Fashion : ఎవర్‌గ్రీన్ ఈవినింగ్ గౌన్స్
ABN , Publish Date - Sep 25 , 2024 | 04:17 AM
పుట్టిన రోజు పార్టీలు, పెళ్లి వేడుకలకు అనువైన సమయం సాయంకాలమే! అలాంటి సందర్భాల్లో సంప్రదాయ వస్త్రధారణకు బదులుగాఆధునికత ఉట్టిపడే ఈవినింగ్ గౌన్స్ ఎంచుకోవచ్చు. అందుకోసం ఉద్దేశించినవే ఈ గౌన్స్!
ఫ్యాషన్
పుట్టిన రోజు పార్టీలు, పెళ్లి వేడుకలకు అనువైన సమయం సాయంకాలమే! అలాంటి సందర్భాల్లో సంప్రదాయ వస్త్రధారణకు బదులుగాఆధునికత ఉట్టిపడే ఈవినింగ్ గౌన్స్ ఎంచుకోవచ్చు. అందుకోసం ఉద్దేశించినవే ఈ గౌన్స్!
అందమైన డిజైన్లలో...
మెరుపులీనే సెక్విన్లు, ఆకట్టుకునే ఎంబ్రాయిడరీలు... ఇలా చెప్పుకుంటూపోతే ఈవినింగ్ గౌన్స్ కలిగి ఉండే హంగులకు ఒక అంతంటూ ఉండదు. మెటీరియల్ మొదలు, స్టిచింగ్ వరకూ వినూత్నంగా ఆకట్టుకునే అంశాలెన్నో ఈ గౌన్లలో ఉంటాయి. విలాసవంతమైన పార్టీలు మొదలు, సన్నిహితులతో జరుపుకునే చిన్నపాటి వేడుకల వరకూ ఎలాంటి సందర్భానికైనా ఈ గౌన్లు బ్రహ్మాండంగా సూటవుతాయి. స్లిట్ స్టైల్, ఎ లైన్ కట్ స్టిచ్... ఎలాంటి స్టైల్ గౌన్‌ను ఎంచుకున్నా ప్రత్యేకత ఉట్టిపడేలా ఉండాలంటే, ఒడ్డు పొడవుకు నప్పే లాంగ్ గౌన్ ఎంచుకోవాలి.
భిన్నమైన మెటీరియల్స్‌తో...
జార్జెట్, క్రేప్, షిఫాన్... ఇలా లాంగ్ గౌన్స్ ఎన్నో రకాల మెటీరియల్స్‌తో తయారవుతూ ఉంటాయి. లేయర్డ్ గౌన్స్ బుట్టబొమ్మలా కనిపించేలా చేస్తాయి కాబట్టి పీలగా ఉండే వాళ్లు వీటిని ఎంచుకోవచ్చు. పియర్ షేప్ శరీరాకృతి కలిగిన వాళ్లు, షిఫాన్, జార్జెట్ మెటీరియల్‌తో తయారైన లాంగ్ గైన్స్ ఎంచుకోవచ్చు. నాజూకుగా కనిపించడం కోసం నలుపు రంగు మెటీరియల్స్ ఎంచుకోవాలి.
యాక్సెసరీస్ ఇలా...
బోట్ నెక్ లాంగ్ గౌన్స్ వేసుకున్నప్పుడు చోకర్, హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి. లో నెక్ లాంగ్ గౌన్స్‌కు, నెక్లెస్ సూటవుతుంది. చేతికి బ్రేస్‌లెట్, ట్రెండీ పర్స్ బాగుంటాయి. కచ్చితంగా హైహీల్స్ వేసుకోవాలి. కిటెన్ హీల్స్, ఫ్లాట్స్ లాంగ్ గౌన్స్‌కు ఏమాత్రం సూట్ కావు.