Share News

అండగా నిలుస్తూ... పోరాటం నేర్పుతూ!

ABN , Publish Date - Apr 21 , 2024 | 11:59 PM

బడి వయసులో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో భాగస్వామ్యం... ఆమెలో సేవా స్ఫూర్తి రగిలించింది. ఆ స్ఫూర్తే నేడు ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచి... వారి జీవితానికి భరోసా కల్పిస్తోంది. మహిళలపై వివక్ష, లైంగిక వేధింపులపై మూడు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త,

అండగా నిలుస్తూ... పోరాటం నేర్పుతూ!

బడి వయసులో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో భాగస్వామ్యం...

ఆమెలో సేవా స్ఫూర్తి రగిలించింది. ఆ స్ఫూర్తే నేడు ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచి... వారి జీవితానికి భరోసా కల్పిస్తోంది. మహిళలపై వివక్ష, లైంగిక వేధింపులపై

మూడు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త, న్యాయవాది...

డాక్టర్‌ సుభాషిణి గుడిమల్ల తన ప్రయాణాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘మనం బాగుంటేనే సరిపోదు. మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి. అప్పుడే దేశం బాగుంటుంది. ఇది నాకు చిన్న వయసులోనే అర్థమైంది. అందుకు ప్రధాన కారణం... ఐదో తరగతి నుంచే నేను భారత్‌ స్కౌంట్స్‌ అండ్‌ గైడ్స్‌లో పాల్గొనడం. కాలేజీకి వెళ్లాక కూడా ఎన్‌ఎ్‌సఎ్‌సలో భాగస్వామిని అయ్యాను. 1987లో నాకు ‘ప్రెసిడెంట్‌ గైడ్‌ అవార్డు’ కూడా వచ్చింది. నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ నుంచి ఆ అవార్డు అందుకున్నాను. 1995లో ఐదు దేశాలకు వెళ్లాను. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఇరవై మందిని ఎంపిక చేశారు. అందులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేనొక్కదాన్నే. విద్యార్థిగా సామాజిక సేవలో భాగస్వామ్యాన్ని గుర్తించి ఈ అంతర్జాతీయ మీట్‌కు ఎంపిక చేశారు. అలాగే కాలేజీ రోజుల్లో ఢిల్లీ రిపబ్లిక్‌ పరేడ్‌లో జాయింట్‌ కమాండర్‌గా వ్యవహరించాను. విదేశీ పర్యటన తరువాత ప్రభుత్వం నిర్వహించే అక్షరాస్యత కార్యక్రమాలు, మహిళ ఉద్యమాల్లో పాల్గొన్నాను. రాత్రి పూట వాలంటీర్‌గా బస్తీల్లో చదువు చెప్పాను. పొదుపు, స్వయంసహాయక సంఘాలపై అధిక శ్రద్ధ పెట్టాను. ఎందుకంటే చాలా గ్రూపులు ఏర్పాటవుతాయి కానీ, అనేక కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోతాయి. అలాంటి వారికి మార్గదర్శనం చేస్తూ, ప్రభావంతంగా పని చేసేలా ప్రోత్సహించేదాన్ని.

అందుకే ‘లా’...

ఇక నా చదువంతా మా సొంతూరు వరంగల్‌లోనే సాగింది. అక్కడి ఎల్‌బీ కాలేజీలో బీకాం చదివాను. కాకతీయ విశ్వవిద్యాలయం (1999)లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశాను. రెండేళ్ల కిందటే ‘లీగల్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ గర్ల్‌ చైల్డ్‌ ఇన్‌ ఇండియా’ అంశం మీద ఉస్మానియా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాను. ఈ మధ్యలో నల్సార్‌ విశ్వవిద్యాలయంలో ‘ఫ్యామిలీ డిస్పూట్స్‌ రిజల్యూషన్‌’పై పీజీ డిప్లమో చదివాను. మొదటి నుంచీ సేవా దృక్పథంతో ఉన్నాను కాబట్టి, లా చదివితే చట్టం కూడా తెలుస్తుంది కదా. దానివల్ల మరింత సమర్థవంతమైన సేవలు ఇవ్వగలుగుతాను. అవసరమైన చోట న్యాయబద్దంగా పోరాడగలుగుతాను. చాలా వివాదాల్లో అంతిమ నిర్ణయాలు న్యాయ సంబంధ అంశాలతోనే ముడిపడి ఉంటాయి. అందుకే నేను లా చదివాను. మరింత లోతైన అవగాహన కోసం అందులో పీహెచ్‌డీ చేశాను. అంతేకాదు... ఆటల్లో కూడా నేను ముందుండేదాన్ని. కబడ్డీలో జాతీయ స్థాయి క్రీడాకారిణిని. బాస్కెట్‌బాల్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాను. బ్యాడ్మింటన్‌, జావెలిన్‌ త్రో, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, షార్ట్‌పుట్‌ పోటీల్లో పాల్గొనేదాన్ని. కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను.

జాతీయ భావన...

ఇప్పుడు ప్రధానంగా నేను దృష్టి పెడుతున్న అంశాలేమిటంటే... రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి పౌరులకు చెప్పి, వాటిపై అవగాహన కల్పిస్తున్నాను. ప్రభుత్వానికి... ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తున్నాను. కొన్ని ప్రాంతాలు, సమూహాల్లో మహిళలకు తమ హక్కుల గురించి కనీస మాత్రం తెలియదు. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, అందరూ కలిస్తేనే సమాజ నిర్మాణం జరుగుతుందని వారికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం నాది. తద్వారా జాతీయ భావన, సద్భావన పెంపొందుతుంది. అదే సమయంలో స్వయం అభివృద్ధి కూడా ముఖ్యం. ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి ఏంచేస్తే బాగుంటుంది? మహిళలపై అత్యాచారాలు, వివక్ష, లైంగిక వేధింపులను అరికట్టడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి? తదితర కీలక అంశాల పరిష్కారానికి కృషి చేస్తున్నా. నాకు తెలిసిన విజ్ఞానాన్ని నలుగురికీ పంచుతున్నా.

గళం... బలంగా...

ఇప్పటివరకు వరంగల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పర్యటించాను. మహిళల పట్ల అసమానతలు, అఘాయిత్యాలు, వివక్షపై పోరాడేందుకు పెద్దఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించాం. వీలైనంతవరకు మహిళలందరూ కలిసికట్టుగా ఉండి, తమ సమస్యలు తామే పరిష్కరించుకొనేలా వారిలో చైతన్యం తీసుకువస్తున్నాను. వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు, స్వయం ఉపాధికి సంబంధించిన వృత్తివిద్యల్లో పలు ఎన్‌జీఓలతో కలిసి శిక్షణ, నైపుణ్య తరగుతులు నిర్వహిస్తున్నాం. వీటన్నిటి కోసం ఒక వేదిక ఉండాలనే ఆలోచనతో ‘రుద్రమదేవి’ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థ కూడా నెలకొల్పాను.

న్యాయ సాయం...

అలాగే ఒక న్యాయవాదిగా ఉచిత న్యాయ సాయం (లీగల్‌ ఎయిడ్‌) కూడా అందిస్తున్నాను. వేల మందికి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ఇచ్చాను. ఇక విడాకులే మార్గం అనుకున్న వెయ్యికి పైగా జంటలను కలపగలిగాను. వరకట్నం సమస్య కావచ్చు, భార్య ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేకపోవచ్చు, లేదంటే ఆమె వస్త్రధారణ అతనికి నచ్చకపోవచ్చు, ఆమె పుట్టింటికి పోవడం ఇష్టంలేకపోవచ్చు, ఉద్యోగం చేసే అమ్మాయి ఇంట్లో పని చేయలేదని అత్తమామలు దెప్పి పొడవడం, టైమ్‌కు లేవరని, పనిమనిషి ఉన్నా వీళ్లే పని చేయాలని, పని మనిషి తప్పు చేసినా వీళ్లనే తిట్టడం... ముఖ్యంగా అసభ్య పదజాలంతో భార్యను దూషించి, మానసిక ఒత్తిడికి గురి చేయడం... ఇలా రకరకాలుగా వేధింపులకు గురవుతున్న మహిళలు నా దగ్గరకు వస్తారు. బాధిత మహిళలకు ధైర్యం చెప్పి, ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తాను. అవసరమైతే సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులను కూడా పిలిపిస్తాను. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నాను. నా సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ యువ పురస్కారం’ అందించింది.

విద్యార్థులకు అవగాహన...

దీంతోపాటు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి, విద్యార్థులకు లీగల్‌ కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నాం. వాళ్లు విద్యాసంస్థలకు వెళ్లే దారిలో కానీ, స్నేహాలవల్ల కానీ ఒకవేళ ఊహించని సమస్యలు ఏవైనా ఎదురైతే వాటికి న్యాయపరమైన పరిష్కారాలు తెలియాలనే ఉద్దేశం. తద్వారా ఎలాంటి గొడవలకు పోకుండా సక్రమమైన మార్గంలో నడుచుకొంటారు. చట్టం తెలుసుకొని, కుదురుగా ఉండమని చెప్పే ప్రయత్నం నాది. ఎందుకంటే నేటి విద్యార్థులే భావిభారత నిర్మాతలు కదా. వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదే. సుప్రీమ్‌కోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఫండమెంటల్‌ రైట్స్‌, ఫండమెంటల్‌ డ్యూటీస్‌ ఆఫ్‌ ది సిటిజన్‌ అన్నది బడి వయసులోనే మొదలుపెట్టాలి. దానివల్ల వారి భవితవ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ దిశగా అవగాహన కల్పించేందుకు పదహారేళ్లుగా పాఠశాలలు, కళాశాలల్లో ఏటా 60 నుంచి 70 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

నలభై వేలమంది...

సామాజిక కార్యక్రమాల నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, మహిళలు, వివిధ వర్గాల సమూహాలు కావచ్చు... ఇప్పటివరకు నేను నలభై వేలమందికి పైగా ప్రజలను కలిశాను. వారందరికీ నాకు సాధ్యమైనంతవరకు సహాయం అందించాను. వీరిలో చాలామంది తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా... వేరొకరి సమస్యలు తెలుసుకొనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం రోజుకు ఒక కేసన్నా నా దగ్గరకు వస్తుంది. మహిళలందరి సమస్యలకు సంబంధించి గతంలో ధర్నాలు, రాస్తారోకోల వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవాళ్లం. ఇప్పుడు వ్యక్తిగతంగా వారికి ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెట్టాను. అంటే ఒక సమస్య ఎదురైనప్పుడు న్యాయబద్ధంగా ఎలా పోరాడాలనేది నేర్పుతున్నాను.

ఉదాహరణకు ఇటీవల నా దగ్గరకు వచ్చిన ఓ గృహిణి కేసు గురించి చెబుతాను. ఆమెను తన భర్త ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లో నిర్బంధించి, ఎవరితో ఫోన్లో కూడా మాట్లాడనివ్వకుండా వేధించాడు. ‘మేమిద్దరం మానసికంగా విడిపోయాం. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు’ అని ఆమెతోనే బలవంతంగా లెటర్‌ రాయించి, వదిలిపెట్టేశాడు. ఆ అమ్మాయి ఎంటెక్‌ చదివింది. అతడిని ఆమె వద్దనుకున్నా... భయంతో ఇన్నాళ్లూ బయటకు రాలేదు. మన సమాజంలో 70 శాతం మంది మహిళలు ఇలా భయపడుతున్నవారే. ఆ వేధింపులు తట్టుకోలేక, కేసుల గురించి అవగాహన లేక, ఇక నాకు జీవితం లేదనే భావనతో మరణమే శరణ్యమనుకొంటారు. అలాంటి సందర్భాల్లో నాలాంటివారి అండ ఎంతో అవసరం. నేను ఆ అమ్మాయికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, ముందుకు వచ్చి పోరాడే ధైర్యం నింపాను. ఇలా ఎన్నో కేసులు.’’

ట్రాప్‌ చేసి పట్టేస్తారు...

నేను డీల్‌ చేసే కేసుల్లో ఉమెన్‌ ట్రాఫికింగ్‌ కూడా ప్రధానమైనది. బడి వయసు పిల్లలను ట్రాప్‌ చేసి తీసుకువెళ్లిపోతారు. అది ఎలా జరుగుతుందంటే... ఉదాహరణకు పక్కన ఎవరూ లేకుండా బడికి పోయివచ్చేవారు, ఇంట్లో తల్లితండ్రులు పట్టించుకోని అమ్మాయిలను దుండగులు లక్ష్యంగా చేసుకొంటారు. వారి ఇళ్ల పక్కనే భార్యాభర్తల్లా అద్దెకు దిగుతారు. కొంతకాలం ఆ అమ్మాయితో స్నేహం చేస్తారు. కొన్నాళ్లకు భార్య వెళ్లిపోతుంది. తరువాత వీడు అమ్మాయిని తీసుకెళ్లిపోయి వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతాడు. కొన్ని రోజులకు పెళ్లి చేసుకొంటాడు. తరువాత అమ్మేస్తాడు. తల్లితండ్రుల ఫిర్యాదుతో పోలీసులకు దొరికినా ఆ అమ్మాయి వాడిని వదిలి రానంటుంది. అంతలా కంట్రోల్‌లో పెట్టేస్తారు. అలాంటి ఈ మధ్య ఒక పదిహేనేళ్ల అమ్మాయిని కాపాడి తెచ్చారు పోలీసులు. రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాను. ఎంత చెప్పినా ఆ అమ్మాయి ఇంటికి రానంటుంది. ఆ వయసులో మంచేదో... చెడేదో వాళ్లకేం అర్థం కాదు. చివరకు ఆ అమ్మాయికి నచ్చజెప్పి ఇంటికి పంపించాను. నిందితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి, జైలుకు పంపించాం. ఇలాంటివి ఒక్క హైదరాబాద్‌లోనే చాలా కేసులు ఉన్నాయి. ఇదంతా ఒక ముఠా ద్వారా జరుగుతుంటుంది. అది పెద్ద చైన్‌.

హనుమా

Updated Date - Apr 21 , 2024 | 11:59 PM