చలి పులికి కీళ్లు బలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:24 AM
చలి ముదిరి పాకాన పడే సమయంలో కీళ్ల నొప్పులు విపరీతంగా పెరిగిపోతాయి.
చలి ముదిరి పాకాన పడే సమయంలో కీళ్ల నొప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. కదల్చడానికి వీల్లేకుండా బిగుసుకుపోతూ బాధించే కీళ్ల సమస్యలను ఈ కాలంలో ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం!
చలి కాలంలో చర్మం అడుగున రక్తనాళాలు కుంచించుకుపోయి, కీళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా రక్తం ద్వారా కీళ్లకు అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల, మృదులాస్థి కుంచించుకుపోయి కీళ్లు బిగుసుకుంటాయి. ఇలాంటి ఇబ్బంది ఆస్టియో ఆర్థ్రయిటిస్, రుమాటాయిడ్ ఆర్థ్రయిటిస్ ఉన్నవాళ్లకు మరింత ఎక్కువ. ఈ సమస్యలన్నీ శీతాకాలంలో చలివల్ల ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘రేనాడ్స్ ఫినామినా’ అని అంటారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఈ కాలంలో శరీర కదలికలు తగ్గడంతో రక్తప్రసరణ కూడా తగ్గిపోయి, చేతి వేళ్లు, మోకాళ్లు, మోచేతుల్లోని కీళ్లు పాక్షికంగా బిగుసుకుపోవడం, కదలికలు కొంత కష్టం కావడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. అదే సమయంలో స్వల్పంగా నొప్పులూ పెరుగుతాయి. ఈ కాలంలో వేధించే కీళ్ల నొప్పుల వెనక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే...
ఎసి: ఆఫీసులు, సినిమా హాళ్లు... ఇలా ఎయిర్ కండిషనర్ల చల్లదనాన్ని చలికాలంలోనూ తప్పించుకోలేం! కానీ కీళ్ల నొప్పులు పెరగకుండా ఉండాలంటే ఎసిలకు దూరంగా ఉండాలి.
ఎండ సోకాలి: ఆహారం ద్వారా అందే క్యాల్షియం శరీరం శోషించుకోవడానికి సరిపడా విటమిన్ డి అవసరం. ఇందుకోసం రోజు మొత్తంలో కొంతసేపైనా చర్మానికి ఎండ సోకేలా చూసుకోవాలి.
స్టిరాయిడ్లు, యాంటీబయాటిక్స్: వీటి వాడకం వల్ల ఎముకలు గుల్లబారతాయి. వైద్యుల పర్యవేక్షణ లేకుండా, వైద్యు లు సూచించకుండా వీటిని వాడకూడదు.
నొప్పులు తగ్గాలంటే?
చలికి విరుగుడు వేడి కాబట్టి, చలితో పెరిగే నొప్పులు తగ్గాలంటే వెచ్చదనాన్ని పెంచాలి. ఇందుకు హీటర్లు, స్వెటర్లు వాడవచ్చు
గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి కాళ్లు, చేతులు ముంచి వేళ్లు కదిలించినా ఫలితం ఉంటుంది
చల్లని వాతావరణం, ఎసిలకు దూరంగా ఉండాలి
ఎండ సోకేలా చూసుకుంటున్నా, కాలుష్యం కారణంగా సూర్యకిరణాలు సూటిగా చర్మానికి తగలవు. ఫలితంగా చర్మంలో సింథసిస్ సక్రమంగా జరగక, సరిపడా విటమిన్ డి తయారవదు. కాబట్టి వైద్యుల సూచన మేరకు విటమిన్ డి సప్లిమెంట్లు వాడుకోవాలి
నొప్పులు భరించలేనంతగా ఉంటే, వైద్యుల పర్యవేక్షణలో స్టిరాయిడ్లు వాడవచ్చు
చేతి వేళ్లలో నొప్పులు ఉన్నవాళ్లు హ్యాపీ బాల్ నొక్కే వ్యాయామం చేయాలి
గ్రిప్పర్స్, ఎలాస్టిక్ గ్యాడ్జెట్స్ వాడాలి
మోకీలు అరుగుదల ఉంటే?
మెత్తని సోఫాల్లో కూర్చోకూడదు. సోఫాలో కూర్చున్నప్పుడు మోకాలు 90 డిగ్రీల కోణంలో ముడుచుకుంటుంది. ఈ కోణంలో, మోకాళ్ల మీద భారం మోపుతూ లేచే ప్రయత్నం చేస్తే కీళ్ల అరుగుదల పెరుగుతుంది.
ట్రెడ్‌మిల్, జుంబా, ఏరోబిక్స్‌కు బదులు మెత్తని పచ్చిక మీద నడక, సైకిల్ తొక్కడం, క్రాస్ ట్రైనర్ మొదలైన వ్యాయామాలు చేయాలి.
మెత్తని బూట్లు వాడాలి
ఈత, కీళ్లకు అనువైన వ్యాయామం
నేల, బల్లల మీద పడుకోకూడదు
బరువును అదుపులో ఉంచుకోవాలి.
వైద్యులు సూచించిన ఫిజియోఽథెరపీ చేయాలి
కీళ్ల నొప్పుల్లో రకాలు
ఆస్టియో ఆర్థ్రయిటిస్: పెరిగే వయసుతోపాటు, బరువు పెరగడం వల్ల, లేదా అంతకుముందు జరిగిన ప్రమాదాల్లో కీళ్లు దెబ్బతిని మొదలయ్యే కీళ్ల నొప్పులివి
రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్: రోగనిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల మొదలయ్యే కీళ్ల నొప్పులివి
గౌటి ఆర్థ్రయిటిస్: రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు
సెప్టిక్ ఆర్థ్రయిటిస్: ఇది చిన్నపిల్లల్లో సహజం. పిల్లలకు ఏదో ఒక సమయంలో చెవి, ముక్కు, లేదా ఛాతీలో ఇన్‌ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ప్రమాదవశాత్తూ కిందపడి ఎముకలకు దెబ్బలు తగిలించుకుంటే, ఆ ప్రదేశంలో రక్తం గడ్డ కడుతుంది. ఆ రక్తం శరీరంలో మరో చోట ఉన్న ఇన్‌ఫెక్షన్‌ను ఆకర్షించి కీలుకు కీడు చేస్తుంది.
లిగమెంట్లు ఎంతో కీలకం!
కారు సాఫీగా నడవడానికి నాలుగు చక్రాలు ఎంత అవసరమో, కీళ్లు సాఫీగా కదలడానికి లిగమెంట్లు అంత అవసరం. ఎముకలను సరైన కోణంలో కదిలే ఆసరాను లిగమెంట్లు అందిస్తాయి. వీటిలో చీరికలు ఏర్పడితే ప్రమాదం జరిగిన కొద్ది రోజుల వరకూ నొప్పి వేధించి తగ్గిపోయినా, ఆ నష్టం దీర్ఘకాలంలో ఆర్థ్రయిటిస్‌కు దారి తీస్తుంది. కాబట్టి లిగమెంట్ గాయాల్ని సర్జరీతో సరి చేయించుకోవాలి.