Share News

Kitchen : చలి కాలంలో వెచ్చని సూప్‌లు

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:09 AM

చలి పెరిగినప్పుడు వెచ్చని సూప్‌ తాగాలనిపిస్తుంది. రకరకాల కాయగూరలతో చేసే సూప్‌లు ఆరోగ్యకరమైనవే కావు... తాగటానికి రుచిగా కూడా ఉంటాయి.

Kitchen : చలి కాలంలో వెచ్చని సూప్‌లు

చలి పెరిగినప్పుడు వెచ్చని సూప్‌ తాగాలనిపిస్తుంది. రకరకాల కాయగూరలతో చేసే సూప్‌లు ఆరోగ్యకరమైనవే కావు... తాగటానికి రుచిగా కూడా ఉంటాయి. అలాంటి కొన్ని సూప్‌లు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

ghjk.jpg

కాలీఫ్లవర్‌ సూప్‌

కావాల్సిన పదార్థాలు:

తరిగిన కాలీఫ్లవర్‌ ముక్కలు- ఆరు కప్పులు, తరిగిన ఉల్లిపాయలు- ఒక కప్పు, తరిగిన బంగాళదుంప ముక్కలు- రెండు స్పూనులు,

తరిగిన కొత్తిమీర- ఒక స్పూను, పసుపు- పావు స్పూను, నానబెట్టిన వాల్‌నట్స్‌- రెండు స్పూనులు, దాల్చినచెక్క పొడి- పావు స్పూను, నూనె- అర కప్పు,

ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

తయారీ విధానం

వాల్‌నట్స్‌ను వేడి నీళ్లలో 15 నిమిషాలు నానబెట్టాలి. పై తొక్కలు తీయాలి. తొక్క తీసిన వాల్‌నట్స్‌ను మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. దానిలో నీళ్లు పోయాలి. పలచగా అయిన ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోయాలి.

ఒక మూకుడులో నూనెను వేసి వేడి చేయాలి. నూనెలో ఉల్లిపాయ ముక్కలు, కాలీఫ్లవర్‌ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత దానిలో తగినన్ని నీళ్లు పోసి

పైన మూత పెట్టాలి.

ఇలా బాగా ఉడికిన ముక్కల్లో మూడొంతులు బయటకు తీసి, వాటిని మిక్సీలో ముద్దగా చేయాలి. ఆ తర్వాత ఈ ముద్దను మళ్లీ మూకుడులో వేయాలి. దానిలో వాల్‌నట్స్‌ మిశ్రమాన్ని పోసి, మూత పెట్టి ఉడకబెట్టాలి.

చివరగా దాల్చినచెక్క పొడి, ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా ఉడకనివ్వాలి.


dfgn.jpg

ఎర్ర కందిపప్పు సూప్‌

కావాల్సిన పదార్థాలు:

ఎర్రకంది పప్పు- ఒక కప్పు, జీలకర్ర- ఒక స్పూను, ఆవాలు- ఒక స్పూను, వెల్లుల్లి- రెండు రెబ్బలు, పసుపు- అర స్పూను, మసాలా పౌడర్‌- పావు స్పూను, తరిగిన కొత్తిమీర- అర స్పూను, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

తయారీ విధానం

ఎర్ర కందిపప్పును 8 గంటలు నానబెట్టాలి. దీనిని ఒక గిన్నెలో ఐదు కప్పుల నీళ్లు పోసి బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన పప్పును మిక్సీలో వేసి ముద్దగా చేయాలి.

ఒక మూకుడులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పసుపు, మసాలాపౌడర్‌లు వేసి బాగా వేయించాలి.

వేయించిన మిశ్రమంలో పప్పు ముద్దను వేయాలి. తగినన్ని నీళ్లు పోసి.. ఉప్పు కూడా వేయాలి. మూతబెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీరపైన జల్లాలి.

జాగ్రత్తలు

ఎర్ర కందిపప్పును బాగా నానబెట్టాలి. లేకపోతే ముద్ద చేయటం కష్టమవుతుంది. రుచి కూడా మారుతుంది.

కొందరు మసాలా పౌడర్‌ బదులుగా కారం వేసుకుంటారు.

ఈ సూపును అప్పడాలతో పాటుగా తింటే బావుంటుంది.


gkhj.jpg

చిలకడదుంప సూప్‌

కావాల్సిన పదార్థాలు:

ఆలీవ్‌ ఆయిల్‌- రెండు స్పూనులు, వెల్లుల్లి ముక్కలు- ఒక స్పూను, తెల్ల ఉల్లిపాయ ముక్కలు- రెండు స్పూనులు, క్యాప్సికం- రెండు స్పూనులు, చిలకడ దుంప ముక్కలు- అర కప్పు, పాలు- ఒక కప్పు, కొబ్బరి పాలు- అర కప్పు, మిరియాలు- రెండు స్పూనులు, కారం- అర స్పూను, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని.

తయారీ విధానం

ఒక మూకుడులో రెండు స్పూన్ల ఆలీవ్‌ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, వెల్లుల్లి ముక్కలను బాగా దోరగా వేయించాలి.

ఆ తర్వాత చిలకడదుంపలు,

ఉప్పు, కారం, మిరియాల పొడి వేయాలి. తగినన్ని నీళ్లు పోసి మూతబెట్టి బాగా ఉడికించాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముద్దలా చేయాలి.

దీనిలో ముందు పాలు పోయాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు కూడా పోయాలి. ఐదు నిమిషాలు ఉడికించి కిందకు దింపేయాలి.

జాగ్రత్తలు

ఆలీవ్‌ ఆయిల్‌ త్వరగా వేడి ఎక్కుతుంది. అందువల్ల ఎక్కువ మంటపై వేడి చేయకూడదు.

పాలు చివర్లోనే పోయాలి. ముందు పోస్తే పాలు విరిగిపోయే ప్రమాదముంది.

Updated Date - Dec 07 , 2024 | 04:09 AM