Share News

ఎర్ర బియ్యమే మేలు

ABN , Publish Date - Dec 07 , 2024 | 03:53 AM

బియ్యాన్ని శాలిధాన్యం అంటారు. శాలి అంటే శ్రేష్ఠమైనదని. బుద్ధిశాలి, ధైర్యశాలి లాంటి పదాలలో శాలి లాంటిదే ఇది కూడా! అన్నంగా వండుకుని తినటానికి బియ్యాన్ని మించిన ధాన్యం లేదు.

ఎర్ర బియ్యమే మేలు

బియ్యాన్ని శాలిధాన్యం అంటారు. శాలి అంటే శ్రేష్ఠమైనదని. బుద్ధిశాలి, ధైర్యశాలి లాంటి పదాలలో శాలి లాంటిదే ఇది కూడా! అన్నంగా వండుకుని తినటానికి బియ్యాన్ని మించిన ధాన్యం లేదు. అందుకే దాన్ని శాలి (శ్రేష్ఠం) అన్నారు. శాలివనపాలికుడంటే వరి పండించే రైతు. వరి పండే నల్లరేగడి భూమిని శాలేయం అంటారు. ఒకప్పుడు కాసరవడ్లు, తిరువరంగాలు, నెమలివడ్లు, బంగారు తీగలు, పిషాణపు వడ్లు, వెన్నముద్దలు ఇలా అనేక రకాల వరిధాన్యాలు పండించేవాళ్లు. ఇప్పుడంటే సైన్సు బాగా అభివృద్ధి చెందింది కాబట్టి జన్యు పరివర్తన పద్ధతిలో అనేక రకాల ధాన్యాలు తయారు చేస్తున్నారు. సైన్సు ఇంతగా అభివృద్ధి చెందని సమయంలో మన పూర్వీకులు ఎలాంటి ధాన్యాలు పండించారనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. మన పూర్వీకులు తెలుపు, నలుపు, ఎరుపు... మూడు రంగుల్లో ధాన్యాలు పండించారని ‘భోజన కుతూహలం’ గ్రంథం చెబుతుంది. ఈ ధాన్యాలకు ఉన్న లక్షణాలను కూడా ఇది తెలియజేస్తుంది.

తెల్ల బియ్యం

‘‘రాజాన్నంతు త్రిదోషఘ్నం మధురం లఘ్ఢుదీపనం బలకృత్‌ పథ్యం కాంతిదం వీర్యవర్థనమ్‌’’

ఈ శ్లోకాన్ని భోజన కుతూహలంలో రాజనిఘంటువు అనే గ్రంథంలోంచి తీసి ఉదహరిస్తారు. దీని ప్రకారం చూస్తే-

శాలిధాన్యంతో వండిన అన్నాన్ని రాజాన్నం అంటారు. అన్ని దోషాలను పోగొట్టి ఆరోగ్యాన్నిస్తుంది. రుచిగా మధురంగా ఉంటుంది. తేలికగా అరుగుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.బలకరం. అన్ని వ్యాధుల్లోనూ తినదగినది. పురుషులలో జీవకణాలను పెంచుతుంది. దీనిలోనే ‘‘మహారాష్ట్రేషు రాజభోగైతి, రాజాన్న మిత్యేవాంధ్రేషు ప్రసిద్ధమ్‌’’ అనే శ్లోకం కూడా ఉంది. అంటే

మహారాష్ట్రలో ఈ ధాన్యాన్ని రాజభోగాలని, ఆంధ్రప్రాంతంలో రాజాన్నం అంటారనీ

ఈ గ్రంథం వివరించింది. ఇది 500 ఏళ్ల క్రితం నాటి సమాచారం. అందుకే బియ్యంలో ఎన్ని మార్పులు వచ్చినా ఈనాటికీ వరన్నం తెలుగు వారికి రాజాన్నమే!


నల్ల బియ్యం

ఈ నల్లబియ్యం మనకు కొత్త కాదు. భోజనకుతూహలంలో - దీనిని ‘‘కృష్ణశాలీర్గోదాతీరే ప్రసిద్ధః’’ అని పేర్కొన్నారు. అంటే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతాల్లో ఈ బియ్యం లభ్యమవుతుందని అర్థం. ఇక దీని గొప్పతనం గురించి చెబుతూ..

‘‘కృష్ణశాలీత్రిదోషఘ్నో మధురాః పుష్టివర్ధనః్ఢ వర్ణకాంతికరో బల్యో దాహజిద్వీర్యవర్థనః’’ అని పేర్కొన్నారు. కృష్ణశాలీ అంటే నల్లబియ్యం. ఇది దోషాలనూ హరిస్తుంది. మధురాతిమధురంగా ఉంటుంది. చిక్కి పోతున్నవారికి పెట్టదగినవి. శరీరానికి మంచి రంగుని కాంతినీ కలిగిస్తుంది. శరీరంలో వేడిని తగ్గించి, పురుషుల్లో జీవకణాలను పెంచుతుంది. ప్రస్తుతం మనకు ఇండోనేషియా రకం, ఫిలిప్పిన్‌ రకం, థాయిల్యాండ్‌ రకం- ఇలా అనేక రకాల బియ్యాలు దొరుకుతున్నాయి. చక్‌హవో అనే మణిపురి బియ్యం, తమిళనాడులో పండే కవునిఅరిసి రకం కూడా లభ్యమవుతున్నాయి. ఈ బియ్యంలో 10 శాతం దాకా ప్రొటీన్లు లభిస్తాయి. కొవ్వు శాతం కూడా చాలా తక్కువ!


ఎర్ర బియ్యం

ఎర్ర బియ్యం (రక్తశాలిధాన్యం) అంటే, దంపుడు బియ్యం కాదు. ఈ బియ్యమే ఎర్రగా ఉంటాయి. నల్ల బియ్యం పైపొరలో ఉండే యాంథోసియనైన్‌ అనే రంజకమే ఈ ఎరుపు రంగు రావటానికి కూడా కారణం అవుతోంది. కానీ తెల్ల బియ్యంకన్నా, నల్లబియ్యంకన్నా ఎర్రబియ్యానికి పోషకాలు ఎక్కువ. గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్రబియ్యం సర్వ శ్రేష్ఠం. మధుమేహ వ్యాధిగ్రస్తులు, స్థూలకాయులు కూడా దీనిని తినవచ్చు. ‘భోజనకుతూహలం’ లో దీని గురించి

‘‘ రక్తశాలిస్తు మధురోలఘుః స్నిగ్ధో బలావహః రుచికృద్దీపనః

పథ్యో ముఖజాడ్యరుజాపః సర్వామయహరో రుచ్యో పిత్తదాహానిలాస్రజిత్‌’’

...అని వర్ణిస్తారు. అంటే ఎర్రబియ్యం తియ్యగా, కమ్మగా మృదువుగా ఉంటాయి. తేలికగా అరుగుతాయి. అమిత బలకరం, ఆకలిని పెంచుతాయి. తృప్తినిస్తాయి. నోటికి రుచి తెలియకపోవటం, అన్నహితవు లేకపోవటం లాంటి పరిస్థితులున్నవారికి ఈ బియ్యం ఎంతో మంచివని అర్ధం. ఈ బియ్యం కంటి చూపును పెంచటంలో కూడా గొప్ప పాత్రను పోషిస్తుంది.

- గంగరాజు అరుణాదేవి

Updated Date - Dec 07 , 2024 | 03:54 AM