వెక్కిరించిన వంటకాలే మెప్పించేలా..!
ABN , Publish Date - Dec 04 , 2024 | 04:56 AM
ఇరవయ్యేళ్ళ క్రితం... ఎంతో ఉత్సాహంతో కొత్త బడిలోకి అడుగుపెట్టిన నాకు తొలి రోజే తోటి పిల్లల వెక్కిరింతలు స్వాగతం పలికాయి.
తమ తెగ సంస్కృతి గురించి, ఆహారపు అలవాట్ల గురించి మధుస్మిత సోరెన్‌కు అవహేళనలు, అవమానాలు ఎదురుకాని రోజు లేదు. కానీ అవి ఆమెలో పట్టుదలను పెంచాయి. వంటకాల్లో ప్రయోగాలకు ప్రేరణనిచ్చాయి. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్‌గా, కన్సల్టెంట్‌గా సంతాలీ గిరిజన రుచులను ఆమె ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేస్తున్నారు.
‘‘ఇరవయ్యేళ్ళ క్రితం... ఎంతో ఉత్సాహంతో కొత్త బడిలోకి అడుగుపెట్టిన నాకు తొలి రోజే తోటి పిల్లల వెక్కిరింతలు స్వాగతం పలికాయి. ‘‘మీరు నత్తల్ని, చీమల్ని తింటారట కదా!’’ అంటూ ఆటపట్టించారు. ఆ తరువాత ఆ బడిలో ఉన్నంతవరకూ మా సంస్కృతి మీద, ఆహారపు అలవాట్ల మీదా ఈ దాడి కొనసాగుతూనే ఉంది. మొదట్లో ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని. ఆ తరువాత నేను పట్టించుకోవడం మానేశాను. ప్రతి తరగతిలోనూ మొదటి స్థానంలో నిలిచి... వాళ్ళకన్నా నాదే పైచెయ్యి అని నిరూపించడానికి ప్రయత్నించాను. కానీ వారి మాటలు నన్ను వెంటాడుతూనే ఉండేవి.
ఆపోహలు పోగొట్టాలని...
మాది ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగపూర్‌కు చెందిన సంతాలీ గిరిజన కుటుంబం. నా తల్లితండ్రులకు నేను ఏకైక సంతానం కావడంతో ఎంతో గారాబం చేసేవారు. నన్ను బాగా చదివించాలని తాపత్రయపడేవారు. నాకూ చదువంటే చాలా ఇష్టం. భువనేశ్వర్‌లోని ‘కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ’ (కెఐఐటి)లో బిఇ, ఆ తరువాత ‘కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’లో మాస్టర్స్ చేశాను. ఐఐటిలో పిహెచ్‌డిలో చేరాను కానీ వివాహం కావడం, అత్తింట్లో బాధ్యతల కారణంగా మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అప్పటివరకూ నేను పెద్దగా వంటలు చేసింది లేదు. కానీ ఎప్పుడూ మా అమ్మ వెంటే ఉండడంతో... ఏ వంట ఎలా వండాలో కాస్త తెలుసు. మా సంప్రదాయ వంటకాలను అమ్మ బాగా చేసేది. వాటిరొ కొత్త దినుసుల్ని జోడించి మా అత్తవారింట్లో ప్రయోగాలు చేశాను. అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు నాకు మా బడిలో అనుభవాలు గుర్తొచ్చాయి. గిరిజన వంటకాల విషయంలో... మైదాన ప్రాంతాలవారికి చాలా అపోహలున్నాయి. వాటిలో కూడా ఎంతో వైవిధ్యం, ఆరోగ్యసూత్రాలెన్నో ఇమిడి ఉన్నాయని అందరికీ చెప్పాలనుకున్నాను. ‘రుచికరమైన ఆహారం సరిహద్దులకు, సంస్కృతులకు అతీతం. ఎన్నో విదేశీ వంటకాలను మనం ఏదో రూపంలో తింటున్నాం. మన రుచులను కూడా మిగిలిన ప్రాంతాలకు ఎందుకు పరిచయం చేయకూడదూ’ అనుకున్నాను. గిరిజన వంటలపై మరింత లోతైన అధ్యయనం కోసం అనేక గ్రామాలు తిరిగాను. వయోధికులైన మహిళలతో మాట్లాడాను. సంతాలీ, విదేశీ వంటల తయారీ పద్ధతుల సమ్మేళనంతో ప్రయోగాలు చేశాను. అప్పుడే అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది.
నమ్మకం పెరిగింది...
కొవిడ్‌కు ముందు ‘ఒడిశా హోమ్‌ఛెఫ్’ పోటీలు జరిగాయి. సంప్రదాయికమైన అంశాలేవీ మార్చకుండా... సంతాలీ వంటలకు సమకాలీనమైన హంగులు జోడించాను. ఆ పోటీలో మొదటి స్థానం నాదే. ఆ తరువాత జాతీయ స్థాయిలో ‘మాస్టర్ చెఫ్’ పోటీకి ఎంపికయ్యాను. ‘పొలెంటా’ అనేది ఇటాలియన్ వంటకం. దాన్ని కార్న్‌మీల్‌తో తయారు చేస్తారు. నేను మా ప్రాతంలో దొరికే ఎర్ర బియ్యం, చికెన్‌తో తయారు చేశాను. దానిలో నంజుకోవడానికి ఎర్ర చీమల (కై) చట్నీ రూపొందించాను. అవి న్యాయ నిర్ణేతలకు ఎంతగానో నచ్చాయి. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది నన్ను అభినందించారు. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. వంటల వీడియోల రూపకల్పనకు ప్రోత్సాహాన్నిచ్చింది. పూర్తిస్థాయి ఫుడ్‌బ్లాగర్‌గా మారాను. గిరిజన ఆహారాన్ని... సాధికారత చెక్కు చెదరకుండా... కొత్త పద్ధతులతో మేళవింపు చేయడం గురించి తెలుసుకోవడానికి ఆహార, ఆతిఽథ్య రంగాలకు చెందిన వ్యక్తులు నన్ను సంప్రతించడం ఆరంభించారు. నాకు మంచి ప్రచారం వచ్చింది.
అది గర్వంగా చెప్పుకోగలను...
ప్రస్తుతం అనేక మంది చెఫ్‌లతో, ప్రముఖ రెస్టారెంట్లతో, హోటల్ శిక్షణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాను. దాదాపు ప్రతి చోటా గిరిజన వంటకాలను వారి మెనూలో ఉండేలా చేయడం నేను సాధించిన విజయమని గర్వంగా చెప్పుకోగలను. విదేశాల్లోనూ ఇప్పుడు నాకు, నా వంటకాలకు ఎందరో అభిమానులున్నారు. నేను చదివిన ‘కెఐఐటి’, జయపురంలోని ‘ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్’ (ఐఐహెచ్‌ఎం)లలో గిరిజన ఆహార కన్సల్టెంట్‌గా ఉన్నాను. దేశవ్యాప్తంగా గిరిజన ఆహార పద్ధతులకు ప్రాచుర్యం తేవడానికి వర్క్‌షా్‌పలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాను. నేను చేసే ప్రతి కొత్త ప్రయోగం నాలో ఆత్మవిశ్వాసం పెంచుతోంది. తరతరాల మా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, నా మూలాల పరిరక్షణకు పాటుపడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.’’