festive recipes: కిర్రెక్కించే చాట్‌లు
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:37 AM
క్రిస్మస్, కొత్త సంవత్సరం వచ్చేస్తున్నాయి. ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అతిథులు వచ్చిన ప్రతిసారీ ఇడ్లీ, దోశలు మాత్రమే పెడితే ఏంబాగుంటుంది! అందుకే అందరూ ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన చాట్‌లను ఎలా తయారుచేయాలో చూద్దాం.
క్రిస్మస్, కొత్త సంవత్సరం వచ్చేస్తున్నాయి. ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అతిథులు వచ్చిన ప్రతిసారీ ఇడ్లీ, దోశలు మాత్రమే పెడితే ఏంబాగుంటుంది! అందుకే అందరూ ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన చాట్‌లను ఎలా తయారుచేయాలో చూద్దాం. ఈ చాట్‌లన్నింటికీ చాట్ మసాలా అవసరమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బ్రాండ్ల చాట్‌మసాలాలు దుబాటులో ఉన్నాయి. వాటిలో ఏ చాట్ మసాలానైనా వాడుకోవచ్చు.
చిలకడదుంప చాట్
కావాల్సిన పదార్థాలు:
ఉడకబెట్టి వేయించిన చిలకడదుంప ముక్కలు: ఒక కప్పు, చింతపండు రసం: నాలుగు చెంచాలు, నిమ్మరసం- ఒక చెంచా, చాట్ మసాలా- ఒక చెంచా, ఉప్పు- తగినంత, దానిమ్మ గింజలు- నాలుగు స్పూన్లు, తరిగిన కొత్తిమీర- ఒక స్పూను
తయారీ విధానం
చిలకడదుంపను బాగా కడిగి తొక్క తీసేయాలి. దానిని ముక్కలుగా తరగాలి. వాటిని కుక్కర్‌లో ఉడకబెట్టవచ్చు. లేదా నెయ్యి వేసి వేయించవచ్చు.
ఒక గిన్నెలో చిలకడదుంప ముక్కలు, చింతపండు రసం, నిమ్మరసం, చాట్‌మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దానిమ్మ గింజలు, కొత్తిమీర పైన చల్లాలి.
జాగ్రత్తలు
చిలకడదుంపలను ఎక్కువ ఉడకబెడితే ముద్దగా అయిపోతాయి. అందువల్ల తక్కువగానే ఉడకబెట్టాలి.
కొందరు ఉడకబెట్టిన తర్వాత నెయ్యి వేసి వేయిస్తారు. అలా చేసినా రుచికరంగానే ఉంటుంది.
పాలకూర పకోడీ చాట్
కావాల్సిన పదార్థాలు
తరిగిన పాలకూర: ఒక కప్పు, శనగపిండి- అరకప్పు, నూనె- ఒక కప్పు, ఉప్పు- తగినంత, పెరుగు- ఒక కప్పు, చింతపండు రసం- రెండు చెంచాలు, జీలకర్ర పొడి- ఒక చెంచా
తయారీ విధానం
పాలకూరను బాగా కడిగి దానిలో శనగపిండి, ఉప్పు వేసి కలపాలి.
ఒక మూకుడులో నూనెను తీసుకొని, పాలకూర మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేయించాలి. బయటకు తీసి ప్లేటులో ఉంచాలి.
ఒక గిన్నెలో పాలకూర పకోడీలు వేయాలి. దానిపై పెరుగు, చింతపండు రసం, ఉప్పు, జీలకర్ర పొడి వేయాలి.
జాగ్రత్తలు
పకోడీలపై పెరుగు, ఇతర పదార్థాలు వేసిన తర్వాత బాగా కలపకూడదు. దీనివల్ల పకోడీలు మెత్తపడిపోతాయి.
పాలకూరలో శనగపిండిని కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించాలి. అంతే తప్ప శనగపిండిలో పాలకూరను వేసి నీళ్లతో కలపకూడదు.
ఆలూటిక్కీ చాట్
కావాల్సిన పదార్థాలు :
బంగాళదుంప ముక్కలు- రెండు కప్పులు, కార్న్‌ఫ్లోర్- ఒక చెంచా, పచ్చి బఠానీలు- పావుకప్పు, పెరుగు- ఒక కప్పు, చింతపండు రసం- రెండు స్పూనులు, గ్రీన్ చట్నీ (కొత్తిమీర, పుదీనా, పుట్నాల పప్పు, నిమ్మరసంల మిశ్రమం)- రెండు చెంచాలు, కారప్పూస- రెండు చెంచాలు, నూనె- పావు కప్పు, చాట్ మసాలా- ఒక చెంచా, ఉప్పు- తగినంత
తయారీ విధానం
బంగాళదుంపలను తొక్క తీసి బాగా ఉడికించాలి. పచ్చి బఠానీలను కూడా ఉడికించాలి. ఇవి రెండూ ఉడికి చల్లారిన తర్వాత ఒక గిన్నెలో బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, ఉప్పు, కార్న్‌ఫ్లోర్ వేసి ముద్దగా చేయాలి.
బంగాళదుంపల మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసి అరచేతిలో గుండ్రంగా ఒత్తాలి. వీటినే టిక్కీలంటారు.
ఒక పెనంపై నూనె వేసి వేడి చేయాలి. టిక్కీలను సన్నని సెగపై కాల్చాలి.
ఇలా కాల్చిన టిక్కీలను ఒక గిన్నెలో తీసుకొని దానిలో చింతపండు రసం, గ్రీన్ చట్నీ, కారపూస, చాట్ మసాలా, ఉప్పులను వేయాలి.
జాగ్రత్తలు
టిక్కీల కోసం కార్న్‌ఫ్లోర్ అందుబాటులో లేకపోతే బియ్యపు పిండిని వేయవచ్చు.
టిక్కీలను బాగా కరకరలాడేలా కాల్చకూడదు. కొద్దిగా మెత్తగా ఉంటేనే బావుంటుంది.