Share News

Okra: బెండకాయలతో బ్రహ్మాండంగా!

ABN , Publish Date - Dec 16 , 2024 | 03:33 AM

బెండకాయలతో తయారుచేసిన రకరకాల కూరలు, వేపుళ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

Okra: బెండకాయలతో బ్రహ్మాండంగా!

బెండకాయలతో తయారుచేసిన రకరకాల కూరలు, వేపుళ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వారానికి రెండుసార్లు బెండకాయలను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి గుండె జబ్బులు రావు. రక్తం శుద్ది అవుతుంది. బెండకాయల్లో ఫోలిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. కాబట్టి బెండకాయ కూరలను పెరిగే పిల్లలు, గర్భిణులు తప్పనిసరిగా తినాలి. లేత బెండకాయలతో చేసే ప్రత్యేక వంటకాల వివరాలు మీ కోసం.......

బెండకాయ మసాలా వేపుడు

అరకేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడవాలి. తరవాత చిన్న ముక్కలుగా కోయాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి రెండు చెంచాల వేరుశనగ గుండ్లు, రెండు చెంచాల తెల్ల నువ్వులు, అరచెంచా జీలకర్ర, రెండు చెంచాల ఎండు కొబ్బరి పొడి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా వేపాలి. వీటిని చల్లార్చి మెత్తని పొడిలా చేయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అయిదు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. అందులో రెండు కరివేపాకు రెమ్మలు తుంచి వేయాలి. తరవాత బెండకాయ ముక్కలు వేసి గిన్నెను కదిలిస్తూ వాటిని దోరగా వేపాలి. ముక్కలు వేగాక వాటిపై ఒక చెంచా ఉప్పు, ముప్పావు చెంచా కారం, ముందుగా తయారు చేసుకున్న మసాల పొడి, చిటికెడు పసుపు వేసి గిన్నెను పైకి కింది ఊపుతూ నాలుగు నిమిషాలు కలపాలి. గరిటెతో కలపకూడదు. కావాలనుకుంటే గరం మసాలా పొడి కూడా చల్లుకోవచ్చు. కొత్తిమీర తరుగు వేసి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ వేపుడు వేడి అన్నంలోకి బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు.

బెండకాయ పకోడీ

పావు కేజీ బెండకాయలను నిలువుగా చీలికల మాదిరి కోయాలి. ఒక గిన్నెలో అర చెంచా గరం మసాలా, ఒక చెంచా కార్న్‌ఫ్లోర్‌, అయిదు చెంచాల బియ్యం పిండి, ఒక చెంచా ధనియాల పొడి, రెండు చెంచాల కారం, ఒక చెంచా ఉప్పు, అరగ్లాసు నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి. ఇందులో బెండకాయ చీలికలు వేసి పావు గంట నాననివ్వాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. నూనె బాగా వేడెక్కాక అందులో బెండకాయ చీలికలను ఒక్కోటి వేయాలి. ఎర్రగా వేగిన తరవాత టిష్యూ పేపర్‌లోకి తీయాలి. ఈ బెండకాయ పకోడీని చిరుతిండిగా పిల్లలకు పెట్టవచ్చు. టీ సమయంలో పెద్దవాళ్లు తినడానికి కూడా బాగుంటుంది.

gtkh.jpg


టమాటా-భిండీ మసాలా

పావుకేజీ బెండకాయలకు మధ్యలో పొడవుగా గాటు పెట్టాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి అయిదు చెంచాల నూనె వేసి వేడయ్యాక పావు చెంచా జీలకర్ర, పావు చెంచా ఆవాలు వేయాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేయాలి. అది కొద్దిగా వేగాక బెండకాయలు, ఒక చెంచా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి మగ్గించాలి. అయిదు నిమిషాల తరవాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేసి కలపాలి. టమాటా ముక్కలు మెత్తగా అయిన తరవాత రెండు చెంచాల కారం, ఒక చెంచా ధనియాల పొడి. అర చెంచా గరం మసాలా పొడి, అరచెంచా ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాల తరవాత స్టవ్‌ మీద నుంచి దించి రెండు చెంచాల నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మెల్లగా కలపాలి. ఈ మసాలా కూర పుల్కాలు, చపాతీల్లోకి బాగుంటుంది.

భిండీ-వెల్లుల్లి వేపుడు

బెండకాయలను మధ్యలో చీల్చి ఉంచుకోవాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి చీలికలు, పొడవుగా కోసిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, రెండు కరివేపాకు రెమ్మలు వేసి దోరగా వేపాలి. తరవాత బెండకాయలు వేసి కలపాలి. బెండకాయలు బాగా వేగాక రుచికి తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్‌ మీద నుంచి దించి ఒక చెంచా నిమ్మరసం వేసి కలపాలి. ఈ వేపుడు కూడా వేడి అన్నంలోకి బాగుంటుంది.

Updated Date - Dec 16 , 2024 | 03:33 AM