DIY hair tips: అవాంఛిత రోమాలతో ఇబ్బందా?
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:11 AM
కొంతమంది మహిళలు అవాంఛిత రోమాలతో సతమతమవుతూ ఉంటారు. హార్మోన్ల అసమతౌల్యం వల్ల లేదా వంశపారంపర్యంగా ఈ సమస్య ఎదురవుతుంటుంది.
కొంతమంది మహిళలు అవాంఛిత రోమాలతో సతమతమవుతూ ఉంటారు. హార్మోన్ల అసమతౌల్యం వల్ల లేదా వంశపారంపర్యంగా ఈ సమస్య ఎదురవుతుంటుంది. దీంతో మహిళలు వ్యాక్సింగ్, థ్రెడింగ్ పద్దతులు అనుసరిస్తూ ఉంటారు. వీటివల్ల విపరీతమైన నొప్పిని భరించాల్సి ఉంటుంది. అలాకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
చక్కెర-నిమ్మరసం: ఒక గిన్నెలో రెండు చెంచాల చక్కెర వేసి వేడి చేస్తే చిక్కని ద్రవం ఏర్పడుతుంది. దీనిలో ఒక చెంచా నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. అయిదు నిమిషాలు ఆరాక దానిమీద మెత్తని వస్త్రాన్ని పెట్టి గట్టిగా ఒత్తాలి. తరవాత వస్త్రాన్ని వెంట్రుకలు పెరుగుతున్న దిశకు వ్యతిరేకంగా లాగాలి. వెంట్రుకలన్నీ గుడ్డతోపాటే ఊడి వచ్చేస్తాయి.
ఓట్స్-అరటిపండ్లు: మిక్సీ గిన్నెలో అర కప్పు ఓట్స్ వేసి మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడిని చిన్న గిన్నెలోకి తీసుకుని అరటి పండు గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, కాళ్లు, చేతులకు పట్టించి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే అవాంఛిత రోమాలు క్రమంగా తొలగిపోయి మరల పెరగవు.