Share News

Forbes India : అభిరుచే ఆలంబనగా

ABN , Publish Date - Dec 04 , 2024 | 11:36 PM

అభిరుచే ఆలంబనగా ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకుంది. ‘నిఫ్ట్‌’ పరీక్ష రాస్తే అందులో విఫలమైంది. రేడియో జాకీగా ఉద్యోగం మొదలుపెట్టి... హాస్యభరిత వీడియోలతో... కడుపుబ్బ నవ్విస్తూ... కంటెంట్‌ క్రియేటర్‌గా సరికొత్త ఎత్తులకు చేరింది. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌

Forbes India : అభిరుచే ఆలంబనగా

ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకుంది. ‘నిఫ్ట్‌’ పరీక్ష రాస్తే అందులో విఫలమైంది. రేడియో జాకీగా ఉద్యోగం మొదలుపెట్టి... హాస్యభరిత వీడియోలతో... కడుపుబ్బ నవ్విస్తూ... కంటెంట్‌ క్రియేటర్‌గా సరికొత్త ఎత్తులకు చేరింది. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌ స్టార్స్‌-100’ జాబితాలో చోటు దక్కించుకుంది. ‘నిఫ్ట్‌’ కల నెరవేరకపోయినా... విభిన్నమైన వస్త్రశ్రేణులను పరిచయం చేసే సంస్థకు అధిపతి అయింది. డిజిటల్‌ తెరపై తారగా... వ్యాపారవేత్తగా... ఇల్లాలిగా... విభిన్న పాత్రలు పోషిస్తున్న హర్షిత గుప్తా కథ ఇది.

‘‘కలలు కంటాం. వాటిని నిజం చేసుకొనేందుకు ప్రయత్నిస్తాం. అవి నెరవేరకపోతే! అప్పుడే జీవితం అర్థమవుతుంది. అనుకున్నవన్నీ జరగవని, ఫలితం ఏదైనా కష్టపడాలని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని... జీవితం ఇలా ఎన్నో పాఠాలు చెబుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖనవూలో వ్యాపార కుటుంబం మాది. నాన్న నీరజ్‌ గుప్తా వ్యాపారస్తుడు. అమ్మ నీలమ్‌. ఎందుకో తెలియదు... చిన్నప్పటి నుంచీ నాకు ఫ్యాషన్‌ రంగంలో స్థిరపడాలనే కోరిక. అందుకే స్థానిక ‘లా మార్టినీర్‌ గర్ల్స్‌ కాలేజీ’లో పన్నెండో తరగతి పూర్తయ్యాక... ‘నిఫ్ట్‌, ఎఫ్‌డీడీఐ, సింబియోసిస్‌, పెరల్‌’ తదితర ఫ్యాషన్‌ సంబంధిత పరీక్షలన్నీ రాశాను. ‘నిఫ్ట్‌’లో కోర్సు చేయాలన్నది నా కల. కానీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాను. అది నన్ను తీవ్ర వేదనకు గురి చేసింది. ఇక ఎప్పుడూ ఫ్యాషన్‌ వైపు వెళ్లలేనేమో అని ఎంతో ఏడ్చాను. నా కలల ప్రపంచమే అంతమైనట్టు అనిపించింది.

బాధ నుంచి బయటికొచ్చి...

అయితే కొద్ది కాలంలోనే బాధ నుంచి బయటకు రాగలిగాను. నోయిడా ‘అమిటి విశ్వవిద్యాలయం’ నుంచి జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ డిగ్రీ పూర్తి చేశాను. లఖనవూ ‘రెడ్‌ ఎఫ్‌ఎం’లో ప్రొడ్యూసర్‌గా ఉద్యోగం వచ్చింది. నెలకు జీతం 24 వేలు. అయితే అక్కడ పని వాతావరణం నాకు నచ్చలేదు. ఆరు నెలల తర్వాత రాజీనామా ఇచ్చి, ‘రేడియో మిర్చీ’లో జాకీగా మరో కొత్త పాత్ర ప్రారంభించాను. దాంతోపాటు ప్రముఖ మీడియా సంస్థలకు కంటెంట్‌ అందిస్తూ వచ్చాను. వృత్తిలో భాగంగా కొన్ని వీడియోలు తీయాలి. ఎంత ప్రయత్నించినా మా బాస్‌ కోరుకున్న విధంగా వీడియో కంటెంట్‌ ఇవ్వలేకపోయేదాన్ని. కొన్నాళ్లకు కుదురుకున్నాను. ఇతర విభాగాలపై అవగాహన పెంచుకున్నాను. ఈ క్రమంలోనే కెమెరాతో దోస్తీ కుదిరింది. ఎలాంటి బెరుకూ లేకుండా దాని ముందు నా హావభావాలు చూపించగలిగాను. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.

Harshita-(4)-f.jpg


సరదా వీడియోలు...

కెమెరా ముందుకు రావడంవల్ల ఒక రకంగా నాకు జ్ఞానోదయం అయిందని చెప్పవచ్చు. అది నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. అందులో నుంచి పుట్టిందే ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌. అయితే కంటెంట్‌ ఏముండాలి? లక్షల్లో కంటెంట్‌ క్రియేటర్లు ఉండగా నా రీల్స్‌ ఆకట్టుకోవాలంటే ఏంచేయాలి? దీని కోసం కొంత పరిశోధన చేశాక ఒక నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే నేటితరానికి నా వీడియోలు కాస్తంతైనా ఉపశమనం ఇచ్చేవి కావాలనుకున్నాను. అలాంటివే తీసి అప్‌లోడ్‌ చేస్తే... అద్భుతమైన స్పందన వచ్చింది. నా రీల్స్‌ అన్నింట్లో మంచి మిత్రులు, తండ్రీ-కూతుళ్ల మధ్య జరిగే సరదా సంభాషణలే ఉంటాయి. చూసే వారి ముఖంపై చిరునవ్వులు చిందిస్తాయి. ప్రతి రీల్‌కూ లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైక్స్‌ వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాలో నాకు దాదాపు పదిహేను లక్షలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా ఒక చానల్‌ ప్రారంభించాను. అక్కడ కూడా మంచి స్పందన లభిస్తోంది.

సంప్రదాయ సోయగం...

ఇన్‌స్టా రీల్స్‌కు మంచి ఆదరణ లభిస్తుండడంతో ఉద్యోగం వదిలేశాను. రీల్స్‌, బ్రాడ్లకు ప్రచారం ద్వారా చేతినిండా సంపాదిస్తున్నా వెలితిగానే ఉండేది. ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదగాలని, వినూత్న వస్త్ర శ్రేణులను తీసుకురావాలని. చిన్నప్పటి ఆ కలను నెరవేర్చుకొనే దిశగా అడుగులు వేశాను. మా లఖనవూలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ చికంకారీ కళను దేశమంతా పరిచయం చేయాలనుకున్నాను. ఇది పర్షియన్‌ ఎంబ్రయిడరీ కళ. దీనికి ఆధునిక హంగులు అద్ది, సరికొత్త డ్రెస్‌లను తీసుకువచ్చాను. మావారి సహకారం, ప్రోద్బలంతో ‘చికంకారీ హ్యూస్‌’ పేరుతో ఈ ఏడాది మేలో ఒక సంస్థ ప్రారంభించాను. సాధారణంగా చికంకారీ అద్దిన వస్త్రాలను శుభకార్యాలకు వేసుకొంటారు. అలాకాకుండా నిత్యజీవితంలో కార్యాలయాలు, కళాశాలలకు వెళ్లే మగువలు కూడా ధరించేలా మా వస్త్రశ్రేణులు రూపొందించాం. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. అన్నిటికీ మించి నా కల నెరవేరింది.

మధురానుభూతి...

ఇన్నేళ్ల నా ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. సవాళ్లు ఎదుర్కొన్నాను. కానీ ఎన్నడూ వెనకడుగు వేయలేదు. అదే ఇవాళ నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ఇంతటి విజయవంతమైన కెరీర్‌ను, సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చింది. మనపై మనకు నమ్మకం ఉండాలి. అంకితభావంతో పని చేయాలి. ఫలితం అదే వస్తుందనడానికి నా విజయాలే ఉదాహరణ. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌ స్టార్స్‌-100’ జాబితాలో నాకు ఆరో స్థానం దక్కింది. నిజంగా ఇది నాకు ఎంతో గర్వకారణం. స్వశక్తితో నాకు నేను నిర్మించుకున్న కెరీర్‌. అందులో రాణించడం కంటే సంతృప్తి ఏముంటుంది!’’

Updated Date - Dec 04 , 2024 | 11:36 PM