Eye Makeup tips: కలలు కనే కళ్ల కోసం..
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:21 AM
ముఖంలో టక్కున ఆకట్టుకునేవి కళ్లే! కాబట్టి కళ్లు మెరుపులు చిందేలా ఐమేకప్ వేసుకోవాలి. అందుకోసం ఇవిగో ఈ చిట్కాలు పాటించాలి.
ముఖంలో టక్కున ఆకట్టుకునేవి కళ్లే! కాబట్టి కళ్లు మెరుపులు చిందేలా ఐమేకప్ వేసుకోవాలి. అందుకోసం ఇవిగో ఈ చిట్కాలు పాటించాలి.
ఐ షాడో ఇలా...
ముదురు నుంచి లేత రంగుల వరకూ రకరకాల రంగుల ప్యాలెట్‌ను ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా మన కళ్లకు మరింత బాగా నప్పే రంగులు ఉండేలా చూసుకోవాలి.
రంగుల మీద పట్టు
ప్యాలెట్‌ను తెరిచి, ఏవి తేలిక రంగులు, ఏవి మధ్యస్థ రంగులు, ఏవి ముదురు రంగులో గుర్తించాలి. వీటిలో ఏ రంగులను ఉపయోగిస్తే, ఉబ్బెత్తుగా కనిపించేలా చేయవచ్చో, ఏ రంగులను ఉపయోగిస్తే, లోతుగా కనిపించేలా చేయవచ్చో తెలుసుకోవాలి. పై కను రెప్ప మధ్యలో ఉబ్బెత్తుగా కనిపించేలా తేలిక రంగు అద్దుకోవాలి. కొలకుల దగ్గర ముదురు రంగు ఐషాడో వేసుకోవాలి.
ఇలా అద్దుకోవాలి
తేలిక రంగులను హైలైట్ కోసం ఉపయోగించాలి. కంటి కొలకుల దగ్గర, కంటి ఎగువ ఎముక దగ్గర ఈ రంగులను వాడుకోవాలి.
మధ్యస్త రంగులను కంటి ప్రాధమిక ఆకారాన్ని ప్రస్ఫుటం చేయడం కోసం వాడుకోవాలి. అలాగే తేలికపాటి ప్రదేశాలను ముదురు రంగు ప్రదేశాల్లో కలిసిపోయేలా చేయడం కోసం కూడా ఈ రంగులు ఉపయోగపడతాయి. ఈ రంగులను కనురెప్పల మధ్యలో, ముడతల దగ్గర వాడుకోవాలి.
కంటి ఆకర్షణ కోసం, కాంటూరింగ్ కోసం ముదురు రంగులు ఉపయోగపడతాయి. కంటికి మరింత తీవ్రతను తెచ్చిపెట్టడం కోసం కూడా ముదురు ఐ షాడోలను వాడుకోవచ్చు. కనురెప్పల చివర్లలో, ముడతల దగ్గర ఈ రంగులను అప్లై చేసుకోవాలి.
బ్లెండింగ్: ముదురు రంగును లేత రంగులోకి కలపాలన్నా, లేత రంగును ముదురు రంగులోకి కలపాలన్నా బ్లెండింగ్ బ్రష్‌ను వృత్తాకారంలో కదిలిస్తూ బ్లెండ్ చేసుకోవాలి.