Fashion Shawls: షాల్ సోకు
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:39 AM
ఫ్యాషన్‌కు అడ్డొస్తాయనే కారణంతో చలి కాలంలో శాలువాలు కప్పుకోడానికి వెనకాడే వాళ్లూ ఉంటారు.
ఫ్యాషన్‌కు అడ్డొస్తాయనే కారణంతో చలి కాలంలో శాలువాలు కప్పుకోడానికి వెనకాడే వాళ్లూ ఉంటారు. కానీ వెచ్చదనాన్ని అందిస్తూనే ఫ్యాషన్‌గా కనిపించేలా చేసే శాలువాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటినొకసారి చూద్దామా?
ఉన్ని, నూలు, పట్టు.. ఇలా వేర్వేరు దారాలతో తయారయ్యే భిన్నమైన శాలువాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మృదువైన మెటీరియల్‌తో అత్యంత సౌకర్యవంతంగా ఉండే శాలువాలు అటు ఆధునిక వస్త్రధారణకూ, ఇటు సంప్రదాయ కట్టుబొట్టుకూ నప్పేలా తయారవుతున్నాయి.
కలంకారి: కలం అంటే పెన్ను, కారి అంటే పనితనం. ఎంబ్రాయిడరీతో మోటిఫ్స్, పూలు, లతల డిజైన్లను సృష్టించడం ద్వారా కలంకారి కళాకారులు అందమైన శాలువాలను రూపొందిస్తూ ఉంటారు. రాజ దర్బారు, మొఘల్ దర్బారు, బారాత్ బార్డర్లతో తయారయ్యే కలంకారి శాలువాలు సర్వత్రా ప్రజాదరణ పొందుతున్నాయి.
సోజ్ని: ఇదొక తరహా నీడిల్ ఎంబ్రాయిడరీ. దీంతో సాదాసీదా వస్త్రం కాస్తా, అద్భుతమైన శాలువా రూపాన్ని సంతరించుకుంటుంది. 15వ శతాబ్దంలో పర్షియన్లు ఈ కళను కాశ్మీరు లోయలో ప్రవేశపెట్టడంతో సోజ్ని పనితనం ప్రఖ్యాతి పొందింది. పర్షియా భాషలో సోజ్ని అంటే ‘సూది’. అందంగా, మృదువుగా ఉండే సోజ్ని శాలువాలు తేలికగా కూడా ఉండడంతో వీటి వాడకం విస్రృతంగా విస్తరించింది.
పష్మీనా
ఫ్యాషన్‌గా కనిపించడంతో పాటు సంప్రదాయాలనూ, వారసత్వాన్నీ కలిగి ఉండే పష్మీనా శాలువాలు ఎంతో ప్రత్యేకమైనవి. లడాక్, కాశ్మీరులకు చెందిన చంగ్‌తాంగి పష్మీనా గొర్రెల ఉన్నితో తయారయ్యే స్వచ్ఛమైన పష్మీనా శాలువాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఎంచుకున్న డిజైన్, ఉపయోగించిన ఉన్ని ఆధారంగా కళాకారులు ఈ శాలువాల ధరలను నిర్ణయిస్తూ ఉంటారు. ఈ శాలువాల తయారీలో కళాకారులు సౌకర్యానికీ, మన్నికకు పెద్ద పీట వేస్తూ ఉంటారు.