Eye care : విలువైన కళ్ల కోసం చవకైన పరికరాలు
ABN , Publish Date - Sep 17 , 2024 | 05:07 AM
కంటి వ్యాధులను సకాలంలో కనిపెట్టే పరీక్షలు చవకలో అందుబాటులోకొచ్చినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యపడుతుంది. ఆ దిశగా సరికొత్త పరిశోధనలకు
కంటి వ్యాధులను సకాలంలో కనిపెట్టే పరీక్షలు చవకలో అందుబాటులోకొచ్చినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యపడుతుంది. ఆ దిశగా సరికొత్త పరిశోధనలకు పూనుకున్న ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రి శాస్త్రవేత్తలు, తాజాగా కొన్ని పరికరాలను ఆవిష్కరించారు. వాటి పనితీరు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!
పిల్లలు, పెద్దలు కలిగి ఉండే వేర్వేరు కంటి సమస్యలకు వేర్వేరు నిర్థారణా ప్రక్రియలుంటాయి. ఇందుకోసం వాడుకలో ఉన్న పరికరాలు ఖరీదైనవీ, పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవీ అయినప్పుడు అందరూ వాటిని వినియోగించుకోలేకపోతూ ఉంటారు. ఫలితంగా కంటి సమస్యలను సకాలంలో కనిపెట్టలేక, సమస్య తీవ్రత పెరిగి కంటిచూపు క్షీణించే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, సమస్యను కచ్చితంగా కనిపెట్టే పరికరాలు అందుబాటులోకి రావాలి. అలాంటి పరికరాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు వాటి గురించి ఇలా వివరిస్తున్నారు.
గ్లాకోమాను అరికట్టే ‘ఓం’
తిరిగి సరిదిద్దలేనంతగా కంటిని దెబ్బతీసే సమస్య గ్లాకోమా! క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ, కంటి వైద్యుల కనుసన్నల్లో నడుచుకోవడం మినహా గ్లాకోమాను నియంత్రించే ఇతరత్రా మార్గాలే లేవు. అయితే తరచూ వైద్యులను కలవలేని వాళ్లు, పెద్దలు, దివ్యాంగులు, ఐసియుల్లో ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా గ్లాకోమా పరీక్షలు చేయించుకోవడం సాధ్యపడదు. కానీ తాజాగా రూపొందిన ఓమ్ (ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్) విఆర్ హెడ్‌సెట్, పరీక్షకు అనుకూలంగా ఉండడంతో పాటు, సులువుగా ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగే సౌలభ్యాన్ని కూడా కలిగి ఉంది. పైగా కేవలం పది నిమిషాల వ్యవధిలో సమస్యను కచ్చితంగా అంచనా వేయగలుగుతుంది. ఈ పరీక్ష ఖర్చు కేవలం 50 రూపాయలే!
డాక్టర్ శిరీష
స్పార్క్‌తో... మయోపియాకు అడ్డుకట్ట
పిల్లలను వేధించే కంటి సమస్యల్లో మయోపియా ఒకటి. ఐదు నుంచి 15 ఏళ్ల పిల్లల్లో తలెత్తే ఈ సమస్యలో దగ్గరి దృష్టి మెరుగ్గానే ఉన్నప్పటికీ, దూర దృష్టి తక్కువగా ఉండడంతో పిల్లలు బోర్డు మీద రాసి ఉన్న అక్షరాలను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య తీవ్రత ఇటీవలి కాలంలో ఎంతో పెరిగింది. ఇంతకు ముందు వంద మంది పిల్లల్లో ఐదుగురికి ఈ సమస్య ఉంటే, ప్రస్తుతం ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకర్లో కనిపిస్తోంది. ఇందుకు కారణం గ్యాడ్జెట్స్ వాడకం పెరగడమే! వాటిని కనిపెట్టే సంప్రదాయ విధానాలు ముందున ఉంచీ ఉన్నప్పటికీ, కళ్లద్దాలతో సరిపెట్టే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు కంటి మధ్యలోనే (సెంట్రల్ రిఫ్రాక్షన్) కాకుండా, ఇరువైపులా (పెరిఫెరల్ రిఫ్రాక్షన్) పవర్‌లను కనిపెట్టే పరికరాన్ని మేం సృష్టించాం. కంటికి ఇరువైపులా పవర్‌లను పరీక్షించడానికి మన దేశంలో కనీసం పది లక్షల రూపాయలు ఖర్చవుతాయి. కాబట్టి ఈ పరీక్ష అందరికీ సాధ్యపడకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు, సమస్య ఉందని నిర్థారించినప్పుడు, దాన్ని పెరగకుండా నియంత్రించే పరికరం స్పార్క్ (సింప్లిఫైడ్ పెరిఫెరల్ యాన్సిలరీ రిఫ్రాక్షన్)ను రూపొందించాం. మయోపతి కేసుల తగ్గుదలకూ, కచ్చితమైన చికిత్స అంచనాకూ, స్పార్క్ పరికరం ఎంతో బాగా సహాయపడుతుంది. మయోపియాకు ఇప్పటివరకూ కంటి చుక్కలు, కాంటాక్ట్‌లెన్స్‌లు, కళ్లజోళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కంటి మధ్యలో, పక్కల్లో ఉన్న పవర్ ఆధారంగా కచ్చితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోగలిగితే, ఖరీదైన కాంటాక్ట్‌లెన్స్‌లు, కళ్లజోళ్ల అవసరం తప్పుతుంది.
డాక్టర్ పవన్
బేబీస్ కోసం ‘బావీస్’
కంటి చూపు ఒక్కటే సరిపోదు. దాన్లో కలర్ విజన్, త్రీడి విజన్, సైడ్ విజన్ లాంటివి కూడా సమర్థంగా ఉండాలి. మరీ ముఖ్యంగా పసికందుల్లో ఈ లక్షణాలను కనిపెట్టడం కోసం ఇంతకు ముందు, టార్చ్‌లైట్ కళ్లలోకి వేసి, కంటి కదలికలను గమనించేవారు. అయితే ఈ పరీక్షతో పసికందుల కంటిచూపును మాత్రమే నిర్థారించగలిగేవారు తప్ప, ఆ చూపు ఎంత స్పష్టంగా కనిపెట్టే వీలుండేది కాదు. ప్రస్తుతం ఆవిష్కరణకు నోచుకున్న పరికరం పసికందులు కళ్లు, కంటిచూపుకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించగలుగుతుంది. పసికందులు వెలుగుకు మాత్రమే స్పందిస్తూ కళ్లను తిప్పగలుగుతారు కాబట్టి ఆ కదలికల ఆధారంగా, పసికందు దృష్టి సారించిన లక్ష్యం ఆధారంగా వారి కంటి చూపును కచ్చితంగా అంచనా వేయడం కోసం తాజాగా ‘బావీస్’ (బేబీ విజన్ స్ర్కీనర్) పరికరాన్ని ఆవిష్కరించాం. డోమ్ లాంటి ఈ పరికరంలో ఒక ఎల్‌ఇడి లేదా బహుళ ఎల్‌ఇడిలను వెలిగించి, పసికందులు కాంతి ప్రసరించే దిశను కనిపెట్టగలుగుతున్నదీ లేనిదీ వైద్యులు తెలుసుకోగలుగుతారు. ఈ ప్రక్రియలో కాంతిని కనిపెట్టడం కోసం పసికందులు తీసుకునే సమయాన్ని అంచనా వేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, హైపోగ్లైసెమిక్ ప్రభావానికి లోనైన పసికందులు బ్రెయిన్ డ్యామేజీతో పుడుతూ ఉంటారు. ఈ పిల్లలు పెరిగే క్రమంలో ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి బావీస్‌తో ఇలాంటి సమస్యను ప్రారంభంలో కనిపెట్టవచ్చు. బావీస్‌లో ఉండే ఇన్‌ఫ్రారెడ్ కెమెరా సహాయంతో, పసికందుల్లో క్యాటరాక్ట్, మీడియా ఒపాసిటీ సమస్యలను కూడా కనిపెట్టవచ్చు. అలాగే పసికందుల్లో మెల్ల కళ్లను కూడా బావీస్‌తో కనిపెట్టవచ్చు.
డాక్టర్ ప్రేమ నందిని
ఎల్‌వి ప్రసాద్ నేత్రాలయం, దేశ వ్యాప్త నేత్ర సంరక్షణ రంగంలో, వినూత్న విధానాలకూ, నిబద్ధతకూ పేరు పొందింది. పరిశోధన, ఆవిష్కరణలపరంగా కంటి సంరక్షణల విధానాల అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సాధించింది. సెంటర్ ఫర్ టెక్నాలజీ ఇన్నొవేషన్ డైరెక్టర్,
రమేష్ కెకునయా సారధ్యంలో వైద్యులు, డిజైనర్లు, ఇంజనీర్ల బృందం, కంటి సమస్యల పరిష్కారం, నియంత్రణల పరంగా అత్యాధునిక సాంకేతికతల ఆధారంగా నిరంతరం కొత్త పరికరాల సృష్టి కోసం కృషి చేస్తూ ఉండడం విశేషం.
మెదడు పనితీరును కనిపెట్టే... ప్యూపిల్ ఎన్
కాంతి ప్రభావానికి కదిలే, కంటి కదలికల ఆధారంగా మెదడు పనితీరును పసిగట్టే పరికరమే, ప్యూపిల్ ఎన్. ప్రమాదాల బారిన పడినవాళ్లు, ఇంటెన్సివ్ కేర్‌కు చేరుకున్న బాధితులు, క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులకు లోనైన వాళ్లలో మెదడు పనితీరు వేగంగా క్షీణిస్తూ ఉంటుంది. క్షీణించిన మెదడు పనితీరును సత్వరం కనిపెట్టడం ద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా కచ్చితమైన చికిత్సను ఆశ్రయించడంలో ఈ పరికరం కీలకంగా మారుతుంది. ప్రస్తుతం న్యూరోలైట్స్, న్యూరోఆప్టిక్ ప్యూపిలోమీటర్ లాంటి 6 నుంచి 7 లక్షల ధర పలికే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ఈ సౌలభ్యం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. తాజాగా రూపొందుతున్న ప్యూపిల్ ఎన్ కేవలం లక్ష రూపాయలకే అందుబాటులోకి రాబోతోంది.
డాక్టర్ శ్రీకాంత్ భరద్వాజ్