liver Care : కాలేయానికి కొవ్వు ముప్పు
ABN , Publish Date - Aug 12 , 2024 | 11:28 PM
కాలేయం దెబ్బతింది అనగానే మన ఆలోచన మద్యం మీదకు మళ్లుతుంది. మద్యంతోనే కాలేయానికి కొవ్వు పడుతుందనేది కూడా అపోహే! అస్తవ్యస్థ ఆహార, జీవనశైలులు కూడా కాలేయ కొవ్వుకు కారణాలే! వీటిని నియంత్రించుకోకపోతే పరిస్థితి కాలేయ మార్పిడికి దిగజారే ప్రమాదం ఉంటుంది.
కాలేయం దెబ్బతింది అనగానే మన ఆలోచన మద్యం మీదకు మళ్లుతుంది. మద్యంతోనే కాలేయానికి కొవ్వు పడుతుందనేది కూడా అపోహే! అస్తవ్యస్థ ఆహార, జీవనశైలులు కూడా కాలేయ కొవ్వుకు కారణాలే! వీటిని నియంత్రించుకోకపోతే పరిస్థితి కాలేయ మార్పిడికి దిగజారే ప్రమాదం ఉంటుంది.
సాధారణ ఆరోగ్య పరీక్షల్లో గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ బయటపడుతూ ఉంటుంది. దీన్ని మనలో ఎవరం పెద్దగా పట్టించుకోం. ఇదేమంత ప్రమాదకరమైన పరిస్థితి కాదనీ, అందర్లో ఈ పరిస్థితి ఉంటుందనీ మనకి మనం నచ్చజెప్పుకుని సంతృప్తి పడుతూ ఉంటాం. కానీ దీన్ని, ముంచుకురాబోయే ప్రమాదానికి ముందస్తు హెచ్చరికలా పరిగణించాలి.
ఫ్యాటీ లివర్ ఎందుకు?
కాలేయానికి చక్కెర, కొవ్వు ప్రధాన శత్రువులు. శరీర ఎత్తుకు సరిపడా బరువు ఉండాలి. అంతకు మించితే శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఆరడుగుల వ్యక్తి 75 కిలోల బరువున్నా ఫర్వాలేదు. అదే వ్యక్తి 5 అడుగుల ఎత్తే ఉంటే, అది అవసరానికి మించిన బరువు అవుతుంది. ఈ పరిస్థితిని బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా ఎవరికి వారు తెలుసుకోవచ్చు. బిఎమ్‌ఐ ఎంత ఎక్కువగా ఉంటే శరీరంలో కొవ్వు అంత ఎక్కువగా ఉందని అర్థం. శరీరంలో ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే, కాలేయంలో కొవ్వు కణాలు కూడా అంత ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఒకవేళ శరీర బరువు అదుపులో ఉన్నా, మధుమేహం ఉన్నా, కొవ్వు కాలేయంలో పేరుకుంటుంది. ఇందుకు కారణం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే! కాబట్టి ఒబేసిటీ, మధుమేహం... ఈ రెండు సమస్యలూ కాలేయంలో కొవ్వు పేరుకునేలా చేస్తాయని తెలుసుకోవాలి.
ఇలా కనిపెట్టొచ్చు
ఫ్యాటీ లివర్... గ్రేడ్ 1, 2, 3 ... ఈ మూడు దశలు దాటిన తర్వాత ఫైబ్రోసిస్‌లో కూడా 3 గ్రేడ్లను దాటి, అంతిమంగా సిర్రోసిస్‌కు చేరుకుంటుంది. ఇలా దశలు దాటుకుని తిరిగి బాగుచేయలేనంతగా కాలేయం పాడవకుండా ఉండాలంటే ఫ్యాటీ లివర్ పరిస్థితిని ప్రారంభంలోనే తీవ్రంగా పరిగణించి, అక్కడితో అడ్డుకట్ట వేయాలి. ఫ్యాటీ లివర్ మొదటి మూడు దశలు, ఫైబ్రోసిస్‌లో మొదటి రెండు దశల్లో కూడా ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కాబట్టే కాలేయం తిరిగి సరిదిద్దలేనంతగా, తీవ్రంగా డ్యామేజ్ అయిన తర్వాతే తెలుసుకునే పరిస్థితి ఉంటోంది. సిర్రోసిస్ దశ దాటే సమయంలో మాత్రమే కామెర్లు, రక్తపు వాంతులు, పొట్టలో నీరు చేరడం లాంటి తీవ్రమైన లక్షణాలు బయల్పడతాయి. కాబట్టి అలా్ట్రసౌండ్, లివర్ ఫంక్షన్ పరీక్షల ద్వారా ఎవరికి వారు తమ కాలేయ ఆరోగ్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మధుమేహులైతే 25 ఏళ్ల వయసు నుంచీ, స్థూలకాయులు పాతికేళ్ల వయసు నుంచీ, మధుమేహం సమస్య లేకుండా, ఎత్తుకు సరిపడా బరువు ఉన్నవాళ్లు 50వ ఏట నుంచీ ప్రతి ఆరు నెలలకోసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యాటీ లివర్ ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి వయసు, మధుమేహం, అధిక బరువు ఆధారంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలను అంచనా వేసుకుని, పరీక్షలతో నిర్థారించుకుంటూ ఉండాలి.
నియంత్రణ ఇలా...
మధుమేహం వంశపారంపర్య సమస్య కాబట్టి దాన్ని నియంత్రించే అవకాశం లేదు. అయితే మెరుగైన ఆహారంతో, ముందు జాగ్రత్త చర్యలతో మధుమేహాన్ని వాయిదా వేయవచ్చు.
మధుమేహం వచ్చినా, తగిన మోతాదుల్లో మందులు వాడుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఫ్యాటీ లివర్ తొలి దశలోనే ఉన్నప్పుడు దాన్ని జీవనశైలి మార్పులతో మెరుగు పరుచుకోవచ్చు. బరువు తగ్గించుకుని, సమతులాహారం, క్రమం తప్పని వ్యాయామంతో ఈ స్థితిలో ఉన్న కాలేయాన్ని సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ ఫ్యాటీ లివర్ గ్రేడ్ పెరిగి కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంటే, ఎల్‌ఎఫ్‌టి, అలా్ట్రసౌండ్ స్కాన్, ఎమ్మారైలతో తీవ్రతను అంచనా వేసి జీవనశైలి మార్పులను అనుసరించడంతో పాటు, కొన్ని మందులను కూడా వాడుకోవలసి ఉంటుంది. సమస్య మరింత తీవ్రమైన సందర్భాల్లో కాలేయ మార్పిడి అవసరం అవుతుంది. ఫ్యాటీ లివర్ కేన్సర్‌కు కూడా దారి తీయవచ్చు.
ఫ్యాటీ లివర్ రాకుండా..
బరువు అదుపులో ఉంచుకోవాలి
మధుమేహాన్ని మందులతో నియంత్రణలో ఉంచుకోవాలి
రెడ్ మీట్ తగ్గించాలి (మటన్, పోర్క్, బీఫ్)
క్రమం తప్పక వ్యాయామం చేయాలి
జంక్‌ఫుడ్ తగ్గించాలి
హైపో థైరాయిడ్‌ను మందులతో నియంత్రణలో ఉంచుకోవాలి
అధిక కొలెస్ట్రాల్‌ను మందులతో అదుపులో పెట్టుకోవాలి
మద్యం మానేయాలి
డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్ర రావు
సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,
రెనోవా హాస్పిటల్,
బంజారాహిల్స్, హైదరాబాద్.