Share News

అలాంటి రోల్స్‌లో నటించాలనుంది

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:14 AM

ఆమె ఒకప్పుడు విశ్వసుందరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆ తర్వాత నటిగా రాణించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీల్లోనూ నటిస్తోంది. ఆమే..

అలాంటి రోల్స్‌లో నటించాలనుంది

ఆమె ఒకప్పుడు విశ్వసుందరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆ తర్వాత నటిగా రాణించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీల్లోనూ నటిస్తోంది. ఆమే.. లారా దత్తా. ఆమె నటించిన ‘రణ్‌నీతి- బాలాకోట్‌ బియాండ్‌’ వెబ్‌సిరీస్‌ త్వరలో విడుదలవుతున్న సందర్భంగా లారా దత్తా గురించి కొన్ని విషయాలు...

ఇన్‌స్టాగ్రమ్‌లో లారా దత్తాకు పదమూడు లక్షల ఫాలోవర్లు ఉన్నారు. సినిమా విశేషాలతో పాటు యాడ్స్‌, కుటుంబ విశేషాలను షేర్‌ చేస్తుంటుంది. అధిక శాతం తన భర్త (టెన్నిస్‌ ప్లేయర్‌ మహేష్‌ భూపతి), కూతురు సైరాతో దిగిన ఫొటోలే ఉంటాయి. ఆ మధ్య ‘హీరోల గాళ్‌ఫ్రెండ్‌గానో, భార్యగానో నటించటం పరమబోర్‌. విసిగిపోయా. కొత్త పాత్రలు కావాలి’ అంటూ ఓ ఇంటర్వ్యూలో లారా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె పంథానూ మార్చుకున్నట్లు అనిపిస్తుంది.

అలా ఇండస్ర్టీలోకి...

లారా దత్తా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పుట్టి పెరిగింది. తండ్రి సిక్కు కుటుంబానికి చెందిన వ్యక్తి. అమ్మ ఆంగ్లో ఇండియన్‌. తన తండ్రి వింగ్‌ కమాండర్‌గా పని చేశారు. అంతేనా మూడు యుద్ధాల్లో కూడా పాల్గొన్నారు. తండ్రి వల్లనే తనలో క్రమశిక్షణ అలవడిందని చెబుతారీమె. ఇకపోతే చిన్నప్పుడే బెంగుళూరుకి వాళ్ల కుటుంబం షిఫ్టు అయింది. బెంగుళూరులోనే లారా దత్తా చదివింది. ఎకనిమిక్స్‌లో డిగ్రీ చదవటానికి ఆమె ముంబయి యూనివర్శిటీలో చేరింది. ఇంగ్లీ్‌షతో పాటు హిందీ, కన్నడ, పంజాబీ భాషలు మాట్లాడగలదు. అలా ఆమె ఆ తర్వాత ఫ్యాషన్‌ వరల్డ్‌లోకి వచ్చింది. ర్యాంప్‌ మీద నడవటమే కాదు.. 2000 సంవత్సరంలో ఏకంగా విశ్వసుందరి కిరీటం అందుకుంది. అలా ఆమె పేరు మార్మోగిపోయింది. ఆ పేరుతో ఆమెకు బాలీవుడ్‌ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆమె నటించిన తొలి చిత్రం ‘అందాజ్‌’. ఇది విడుదలైంది 2003లో. తొలి చిత్రంతోనే బెస్ట్‌ డెబ్యుడెంట్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు దక్కించుకుంది. ‘నో ఎంట్రీ’, ‘హౌస్‌ఫుల్‌’, ‘బిల్లు బార్బర్‌’, ‘డాన్‌ 2’ , ‘బ్లూ’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌...

టెన్నిస్‌ ప్లేయర్‌ మహేష్‌ భూపతితో కలసి 2011లో ఏడడుగులు నడిచింది. వీరికి సైరా అనే కూతురు ఉంది. ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబ జీవితం మీద పడకూడదనేది లారా దత్తా ఆలోచన. పెళ్లయ్యాక ‘చలో ఢిల్లీ’ అనే చిత్రంలో నటించటంతో పాటు నిర్మాణ బాధ్యతలూ చూసుకుంది. ‘అజహర్‌’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’ తర్వాత బ్రిటీష్‌ హిస్టారికల్‌ డ్రామా సిరీ్‌సలో నటించింది. మూడేళ్ల కిందట వచ్చిన ‘బెల్‌బాటమ్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కుదేలయినప్పటికీ ఇందిరాగాంధీగా లారా దత్తా నటన ప్రశంసలు అందుకుంది. అలా ఆమె మళ్లీ మార్కెట్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది.

అలాంటి పాత్రలే కావాలి..

ఐఫా అవార్డుల ఫంక్షన్‌ హోస్ట్‌, మిస్‌ దివా కాంటెస్టులకు హాజరవ్వటంతో పాటు యాడ్స్‌, యోగా వీడియోలతోనూ ప్రేక్షకులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంది లారా. ‘రొడ్డకొట్టుడు పాత్రలను ఆపేసి ఆడవాళ్ల సమస్యలపై ఇప్పుడు సినిమాలొస్తున్నాయంటే ప్రముఖ కారణం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌నే’ అంటుందీమె. ‘నటనంటే ఇష్టం. ఫ్యామిలీ సపోర్టు ఉంది. అందుకే సైరా నెలల పిల్ల ఉన్నప్పుడూ ‘డేవిడ్‌’ చిత్రం సెట్స్‌కు వెళ్లాను. ఫీడింగ్‌ ఇవ్వటంతో పాటు చేయాల్సిన సన్నివేశాలూ చేశాను’ అంటుంది లారా దత్తా. తన కూతురు సైరా వల్ల తన ఆలోచనలు మారిపోవటంతో పాటు హ్యూమనిస్టుగా తయారయ్యానంటుంది లారా. ఈ విషయంలో తన కూతురే టీచర్‌ అంటుంది. ‘విభిన్నమైన కథలతో ఓటీటీ దర్శకులు వస్తున్నారు. ఇందిరాగాంధీ లాంటి కొత్త పాత్రలు కావాలి. భవిష్యత్‌లో స్ఫూర్తివంతమైన రోల్స్‌లో నటించాలని ఉంది’ అంటుంది లారా దత్తా.

Updated Date - Apr 21 , 2024 | 04:14 AM