Share News

మానసి... సక్సెస్కు మారుపేరు

ABN , Publish Date - Sep 19 , 2024 | 05:48 AM

130 ఏళ్ల చరిత్ర ఉన్న వ్యాపార సామ్రాజ్యం. తండ్రి చనిపోవడంతో మూడు పదుల వయసులో వ్యాపార బాధ్యతలను భుజానకెత్తుకోవాల్సి వచ్చింది. అయితే తన మీద ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదు. సమర్ధవంతమైన వ్యాపారవేత్తగా సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తూ‘కిర్లోస్కర్‌

మానసి... సక్సెస్కు మారుపేరు

130 ఏళ్ల చరిత్ర ఉన్న వ్యాపార సామ్రాజ్యం. తండ్రి చనిపోవడంతో మూడు పదుల వయసులో వ్యాపార బాధ్యతలను భుజానకెత్తుకోవాల్సి వచ్చింది. అయితే తన మీద ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదు. సమర్ధవంతమైన వ్యాపారవేత్తగా సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తూ‘కిర్లోస్కర్‌ టాటా’ సంస్థకు తగిన వారసురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమే మానసి కిర్లోస్కర్‌ టాటా. కిర్లోస్కర్‌ వంశంలో ఐదో తరానికి చెందిన మానసి విశేషాలు ఇవి...

కిర్లోస్కర్‌ గ్రూపు సంస్థలకు అంతర్జాతీయంగా బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. దేశీయంగా అగ్రగామి సంస్థలుగా గుర్తింపు పొందిన వాటిల్లో కిర్లోస్కర్‌ ఒకటి. 2022 వరకు విక్రమ్‌ కిర్లోస్కర్‌ వ్యాపార బాధ్యతలను చూసుకునే వారు. 64 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో చనిపోయారు. దాంతో వ్యాపార నిర్వహణ బాధ్యతలు ఆయన కూతురు మానసి భుజానకెత్తుకుంది. 1990లో జన్మించిన మానసి వ్యాపార బాధ్యతలు చేపట్టాక సంస్థ గణనీయమైన విజయాలు సాధించింది. అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు మానసి పెద్దగా ఆసక్తి చూపరు. కుటుంబ గౌరవాన్ని, వ్యాపార వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఆమె ఎప్పుడూ కష్టపడుతుంటారు. రతన్‌ టాటా సవతి సోదరుడు అయిన నోయల్‌ టాటా కుమారుడు నెవిల్లే టాటాను 2019లో ఆమె వివాహం చేసుకున్నారు. అలా టాటా మనవరాలిగా మారిపోయారు. ఈ వివాహంతో రెండు అగ్రశ్రేణి వ్యాపార కుటుంబాల మఽధ్య బంధుత్వమే కాకుండా ఆశయాలను, లక్ష్యాలను సాధించేందుకు కలిసి పని చేసే అవకాశం దక్కింది. మానసి తల్లి గీతాంజలి కిర్లోస్కర్‌ కిర్లోస్కర్‌ సిస్టమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.


బాధ్యతలు చేపట్టాక...

మానసి చదువుంతా విదేశాల్లోనే జరిగింది. ఆమెరికాలోని రోడ్‌ ఐలాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఆమె ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి తరువాత కిర్లోస్కర్‌ సిస్టమ్స్‌ జాయింట్‌ వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించబడ్డారు. అంతేకాకుండా టయోటా ఇంజన్‌ ఇండియా లిమిటెడ్‌, కిర్లోస్కర్‌ టయోటా టెక్స్‌టైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, టయోటా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, డెనో కిర్లోస్కర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సంస్థలను విజయపథంలో నడిపించేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ విభాగంలో మూడేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు. అక్కడే టెక్నికల్‌ ప్రోసీజర్లు, తయారీ, జపనీస్‌ వర్క్‌ కల్చర్‌, క్వాలిటీ కంట్రోల్‌ టెక్నిక్స్‌, కమర్షియల్‌ ఆపరేషన్స్‌ వంటి విభాగాల్లో పట్టు సాధించారు. సంస్థ బాధ్యతలు చేపట్టడానికి ముందే ఆమె పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కిర్లోస్కర్‌ సంస్థ టయోటాతో కలిసి ఇన్నోవా, ఫార్చూనర్‌ కార్ల తయారీ, అమ్మకాలను ఇండియాలో నిర్వహిస్తోంది.

బిజీ లైఫ్‌లోనూ....

నిత్యం వ్యాపార నిర్వహణలో బిజీగా గడిపే మానసి తన హాబీలను నెరవేర్చుకునేందుకు సమయం కేటాయిస్తుంది. మానసి మంచి స్విమ్మర్‌. అడ్వెంచర్లు చేయడమంటే మానసికి చాలా ఇష్టం. పర్వతాలు అధిరోహించడం, డీప్‌ సీ డైవింగ్‌, టెన్నిస్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ను ఇష్టపడతారు. అలాగే ఆర్ట్‌ గ్యాలరీలను, హిస్టారికల్‌ సైట్స్‌ని, మ్యూజియంలను సందర్శించేందుకు అమితాసక్తి కనబరుస్తుంటారు. ‘కేరింగ్‌ విత్‌ కలర్‌’ అనే స్వచ్చంద సంస్థతో కలసి ఆమె పనిచేస్తున్నారు. ఈ సంస్థ మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య మెరుగవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అంతేకాకుండా మానసి మంచి పెయింటర్‌ కూడా. ఆమె వేసిన చిత్రాలు ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు కూడా పెట్టారు.

Updated Date - Sep 19 , 2024 | 05:48 AM