Share News

Sweet Potatoes : చిలగడ దుంపలతో ప్రయోజనాలెన్నో!

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:57 AM

చిలకగడ దుంపల్లో ఎ, సి, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Sweet Potatoes : చిలగడ దుంపలతో ప్రయోజనాలెన్నో!

లికాలంలో ఎక్కువగా చిలగడ దుంపలు లభిస్తుంటాయి. వీటిని నిప్పులమీద కాల్చుకుని లేదా నీటిలో ఉడికించుకుని తింటూ ఉంటాం. చిలగడ దుంపల్లో అత్యధికంగా ఉండే పీచుపదార్థం, విటమిన్లు, ఇతర పోషకాలు అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి

చిలకగడ దుంపల్లో ఎ, సి, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శీతాకాలంలో ఎక్కువగా బాధించే శ్లేష్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి పొట్టుతీసి నెయ్యి రాసుకుని తింటే శరీరం వేడిని కోల్పోకుండా ఉంటుంది. దీని నుంచి లభించే మెగ్నీషియం మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.

గుండె

ఫ చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కలిగే ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సీకరణ ఒత్తిడిలపై ప్రభావవంతంగా పనిచేసి గుండె పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. చిలగడ దుంపలను తరచూ తినడం వల్ల వీటినుంచి లభించే పొటాషియం, మాంగనీస్‌, పీచుపదార్థాలు పలు కార్డియోవాస్క్యులర్‌ సమస్యలను నిరోధిస్తాయి.

జీర్ణక్రియ

చిలగడ దుంపల్లో కరగని పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రేగుల్లో అడ్డంకులను తొలగించి మలబద్దకం రాకుండా కాపాడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారించి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చేస్తాయి.

మధుమేహం

చిలగడ దుంపల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ నిదానంగా జరిగేలా చేసి శరీరం గ్లూకోజ్‌ను గ్రహించే వేగాన్ని తగ్గిస్తుంది. టైప్‌- 2 మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ చిలగడ దుంపను తినడం వల్ల రక్తంలో గ్లైకోసిలేటెడ్‌ హెమోగ్లోబిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది.


బరువు

చిలగడ దుంపలను తిన్న తరవాత వాటిలోని పిండిపదార్థాలు, పీచు పదార్థాలు కలిసి ఆకలి అనే భావన రాకుండా చేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి, శరీర బరువు పెరగకుండా ఉంటాయి.

మెదడు

చిలగడ దుంపల్లోని విటమిన్లు, మినరల్స్‌, బీటా కెరోటిన్‌ అన్నీ కలిసి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. మతిమరుపు, తలనొప్పి వంటి న్యూరాన్‌ సంబంధిత వ్యాధులను నిరోధిస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, కంటిచూపు మెరుగుపడతాయి.

క్యాన్సర్‌

చిలగడ దుంపల్లో ఉండే యాంథోసైనిన్‌ సమ్మేళనాలు క్యాన్సర్‌ కణాలతో పోరాడుతాయి. చిలగడ దుంపలను నిప్పుల మీద కాల్చుకుని తింటే అన్నవాహిక, జీర్ణాశయం, గొంతు సంబంధిత క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

చర్మం

చిలగడ దుంపలను తరచూ తినడం వల్ల చర్మం మీద ఉండే పొరలు తేమతో నిండి వార్థక్య లక్షణాలు తొందరగా రావు. చలిగాలికి చర్మం పొడిబారకుండా ఉంటుంది. వీటిలోని ఎ, సి విటమిన్లు చర్మానికి సాగే గుణాన్ని, మెరుపుని అందిస్తాయి. ముఖం మీద మొటిమలు, నల్లమచ్చలని పోగొడతాయి.

Updated Date - Nov 27 , 2024 | 01:17 AM