Beauty Treatments : అందం ఇలా సొంతం
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:09 AM
అందానికి మెరుగులు దిద్దుకునేటప్పుడు, ఫలితం సాధ్యమైనంత సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి.
అందానికి మెరుగులు దిద్దుకునేటప్పుడు, ఫలితం సాధ్యమైనంత సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అవి కృత్రిమ అందాలనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. మరీముఖ్యంగా నడి వయసులో సౌందర్య చికిత్సలను ఆశ్రయించేటప్పుడు, పైపై చికిత్సలను ఆశ్రయించి, ఫలితంతో రాజీపడిపోవడమా లేదంటే సర్జరీలతో సహజసిద్ధమైన ఫలితాన్ని పొందడమా అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలంటున్నారు వైద్యులు.
నుదురు నునుపుగా
నుదుటి మీద లోతైన, స్పష్టమైన గీతలు ఏర్పడినప్పుడు, భృకుటి ముడిపడి, ఉబ్బెత్తు ముడతలు ఏర్పడినప్పుడు ‘సర్జికల్ ఫోర్‌హెడ్ లిఫ్ట్’ చికిత్సను ఆశ్రయించవచ్చు.
దిద్దుబాటు ఇలా: నుదుటి దగ్గరున్న వెంట్రుకల అడుగుకు చేరుకుని, లోపలి చర్మాన్ని పైకి లాగి బిగిస్తారు.
కోలుకునే సమయం: మూడు రోజుల్లో కోలుకుంటారు. 10 రోజుల పాటు వాపు ఉండొచ్చు.
ఫలితం: సర్జరీతో 10 నుంచి 15 ఏళ్ల పాటు ఫలితం నిలిచి ఉంటుంది. బొటాక్స్, ఫిల్లర్స్‌తో 6 నెలల నుంచి ఏడాది పాటు ఫలితం కనిపిస్తుంది.
బుగ్గలు జారితే
వయసు పైబడినప్పుడు బుగ్గల్లోని కొవ్వు కిందకు జారుతుంది. దాంతో ఆ ప్రదేశంలో ముడతలు ఏర్పడి, చర్మం కూడా జారిపోతుంది. దీనికి ‘ఫేస్ లిఫ్ట్’ను ఎంచుకోవాలి.
దిద్దుబాటు ఇలా: చర్మం అడుగుకు చేరుకుని జారిన కొవ్వు పొరను మునుపటి స్థానంలో అమర్చే సర్జరీ చేయవలసి ఉంటుంది. ఇలా బుగ్గలను బిగుతుగా మార్చడంతో పాటు అవసరమైతే వదులుగా ఉన్న అదనపు చర్మాన్ని కూడా తొలగిస్తారు.
కోలుకునే సమయం: మూడు రోజుల్లో కోలుకుంటారు. 10 రోజుల పాటు వాపు ఉండొచ్చు.
ఫలితం: సర్జరీతో ఫలితం 10 నుంచి 15 ఏళ్ల పాటు ఉంటుంది. ఫిల్లర్స్ ఫలితం 6 నెలల పాటు ఉంటుంది.
ఆకట్టుకునే పెదవులు
పెదవుల పైన గీతలు, ముడతలు ఏర్పడడంతో పాటు పెదవులు లావుగా ఉండడం, లేదా పలుచబడిపోవడం కూడా జరుగుతుంది. వీటికి వేర్వేరు చికిత్సలుంటాయి.
దిద్దుబాటు ఇలా: నవ్వినప్పుడు మాత్రమే ఏర్పడే గీతలను బొటాక్స్‌తో సరిదిద్దవచ్చు.
పలుచబడితే ఫిల్లర్స్‌తో నింపుకోవచ్చు. కానీ లోతైన ముడతలు ఏర్పడినప్పుడు సర్జరీ అవసరమవుతుంది. నవ్వినప్పుడు చిగుళ్లు కనిపిస్తుంటే, బొటాక్స్‌తో పైపెదవి కండరాన్ని బలహీనపరుస్తారు. ఫలితంగా నవ్వినప్పుడు పైపెదవి మరీ పైకి వెళ్లిపోకుండా ఉంటుంది.
కోలుకునే సమయం: మూడు రోజుల్లో కోలుకుంటారు. 10 రోజుల పాటు వాపు ఉండొచ్చు.
ఫలితం: సర్జరీతో ఫలితం 10 నుంచి 15 ఏళ్ల పాటు ఉంటుంది. సమస్య స్వల్పంగా ఉన్నప్పుడు బొటాక్స్, ఫిల్లర్స్‌తో సరిదిద్దుకోవచ్చు. దీంతో ఫలితం 6 నెలల పాటు ఉంటుంది.
45 ఏళ్ల మహిళ ముఖాన్ని పాతికేళ్ల యువతి ముఖంలా సరిదిద్దడం ఎంతటి సమర్థమైన సర్జన్‌కు అయినా సాధ్యపడదు. ఐదు నుంచి పదేళ్లకు ముందు ఎలా ఉన్నారో ఆ రూపాన్ని తీసుకురాగలిగే వెసులుబాటు మాత్రమే ఉంటుంది. కాస్మటిక్ సర్జరీలతో ప్రకృతి విరుద్ధ ఫలితాన్ని సాధించడం అసాధ్యం. ఈ చికిత్సలతో అందాన్ని మెరుగు పరుచుకోవడం మాత్రమే సాధ్యపడుతుంది.
విల్లు లాంటి కనుబొమలు
కొందరికి కనురెప్పలు విపరీతంగా జారిపోయి, కళ్లకు అడ్డుపడుతూ ఉంటాయి. ఇంకొందరి ౖకనుబొమల దగ్గర మీద విపరీతంగా ముడతలు ఏర్పడతాయి. ఈ రెండు సమస్యలకూ సర్జరీని ఆశ్రయించవచ్చు.
దిద్దుబాటు ఇలా: కనుబొమల అడుగు కణజాలపు పొరను పైకి లాగి బిగించడం జరుగుతుంది. కోత కనిపించని ఈ సర్జరీతో 15 నుంచి 20 ఏళ్ల క్రితం కనుబొమలు ఏ స్థానంలో ఉండేవో, ఆ స్థానంలోకి చేర్చడం జరుగుతుంది.
కోలుకునే సమయం: మూడు రోజుల్లో కోలుకుంటారు. 10 రోజుల పాటు వాపు ఉండొచ్చు.
ఫలితం: సర్జరీతో ఫలితం 10 నుంచి 15 ఏళ్ల పాటు ఉంటుంది. సమస్య స్వల్పంగా ఉన్నప్పుడు ఫిల్లర్స్‌తో సరిదిద్దుకోవచ్చు. దీంతో ఫలితం 6 నెలల పాటు ఉంటుంది.
జారిపడే కనురెప్పలు
పైకనురెప్పల మీద ముడతలు ఏర్పడి కిందకు జారిపడిపోయినప్పుడు, ‘బ్లెఫరోప్లాస్టీ’తో సరిదిద్దవచ్చు. కింది కనురెప్ప దిగువన ఏర్పడే ఉబ్బు, గుంతలకు వేర్వేరు చికిత్సలుంటాయి.
దిద్దుబాటు ఇలా: కనురెప్పల మీద ముడతల రూపంలో ఉండే అదనపు చర్మాన్ని, కొవ్వునూ తొలగించి, చర్మాన్ని పైకి లాగి కుట్టేస్తారు. కంటి దిగువన గుంతలను ఫిల్లర్స్‌తో చక్కదిద్దవచ్చు. కళ్ల కింద ఉబ్బు ఉన్నప్పుడు అదనపు కొవ్వును తొలగించడం, లేదా సరైన స్థానంలో అమర్చడం చేస్తారు.
కోలుకునే సమయం: మూడు రోజుల్లో కోలుకుంటారు. 7 నుంచి 14 రోజుల పాటు వాపు ఉండొచ్చు.
ఫలితం: సర్జరీతో ఫలితం 10 నుంచి 15 ఏళ్ల పాటు ఉంటుంది. ఫిల్లర్స్‌తో సరిదిద్దినప్పుడు, ఫలితం 6 నెలల పాటు ఉంటుంది.
కోటేరు ముక్కు కోసం...
ముక్కు కిందకు వంగిపోవడం, ముక్కు మొన పదునుగా లేకుండా గుండ్రంగా ఉండడం, ముక్కుపుటాలు లావుగా ఉండడం, వంకరగా ఉండడం లాంటి ఇబ్బందులను ‘రైనోప్లాస్టీ’తో సరిదిద్దుకోవచ్చు.
దిద్దుబాటు ఇలా: ముక్కు దూలాన్ని కత్తిరించి, సరైన ఆకారంలో మలచడం, వేరే ప్రదేశం నుంచి ఎముకను సేకరించి ముక్కును పదునుగా మార్చడం
కోలుకునే సమయం: మృదులాస్థిని మాత్రమే సరిదిద్ది ముక్కును సరి చేసినప్పుడు, వారం నుంచి పది రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. ఎముక ప్రమేయం ఉన్నప్పుడు 15 నుంచి 20 రోజులు పట్టొచ్చు.
ఈ రెండు సందర్భాల్లో మూడు రోజుల్లోనే కోలుకున్నా, వారం పాటు వాపు కొనసాగుతుంది.
ఫలితం: రెనోప్లాస్టీతో శాశ్వత ఫలితం దక్కుతుంది. స్వల్ప దిద్దుబాట్ల కోసం ఎంచుకునే థ్రెడ్ లిఫ్ట్, ఫిల్లర్స్ ఫలితం ఏడాది పాటే ఉంటుంది.
చుబుకం చక్కగా...
చుబుకాన్ని ఫిల్లర్స్‌తో పదునుగా మార్చుకోవచ్చు. చుబుకం చిన్నదిగా ఉన్నా, కింది దవడ ముందుకు ఉన్నా సర్జరీ అవసరమవుతుంది.
దిద్దుబాటు ఇలా: సిలికాన్ ఇంప్లాంట్స్ సహాయంతో చుబుకానికి చక్కని రూపాన్ని తీసుకురావచ్చు.
కోలుకునే సమయం: ఉదయం సర్జరీ చేయించుకుని సాయంత్రం ఇంటికి వెళ్లిపోవచ్చు. ఎంతో అరుదుగా 2 నుంచి 3 శాతం మందికి ఈ సర్జరీ విఫలమవుతూ ఉంటుంది.
ఫలితం: సర్జరీతో ఫలితం 10 నుంచి 15 ఏళ్ల పాటు ఉంటుంది.
పైబడే వయసుతో చర్మం బిగుతు సడలి, జారిపోతుంది. ముడతలు, మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటిని కప్పిపుచ్చుకోవడం కోసం, చర్మ చికిత్సలను ఆశ్రయించడం నేడు పరిపాటై పోయింది. అయితే ఎంచుకునే చికిత్సలు సమస్య తీవ్రతకు, పైబడిన వయసుకూ తగినవై ఉండాలి. సన్నని గీతలు, ముడతలు, మచ్చలు లాంటి స్వల్ప లోపాలను సరిదిద్దడం కోసం బొటాక్స్, ఫిల్లర్స్, లేజర్స్, కెమికల్ పీల్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే వాటితో ఫలితం మెరుగ్గా ఉందనే ఉద్దేశంతో వయసు పైబడుతున్నా, అవే చికిత్సలను ఆశ్రయించడం సరికాదు. అలా చేస్తే, ముఖం ఉబ్బి, కృత్రిమ యవ్వనాన్ని తలపిస్తుంది. సర్జరీ అవసరం ఉన్న చోట తేలికపాటి చికిత్సలను ఎంచుకుంటే ఇదే జరుగుతూ ఉంటుంది. బదులుగా సమర్థమైన వైద్యుల సహాయంతో సరైన సర్జరీని ఎంచుకోగలిగితే, ఫలితం సహజసిద్ధంగా ఉంటుంది.
దవడ వెడల్పుగా ఉంటే...
కొందరికి దవడ కండరాలు పెద్దవిగా ఉంటాయి. ఇంకొందరి దవడ
నిర్మాణంలో లోపాలుంటాయి. వీటిని వేర్వేరు చికిత్సలతో సరిచేసుకోవచ్చు.
దిద్దుబాటు ఇలా: కింది దవడ మరీ వెనకకూ లేదా ముందుకూ ఉన్నప్పుడు ఎముకను కత్తిరించి సరిదిద్దవలసి ఉంటుంది. దవడ కండరాలు వెడల్పుగా ఉండడం వల్ల దవడలు వెడల్పుగా కనిపిస్తున్నప్పుడు, ఆరు నెలలకోసారి ఒక ఇంజక్షన్ చొప్పున, 3 నుంచి నాలుగు బొటాక్స్ ఇంజక్షన్లతో దవడ కండరం కుంచించుకుపోయేలా చేసి దవడకు చక్కని ఆకృతి తీసుకురావచ్చు.
కోలుకునే సమయం: కోలుకునే సమయం సర్జరీ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఇంప్లాంట్ అమర్చినప్పుడు 2, 3 రోజుల్లో కోలుకోవచ్చు. ఎముక ప్రమేయం ఉంటే 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది.
ఫలితం: సర్జరీతో ఫలితం 10 నుంచి 15 ఏళ్ల పాటు ఉంటుంది. బొటాక్స్‌తో దవడల్లో శాశ్వతమైన మార్పు సాధ్యపడుతుంది.
డాక్టర్ వెంకటేష్ బాబు
ప్లాస్టిక్ రికన్‌స్ట్రక్టివ్ అండ్ ఈస్థటిక్ సర్జన్,
కాస్మోస్యూర్ క్లినిక్, హైదరాబాద్.