Parenting Tips: పేరెంటింగ్ పిల్లల్లో ఆధ్యాత్మికత ఇలా...
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:02 AM
బాల్యంలో నేర్చుకునే ప్రతీ అంశం పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది.
బాల్యంలో నేర్చుకునే ప్రతీ అంశం పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. అందుకే పిల్లల మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తొలి పాఠాలు నేర్పించాల్సి ఉంటుంది. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతోపాటు ఆధ్యాత్మిక భావనలు అలవడేలా పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి. వయసుతోపాటు వ్యక్తిత్వం వికసించే విధంగా పిల్లలకు ఆధ్యాత్మికతను ఎలా పరిచయం చేయాలో తెలుసుకుందాం.
కృతజ్ఞతలు చెప్పడం
భగవంతునికి, ప్రకృతికి ధన్యవాదాలు చెప్పడమనేది అద్భుతమైన ఆధ్యాత్మిక భావన. పిల్లలకు ప్రతిరోజూ సూర్యోదయానికి ఎదురుగా నిలబడి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించడం అలవాటు చేయండి. ఇది వారిలో సానుకూల దృక్పథాన్ని, నూతనోత్సాహాన్ని పెంచుతుంది. నిరాశను తొలగిస్తుంది. భోజనానికి ముందు భగవంతుని స్మరించడం నేర్పించండి. దీనివల్ల పిల్లలకు ప్రకృతి శక్తి అవగతమవుతుంది. పెంపుడు జంతువులు చూపే ప్రేమకు విధేయంగా ఉండమని చెప్పండి. మనసులోని కృతజ్ఞతా భావం జీవితాన్ని ఎలా సంతోషమయం చేస్తుందో పిల్లలకు వివరించండి.
దయతో ఉండడం
సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల దయతో వ్యవహరించాలని పిల్లలకు చెప్పండి. భగవంతుని దయా గుణాన్ని చిన్న కథల రూపంలో వివరించండి. ఇవి పిల్లల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి. మెల్లగా ఆచరణలో పెట్టే ప్రయత్నం ఆరంభిస్తారు. పాఠశాలలో పేద పిల్లలకు సహాయం చేయడం, పుస్తకాలు పంచుకోవడం, కలిసి ఆడుకోవడం లాంటివి అలవరచుకుంటారు. వృద్దులు, వికలాంగులకు అవసరమైన సహాయం అందించడంలో వెనకాడకూడదని పిల్లలకు చెప్పండి. దీనితో పిల్లలు సరైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
ధ్యానం చేయడం
ప్రస్తుతం పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తోంది. చేస్తున్న పనిమీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనికి పరిష్కారంగా పిల్లలకు ఉదయం లేదంటే సాయంత్రం అరగంట ధ్యానం చేయడం నేర్పించండి. వేగంగా శ్వాస తీసుకోవడం, మెల్లగా శ్వాస వదలడం వంటివి సాధన చేయించండి. ఇష్టదైవాన్ని తలచుకోవడం, ప్రశాంతమైన వాతావరణంలో వీచే చల్లని గాలిని అనుభూతి చెందడం, పక్షుల అరుపులు వినడం, పూల వాసనలు గ్రహించడం ద్వారా ప్రకృతిలో విహరించడాన్ని నేర్పించండి. ధ్యానం వల్ల మనసు, మెదడు విశ్రాంతి పొందుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
క్షమించడం
క్షమకు మించిన ఆధ్యాత్మిక భావన లేదు. క్షమించే మనసుకి భగవంతుని సహకారం ఉంటుందని పిల్లలకు చెప్పండి. దీనికి ఉదాహరణగా పురాణాలు, ఇతిహాసాల్లోని చిన్న కథలు చెప్పండి. కోపం, పగల కారణంగా మనసులో బరువు పెరుగుతుంది. దీనివల్ల పెదవులపై చిరునవ్వు, కళ్లలో ప్రశాంతత కరువవుతాయి. తప్పు చేసినపుడు క్షమాపణ కోరడం, తప్పు చేసినవారిని క్షమించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పిల్లలకు వివరించండి. ఈ గుణం పిల్లలను అందరిలో ఉన్నతంగా నిలుపుతుంది.
సేవ చేయడం
మానవ సేవే మాధవ సేవ అని పిల్లలకు చెప్పండి. బాధలో ఉన్నవారిని ఓదార్చడం నేర్పించండి. స్నేహితులకు లేదా పక్కింటివారికి కష్టం వచ్చిందని తెలిస్తే తనవంతు సహాయం చేసేలా ప్రోత్సహించండి. దీనివల్ల సంబంధాలు బలపరచుకుంటూ ముందుకు సాగడం పిల్లలకు అర్థమవుతుంది. పాఠశాల, గుడి ప్రాంగణాలను పిల్లలచేత శుభ్రం చేయించండి. వారికి సేవాభావం అలవడుతుంది. పిల్లల పుట్టినరోజున అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడివారితో గడపడాన్ని పరిచయం చేయండి. దీనివల్ల పిల్లలకు జీవితం విలువ, భగవంతుని తత్వం అర్థమవుతాయి.
భక్తితో ఉండడం
భక్తి భావన అనేది వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతుంది. పిల్లలు సాధారణంగా దేవుడి గురించి అలాగే ఈ ప్రపంచం, జీవితం గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. వాటన్నింటికీ క్లుప్తంగా వారికి అర్థమయ్యే రీతిలో సమాధానాలు చెప్పండి. భగవంతుని రూపాలు, మన పండుగలు, సంప్రదాయాలు, భగవద్గీత ప్రాముఖ్యం, పురాణాల విశిష్టత గురించి వివరించి చెప్పండి. దీనివల్ల పిల్లలు కష్టపడి సాధించుకోవడం, సమస్యలకు పరిష్కారాలు వెదుక్కోవడం, సమాజ శ్రేయస్సుకు పాటుపడడం వంటివి నేర్చుకుంటారు.