Winter Health : జ్వరం వస్తే ఇవి తినండి!
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:24 PM
చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. ఇదే సమయంలో హానికారక వైర్‌సలు, బ్యాక్టీరియాలు శరీరంలోకి చేరుతుంటాయి. ఫలితంగా తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి.
చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. ఇదే సమయంలో హానికారక వైర్‌సలు, బ్యాక్టీరియాలు శరీరంలోకి చేరుతుంటాయి. ఫలితంగా తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. జ్వర తీవ్రతను తగ్గించి శరీరానికి శక్తిని అందించే ఆహారం గురించి తెలుసుకుందాం.
అల్లం, వెల్లుల్లి, ఉసిరి, పాలకూర: పాలకూరలో ఎ, సి, ఇ విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తరచూ తినడం వల్ల రక్తంలో తెల్ల రక్త కణాల పనితీరు మెరుగవుతుంది. తెల్ల రక్త కణాలు శరీరంలోని వ్యాధికారక క్రిములతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందులోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫ్లమేషన్ సమస్యలను నివారిస్తుంది. అల్లం, వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. చలికాలంలో తరచూ అల్లం టీ తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధుల కారణంగా వచ్చే జ్వరం తగ్గుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వెల్లుల్లి చారు, వెల్లుల్లి కారం లాంటివి ఆహారంలో చేర్చుకుంటే జ్వర తీవ్రత, నీరసం తగ్గుతాయి.
పసుపు, తులసి: ఈ రెంటిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జ్వర తీవ్రతను వెంటనే తగ్గిస్తాయి. ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో ఆరు తులసి ఆకులు వేసి అయిదు నిమిషాలు మరిగించాలి. ఈ వేడి నీటిని రోజుకు రెండుసార్లు తాగితే జ్వరం తగ్గుతుంది.
సిట్రస్ పండ్లు: నారింజ, ద్రాక్ష లాంటి సిట్రస్ పండ్లలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రక్తం పరిశుభ్రమై జ్వరం వల్ల వచ్చే అలసట, ఒత్తిడి, ఆయాసం తదితర సమస్యలు తగ్గుతాయి.
కొబ్బరి నీళ్లు, జావలు: జ్వరం వచ్చినపుడు శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో తేమ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన గ్లూకోజ్, ఎలకొ్ట్రలైట్లు, లవణాలు అందుతాయి. శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. సగ్గుబియ్యం, రాగిపిండి, బార్లీ గింజలతో జావ కాచుకొని తాగడం మంచిది.
కూరగాయల ముక్కలను నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి అందులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. నాలుక మీద రుచి తెలియకపోవడం, నోరు చేదుగా అనిపించడం వంటి సమస్యలు పోతాయి.
పోషకాహారం: జ్వరం వచ్చినపుడు విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచుపదార్థాలు, ప్రోటీన్లు తదితర పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తాజా కూరగాయలు, అన్ని రకాల పండ్లు, గింజలు, పప్పు ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్లు తదితరాలను ఆహారంలో చేర్చుకుంటే జ్వరం వల్ల వచ్చే నిస్సత్తువ తగ్గుతుంది. తేనె, పుట్టగొడుగులు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, వాము, సోంపు తదితరాలను తీసుకోవడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది.