Steel Water bottles: స్టీల్ వాటర్ బాటిల్స్ కంపు కొడుతున్నాయా? మీరు చేస్తున్న తప్పు ఏంటంటే..
ABN , Publish Date - Feb 08 , 2024 | 07:38 PM
స్టీలు వాటర్ బాటిల్స్‌పై మరకలు పెరిగిపోతున్నా, దుర్వాసన పెరుగుతున్నా బేకింగ్ సోడా, నిమ్మరసం, వేడి నీళ్లతో శుభ్రం చేయాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణంపై శ్రద్ధ ఉన్న చాలా మంది ప్లాస్టిక్ మంచినీళ్ల బాటిల్‌కు బదులు స్టీల్ నీళ్ల బాటిల్స్ వాడుతుంటారు. పదే పదే వాడేందుకు, ప్రయాణాలప్పుడు అనువుగా ఉండటంతో స్టీల్ వాటర్ బాటిల్స్‌ను ఇష్టపడతారు. అయితే, పదే పదే వాడటంతో ఈ వాటర్ బాటిల్స్ ఒక్కోసారి దుర్వాసన వెదజల్లడం ప్రారంభిస్తాయి. వాటిని శుభ్రపరిచే క్రమంలో జరిగే పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు పలు పరిష్కారాలు కూడా సూచిస్తున్నారు (Tips for washing steel water bottles).
అనుభవజ్ఞులు చెప్పే దాని ప్రకారం, స్టీల్ బాటిల్స్ కడిగేందుకు వేడిగా ఉన్న సబ్బు నీళ్లే వాడాలి. ముందుగా బాటిల్ నిండా వేడి నీళ్లు నింపి అందులో కొన్ని మైల్డ్ డిష్ వాష్ చుక్కలు వేయాలి. ఆ తరువాత 15 నిమిషాలు బాటిల్‌ను అలాగే ఉండనిచ్చి ఆ తరువాత మంచి స్క్రబ్‌తో శుభ్రంగా తోమాలి. బాటిల్ బ్రష్ వాడితే ఇంకా ఉత్తమం. బాటిల్ బయట కూడా ఇలాగే తొమితే జిడ్డు మొత్తం వదిలిపోతుంది.
మరకలు, వాసన వదలకుండా ఉంటే వెనిగర్ మిశ్రమాన్ని కూడా వాడొచ్చు. వైట్ వెనిగర్‌కు నీటిని కలిపి అందులో బాటిల్‌ను రాత్రంతా నానబెట్టాలి. వెనిగర్ లోని యాసిడ్ లక్షణాల కారణంగా ఎంతటి దుర్వాసన అయినా ఇట్టే వదిలిపోతుంది.
మరకలు, దుర్వాసనను తొలగించేందుకు బేకింగ్ సోడా కూడా ఎంతో ఉత్తమం. ఈవిధానంలో కూడా గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. ఆ తరువాత స్పాంజ్‌ను నీళ్లల్లో ముంచి బాటిల్ మొత్తం తోమాలి. దీంతో, సమస్య వెంటనే పరిష్కారమవుతుంది.
నిమ్మరసంలో కాస్తంత ఉప్పు వేసి అందులో స్క్రబ్ ముంచి బాటిల్‌ను శుభ్రపరచాలని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు. దీంతో, కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. నిమ్మరసంలోని యాసిడ్ లక్షణాలకు ఉప్పు కూడా తోడవడంతో జిడ్డు, దుర్వాసనా ఈజీగా వదిలిపోతాయట.
బాటిల్ మూతను కూడా ఇలాంటి పద్ధతుల్లో కడిగితే స్టీలు నీళ్ల బాటిల్స్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాయని చెబుతున్నారు.