Health: జామ ఆకు టీతో ప్రయోజనాలెన్నో
ABN , Publish Date - Dec 15 , 2024 | 03:31 AM
జామకాయతోపాటు జామాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో టానిన్ కెమికల్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్, యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, మరెన్నో పోషకాలు ఉంటాయి.
జామకాయతోపాటు జామాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో టానిన్ కెమికల్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్, యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, మరెన్నో పోషకాలు ఉంటాయి. జామాకు టీ తయారు చేసుకోవడం చాలా సులువు. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు పోయండి. అందులో అయిదు జామాకులు వేసి మరిగించండి. తరవాత ఆ నీటిని వడబోసి కొద్దిగా నిమ్మరసం, పటికబెల్లం వేసి కలిపితే చాలు. ఈ టీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో...
శిరోజాలకు: జామాకు టీ తాగడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. రాలిన వెంట్రుకల స్థానంలో కొత్తవి వస్తాయి. జామాకు టీతో తలమీద మర్దన చేస్తే శిరోజాలకు తేమ, పోషణ అంది నల్లగా మెరుస్తాయి.
చర్మానికి: జామాకు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. జామాకు టీలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే చర్మం తేమతో నిండి నిగారింపు సంతరించుకుంటుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అకాల వార్దక్యం వల్ల వచ్చే ముడతలు, గీతలు తొలగిపోతాయి. కళ్ల చుట్టూ నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి.
బరువుకు: రోజుకి రెండుసార్లు జామాకు టీ తాగడం వల్ల అందులోని ఫినోలిక్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. దీనితో జీవక్రియలు వేగంగా జరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు రావు. భోజనం తరవాత ఈ టీ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
జీర్ణక్రియకు: జామాకు టీలో యాంటీ మైక్రోబయల్ సమ్మేళనాలు, పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని ఆరోగ్యవంతంగా మార్చి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తాయి. ఈ టీ తాగడం వల్ల డయేరియా, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. పేగులు కూడా శుభ్రపడతాయి.
నెలసరికి: జామాకు టీని తరచూ తాగుతూ ఉంటే నెలసరి సమస్యలు తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నెలసరి సమయంలో వచ్చే నొప్పులను, అనిశ్చితిని తొలగిస్తాయి. మహిళల్లో హార్మోన్లను సంతులనం చేసి రుతుక్రమాన్ని క్రమబద్దీకరిస్తాయి.
రోగనిరోధక శక్తికి: జామాకు టీలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో రోజుకు రెండుసార్లు జామాకు టీ తాగితే శరీరానికి సి విటమిన్, ఐరన్ తగు మోతాదులో అంది జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
గుండెకు: ప్రతిరోజూ ఉదయాన్నే జామాకు టీ తాగితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వల్ల గుండె జబ్బులు రావు.