Fashion ; చలి చంపుతున్న చమక్కులో...
ABN , Publish Date - Nov 27 , 2024 | 12:49 AM
చలి కాలంలో చలిని తప్పించుకుంటూ, ఫ్యాషన్‌గా కనిపించే దుస్తులు ఎంచుకోవాలి.
చలి కాలంలో చలిని తప్పించుకుంటూ, ఫ్యాషన్‌గా కనిపించే దుస్తులు ఎంచుకోవాలి. తాజా పోకడలకు తగ్గట్టుగా, అందరి ఆదరణ అందుకుంటున్న శీతాకాలానికి తగిన అందమైన దుస్తులు ఇవే...
స్కార్ఫ్: స్కార్ఫ్‌లు చలి నుంచి వెచ్చదనాన్నీ, సౌకర్యాన్నీ అందిస్తాయి. కాబట్టి చలి కాలం చున్నీలా స్కార్ఫ్‌ను మెడలో వేలాడదీసుకోవచ్చు. మెడ చుట్టూ చుట్టి ఫ్యాషన్ ట్రెండ్‌నూ సృష్టించవచ్చు.
పొడవాటి లెహంగా: పొడవాటి లెహంగాలు ఈ కాలంలో వెచ్చదనాన్ని అందించడంతో పాటు ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి ఆకట్టుకునే రంగులతో కూడిన ఈ లెహంగాలను ఎంచుకోవాలి. వీటికి తగ్గట్టు పదాలకు చదునైన చెప్పులు ధరించాలి.
జాకెట్: తోలు, నూలు మొదలైన పదార్థాలతో తయారైన జాకెట్ ఎంచుకుంటే ఈ కాలంలో వెచ్చగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అయితే ధరించే జాకెట్ భుజాలు దిగిపోకుండా ఉండేలా చూసుకోవాలి. జాకెట్ ఒంటికి హత్తుకుపోయినట్టు ఉన్నప్పుడే చూడముచ్చటగా ఉంటుంది. జాకెట్‌కు సరిజోడుగా బూట్లు బాగుంటాయి.
స్టోల్: ఇది కలకాలం కొనసాగే ఫ్యాషన్. కాబట్టి మందంగా ఉండే ఊలుతో తయారైన స్టోల్ ఎంచుకోవాలి.
స్వెటర్: చలి దుస్తులంటే గుర్తుకొచ్చేవి స్వెటర్లే! అయితే సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ, దుస్తుల్లో కలిసిపోయినట్టు కనిపించే స్వెటర్స్ అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటిని ఎంచుకుంటే రెట్టింపు ఆకర్షణీయంగా కనిపించడం ఖాయం.