Share News

Tulsi Padmashri : ఆపన్నులకు ఆసరాగా...

ABN , Publish Date - Dec 09 , 2024 | 03:29 AM

మావారి పేరు శ్రీనివాస్‌. రక్షణ రంగంలో మాజీ ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా దేశంలోని చాలా ప్రదేశాల్లో కాపురం ఉండాల్సి వచ్చింది.

Tulsi Padmashri : ఆపన్నులకు ఆసరాగా...

రెండు నెలల కిందట విజయవాడను వరదలు చుట్టిముట్టినప్పుడు...అందరిలా ఆమె ఇంట్లో టీవీ చూస్తూ ‘అయ్యో పాపం’ అనుకొని సరిపెట్టుకోలేదు. పిల్లల చదువు కోసం దాచిన రూ.28 లక్షలతో ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులకు అమ్మలా అన్నం పెట్టారు. ఆపన్నుల అవసరాలు తీర్చి ఆదుకున్నారు. అంతేకాదు... వ్యక్తిత్వ వికాస, పోషకాహార నిపుణురాలుగా, సామాజిక కార్యకర్తగా సమాజంలో ఒకగట్టి మార్పు కోసం కృషి చేస్తున్న తులసి పద్మశ్రీ ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు...

‘‘మావారి పేరు శ్రీనివాస్‌. రక్షణ రంగంలో మాజీ ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా దేశంలోని చాలా ప్రదేశాల్లో కాపురం ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం విజయవాడలోని ఒక బ్యాంక్‌లో ఆయన పని చేస్తుండడంతో పన్నెండు ఏళ్లగా ఇక్కడే ఉంటున్నాం. నేను 2002లో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశాక మా వివాహం జరిగింది. నాకు ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం చేయాలని ఉండేది. ఈ విషయంలో కుటుంబంలో కొంచెం ప్రతిఘటన ఎదురైనా నా భర్త మద్దతుతో ముందడుగు వేశా. ఎమ్మెస్సీ బోటనీ, న్యూట్రిషన్‌తో పాటు యోగా, సెఫాలజీలో డిప్లమా పూర్తి చేశా. నా ఇద్దరు పిల్లల్లో అబ్బాయి శ్రేయాన్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అమ్మాయి యశశ్విని ‘నీట్‌’ లాంగ్‌ టర్మ్‌ శిక్షణ తీసుకుంటోంది. ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటేనే నా కెరీర్‌ను మలుచుకుంటూ వచ్చాను. ఇప్పటివరకు నేను ఎనిమిది విభిన్నమైన ఉద్యోగాలు చేశాను. మావారు గోవాలో డిఫెన్స్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడ స్కూల్‌ టీచర్‌గా చేశాను. అలాగే యోగా, కమ్యునికేషన్‌ నైపుణ్యాల్లో శిక్షకురాలుగా, ‘దూరదర్శన్‌’లో యాంకర్‌గా... ఇలా నాకు ఆసక్తి, అభిరుచి ఉన్న రంగాల్లో పనిచేస్తూ వచ్చాను. 2014లో రాజమండ్రి ‘గైట్‌’, ఆ తర్వాత జేకేసీ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షకురాలుగా విధులు నిర్వహించా.మరోవైపు... పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, మహిళా సాధకారితపై కేంద్ర ప్రభుత్వం ముంబాయి, అహ్మదాబాద్‌లలో నిర్వహించిన సదస్సులకు హాజరై, ఆ అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. వాటి గురించి ఇతరులకు అవగాహన కల్పించడం ప్రారంభించాను.

fgkh.jpg


కన్నీళ్లు ఆగలేదు...

ఈ ఏడాది సెప్టెంబరులో విజయవాడను వరదలు చుట్టిముట్టినప్పుడు... టీవీలో వార్తలు చూసి తొలుత ఆందోళన చెందాను. నా దగ్గర గతంలో పనిచేసిన వారు అక్కడ ఉన్నారని తెలుసుకొని, వారికి ఫోన్‌ చేసి, పరిస్థితి తెలుసుకున్నాను. ఇళ్ళు మునిగిపోయి వారు భయపడుతూంటే ధైర్యం చెప్పాను. ‘నేను వస్తున్నా’ అని బయలుదేరా. అక్కడి పరిస్థితులు చూసి కన్నీళ్లు ఆగలేదు. నీళ్లు ఎక్కువగా ఉండడంతో వారిని ఆ సమయంలో కలవడానికి సాధ్యపడలేదు. అయితే, వారందరికీ ఏదో రకంగా సాయం చేయలనిపించింది. మా అమ్మాయి వైద్య విద్య కోసం దాచుకున్న రూ.28 లక్షల్లో కొంత వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు వినియోగిద్దామని నా భర్తకు, పిల్లలకు చెప్పాను. వారు ‘సరే’నన్నారు. వెంటనే పనులు ప్రారంభించాను. నా ఒక్కదానివల్లే అంత మందికి సాయం చేయడం సాధ్యం కాదని గుర్తించి... నా పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చాను. నా కుటుంబ సభ్యులు, గతంలో నా క్లాసులు విన్న విద్యార్థులు, మా పిల్లల స్నేహితులు... ఇలా 460 మందికి పైగా వాలంటీర్లుగా పనిచేయడానికి ముందుకొచ్చారు. మొదట యనమలకుదురు, రామలింగేశ్వర నగర్‌, సింగ్‌ నగర్‌ ప్రాంతాల్లో 7,300 మందికి ఎనిమిది రోజుల పాటు మంచి భోజనాన్ని బాక్సులల్లో అందించాం. ఆ తర్వాత 2,200 మందికి పైగా బాధితులకు మందులు, దుప్పట్లు ఇచ్చాం. వరద ఉధృతి తగ్గాక 1,200 మందికి నిత్యావసర వస్తువులు పంచిపెట్టాం. వరద ఉధృతితో రోడ్డు మార్గం మూసుకుపోతే... నాలుగు కిలోమీటర్ల దూరం రైల్వే పట్టాలపై నడిచి వెళ్లి సాయం అందించాం. ఇవన్నీ చేసేసరికి మా దగ్గరున్న రూ.28 లక్షలూ పూర్తిగా ఖర్చు అయిపోయాయి. ‘ఇంకాస్త ఎక్కువ డబ్బు దాచి ఉంటే మరికొంతమందికి సాయపడే దాన్ని’ అనిపించింది.

f.jpg


’మార్పు’నకు శ్రీకారం...

ఈ మధ్య పిల్లల్లో పెరుగుతున్న పౌష్ఠికాహారం లోపంతోపాటు దుందుడుకుతనం, తెంపరితనం, మొండితనం లాంటి లక్షణాల మీద అఽధ్యయనం చేశాను. వాటికి దారితీసే కారణాలు, పరిస్థితులను అంచనా వేసి ఒక ప్రాజెక్టును తయారు చేశాను. నేటి బాలలే రేపటి పౌరులు. భవిష్యత్‌ సమాజానికి ఆస్తి వారే. కాబట్టి వారిని బాల్యం నుంచే మంచి లక్షణాలతో తీర్చిదిద్దితే వచ్చే తరం బాగుంటుంది. ముఖ్యంగా పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో నా ప్రాజెక్ట్‌ అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే ఆలోనతో ’మార్పు’ అనే స్వచ్ఛంద సంస్థను ఈ ఏడాది జూలైలో ప్రారంభించాను. దానిద్వారా ఇప్పటివరకు 23 పాఠశాలల్లో సుమారు 2,500 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించాం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లల్లో 20 శాతం మందే చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. మిగిలిన వారు వివిధ కారణాలవల్ల అట్టడుగు స్థానంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి పిల్లలకు చేయూతనిచ్చి, వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ’ఇంటరాక్టివ్‌ సెషన్స్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈ ప్రాజెక్టును ప్రధానంగా... పెద్దలను గౌరవించడం, ఆహార నియమాలు (డైట్‌), కెరీర్‌ గైడెన్స్‌, సామాజిక బాధ్యత, మొబైల్‌ వినియోగం అనే అయిదు అంశాలతో రూపొందించాం. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లోని పెద్దవారు ‘ఏది మంచి, ఏది చెడు’ అని పిల్లలకు చెప్పేవారు. నేటి పిల్లల్లో చాలామందికి ఆ అవకాశం దొరకడం లేదు. అందుకే ఈ ఐదు అంశాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధిస్తే వారి భవిత బంగారమవుతుంది. ఈ ప్రాజెక్టు గురించి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించి, దీనిపై కసరత్తు చేయమని ప్రభుత్వ అధికారులను కూడా ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి ప్రభుత్వాధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేయూతనిస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి... పేద పిల్లలు వారి జీవితాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు తోడ్పడతాను.’’

సంజయ్‌ ఎస్‌ఎ్‌సబి


చులకన భావం పోవాలి...

గతంలో మా దగ్గర పనిచేసే డ్రైవర్‌ మొదలు సూపర్‌వైజర్‌ వరకు ఏదైనా పని గురించి నేను ఎంత మంచిగా చెప్పినా సరిగ్గా లెక్క చేసేవారు కాదు. కొంచెం గట్టిగా అడిగితే... అదో విధంగా సమాధానం చెప్పేవారు. అదే నా స్థానంలో ఒక పురుషుడు ఉండి ఉంటే... వారిని తిడుతూ మాట్లాడినా వారు పట్టించుకోకుండా పనిచేసేవారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరి మాటకైనా ఒక రకమైన విలువనివ్వాలి. మన సమాజంలో మహిళలంటే చులకన భావం పోవాలి. మహిళలు, పురుషులు సమానమనే భావన కలగాలి. అప్పుడే సమాజంలో మహిళలకు సంపూర్ణ గౌరవం లభిస్తుంది.

Updated Date - Dec 09 , 2024 | 03:32 AM