Dry Eyes : కళ్లు పొడిబారుతున్నాయా?
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:27 PM
కళ్లలో నీళ్లు తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల అవి కంటిని తేమగా ఉంచేందుకు సరిపోక కళ్లు పొడిబారుతుంటాయి. కళ్లలో నీళ్లు త్వరగా ఆవిరైపోతున్నా కూడా ఈ సమస్య వస్తుంది. దీనివల్ల కళ్లు దురదగా ఉండడం, ఎర్రబడడం, మంట అనిపించడం,
కళ్లలో నీళ్లు తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల అవి కంటిని తేమగా ఉంచేందుకు సరిపోక కళ్లు పొడిబారుతుంటాయి. కళ్లలో నీళ్లు త్వరగా ఆవిరైపోతున్నా కూడా ఈ సమస్య వస్తుంది. దీనివల్ల కళ్లు దురదగా ఉండడం, ఎర్రబడడం, మంట అనిపించడం, వెలుగును చూడలేకపోవడం, ఏదో పడినట్లుగా గుచ్చుతుండడం లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. కొన్ని ఇంటి చిట్కాలతో వీటినుంచి ఉపశమనం పొందవచ్చు. అవి...
వేడి గుడ్డతో ఒత్తడం: మెత్తని గుడ్డ లేదా కొంచెం దూదిని తీసుకుని వేడి నీటిలో ముంచి గట్టిగా పిండండి. దీనిని గుండ్రంగా మడిచి మూసిన కంటి రెప్పల మీద ఉంచి చిన్నగా ఒత్తండి. వెంటనే కంటి రెప్పల్లో ఉన్న నూనె గ్రంథులు పూర్తిగా తెరుచుకుంటాయి. కంటిలో సన్నని నూనె పొర పరచుకుంటుంది. దీనివల్ల కంటిలో గరగర, మంట, దురద తగ్గుతాయి.
తేమగా ఉండేలా: కళ్లు పొడిబారకుండా నీళ్లతో నిండి తేమగా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కళ్లలో నీళ్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దాహం అనిపించకపోయినా ప్రతి మూడు గంటలకు ఒకసారి గ్లాసు మంచినీళ్లు తాగాలి. కళ్లలోకి ఎక్కువగా వెలుతురు, దుమ్ము సోకకుండా జాగ్రత్త తీసుకోవాలి.
కలబందతో: కలబంద ఆకు నుంచి గుజ్జును తీసుకుని మంచినీటిలో ముంచి తీయాలి. దీనిని మూసిన కంటి రెప్పల మీద పరచాలి. ఇది కంటిలోపలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. పది నిముషాల తరవాత కళ్లను కడగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తూ ఉంటే కలబందలోని ఔషధ గుణాల వల్ల కళ్లవాపు, దురద తగ్గుతాయి.
20-20-20 నిబంధనతో: ఎక్కువసేపు కంప్యూటర్‌ను చూస్తూ పనిచేయడం వల్ల రెప్పపాటు తగ్గి కళ్లు పొడిబారుతాయి. రెప్పపాటు వల్లనే కన్నీళ్లు వ్యాపించి కన్ను మొత్తం తేమగా ఉంటుంది. అందుకే ఈ 20-20-20 నిబంధనను పాటించాలి. ఇందులో ప్రతి 20 నిమిషాలకోసారి 20 అడుగుల దూరంలో ఉన్నవాటిని 20 సెకండ్లపాటు చూస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే కంప్యూటర్ స్ర్కీన్ వల్ల కలిగే అలసట తగ్గి కన్ను విశ్రాంతి పొందుతుంది. పచ్చని చెట్లను, ఆకాశాన్ని, ఎగిరే పక్షులను, పారే నీటిని చూస్తున్నా కూడా కళ్లకు తేలికపాటి వ్యాయామం చేసినట్లవుతుంది.
కీరాతో: కీరాను సన్నని చక్రాలుగా కోసి కళ్లమీద ఉంచుకోవాలి. కనీసం పావుగంటసేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. కీరాలో ఉన్న నీరు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి చుట్టూ ఉన్న చర్మానికి తేమని అందించి కళ్లకు చల్లదనాన్ని కలిగిస్తాయి. కళ్లలో దురద తగ్గుతుంది. చల్లని పాలలో దూదిని ముంచి కళ్లమీద ఉంచుకున్నా కూడా కళ్లు విశ్రాంతి పొందుతాయి.