Share News

Menstrual Cycle : పసి వయసు ప్యూబర్టీ ఎందుకు?

ABN , Publish Date - Dec 19 , 2024 | 06:18 AM

డాక్టర్‌! మా అమ్మాయికి పదేళ్లు. అప్పుడే తొలి నెలసరి మొదలైపోయింది. ఇంత చిన్న వయసులో రుతుక్రమం మొదలైపోవడం ఆశ్చర్యంగా, కాస్త భయంగా ఉంది. ఇది ఆరోగ్యకరమైన మార్పేనని అంటారా?

Menstrual Cycle : పసి వయసు ప్యూబర్టీ ఎందుకు?

డాక్టర్‌! మా అమ్మాయికి పదేళ్లు. అప్పుడే తొలి నెలసరి మొదలైపోయింది. ఇంత చిన్న వయసులో రుతుక్రమం మొదలైపోవడం ఆశ్చర్యంగా, కాస్త భయంగా ఉంది. ఇది ఆరోగ్యకరమైన మార్పేనని అంటారా?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

ఆడపిల్లలు 13, 14 ఏళ్లకు రజస్వల అయ్యే పరిస్థితి కొన్నేళ్ల క్రితం ఉండేది. కానీ ఏళ్లు గడిచేకొద్దీ ఆ వయోపరిమితి పదేళ్లకు తగ్గిపోయింది. ఆరేళ్లకే రజస్వల అయిపోతున్న ఆడపిల్లలు కూడా ఉంటున్నారు. ఈ వయసులో రుతుక్రమం పిల్లల్లో రకరకాల సమస్యలకు కారణమవుతుంది. భౌతిక ఎదుగుదల ఆగిపోవచ్చు. బడుల్లో హేళనలు, ఫలితంగా మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి పదేళ్లలోపు ఆడపిల్లలో ఎలాంటి అసహజ భౌతిక మార్పులు కనిపించినా వెంటనే వైద్యులను కలవడం అవసరం. ఇలా ముందస్తుగానే వైద్యులను సంప్రతిస్తే, చికిత్సతో నెలసరిని వాయిదా వేయవచ్చు.

నష్టాలు ఇవే!

ఎనిమిదేళ్ల లోపు ఆడపిల్లల్లో నెలసరి మొదలైతే, ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో ఎముకల ఎదుగుదల ఆగిపోతుంది. ఫలితంగా పిల్లలు ఎదగడం మానేస్తారు. 8, 9 ఏళ్లకే లైంగికపరమైన భౌతిక లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ, ఎదిగిన పిల్లల్లా మారిపోతారు. కానీ వారి మానసిక ఎదుగుదల వయసుకు తగ్గట్టుగా పరిమితంగానే ఉండిపోతుంది. ఇలాంటి ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఎనిమిదేళ్ల లోపు ఆడపిల్లల్లో రొమ్ములు పెద్దవి కావడం, మర్మాంగాల దగ్గర రోమాలు పెరగడం లాంటి లక్షణాలు బయల్పడుతున్నట్టు అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించి, అవసరమైన పరీక్షలు చేయించాలి. అవసరాన్ని బట్టి వైద్యులు ప్యూబర్టీని వాయిదా వేసే చికిత్సను సూచిస్తారు. మీ అమ్మాయి ఇప్పటికే నెలసరి మొదలైపోయింది కాబట్టి పాపకు నెలసరి పట్ల అవగాహన కల్పించడం అవసరం. అలాగే క్రమం తప్పకుండా వైద్యులకు చూపిస్తూ, మార్పులను వైద్యుల దృష్టికి తీసుకువెళ్తూ ఉండాలి.

డాక్టర్‌ మంజుల అనగాని,

క్లినికల్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌,

విమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌,

కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - Dec 19 , 2024 | 06:19 AM