్రి పూట నిద్రించడానికి గంటముందు ఫోన్‌, టీవీ తదితరాలను ఉపయోగించకుండా... మంచి పుస్తకం చదవడం, సంగీతం వినడం లాంటివి అలవాటు చేసుకోవడం మంచిది.

పోషకాహారం తినకపోవడం

కంటికి అందంగా కనిపిస్తూ, నాలుకకు రుచిగా అనిపించే ఆహార పదార్థాలన్నీ మెదడుకి నష్టం కలిగిస్తాయి. చక్కెర ఎక్కువగా ఉన్న చిరుతిండ్లు, వేపుళ్లు, రోడ్ల పక్కన అమ్మే ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని, కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల మెదడులోని కణాలు దెబ్బతిని మతిమరుపు, దృష్టి లోపం, ఏకాగ్రత కుదరకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. తాజా ఆకు కూరలు, పండ్లు, గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.

ఉత్సుకత లేకపోవడం

మన మెదడు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని, సాహసాలు చేయాలని, సవాళ్లు స్వీకరించాలని చూస్తుంది. మనం వాటిని నెరవేర్చే అవకాశం కల్పించని పక్షంలో మెదడు క్రమంగా బలహీనమవుతుంది. సంగీతం లేదా కొత్త భాష నేర్చుకోవడం, చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతకడం, ఆలోచనను పెంచే చదరంగం లాంటి ఆటలు ఆడడం వల్ల మెదడు విశేషంగా ప్రభావితమవుతుంది. శారీరక వ్యాయామం కండరాలను పటిష్టపరిచినట్టే మానసిక వ్యాయామం మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది.

కదలకుండా కూర్చోవడం

ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల మెదడు నిస్తేజ స్థితిలోకి వెళుతుంది. శారీరక చలనం వల్లనే మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగి, సమర్థంగా పనిచేయగల్గుతుంది. ఏకాగ్రత కుదరాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా చేస్తున్న పని నుంచి చిన్నపాటి విరామం తీసుకోవడం, కూర్చున్న చోటునే కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, భుజాలు కదిలించడం మంచిది.

నీరు తాగకపోవడం

మెదడు పనితీరు సక్రమంగా ఉండాలంటే దానికి తగినంత ఆక్సిజన్‌ అందాలి. మెదడుకు అవసరమైన ఆక్సిజన్‌ నీటి నుంచే లభిస్తుంది. నీరు తాగకుండా ఎక్కువసేపు ఉంటే శరీరం నిర్జలీకరణకు గురై మెదడు సమన్వయం దెబ్బతింటుంది. దాహం వేస్తోందని అనిపించిన ప్రతిసారీ నీరు తాగాలి. అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుంది.

Updated Date - Nov 20 , 2024 | 05:33 AM