Parenting Tips: యుక్తవయసు రాకముందే...
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:33 AM
పిల్లలు పెరిగి పెద్దవారై జీవితంలో విజయం సాధించాలంటే తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
పిల్లలు పెరిగి పెద్దవారై జీవితంలో విజయం సాధించాలంటే తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పిల్లలకు చిన్నతనంలోనే క్రమశిక్షణ, నైతిక విలువలు, కష్టపడే తత్వం తదితరాల ప్రాముఖ్యాన్ని వివరించాలి. వీటినే పునాదులుగా చేసుకొని పిల్లలు ఉన్నత శిఖరాలు చేరుకోగల్గుతారు. యుక్తవయసు రాకముందే పిల్లలకు తల్లిదండ్రులు ఏ పనులు నేర్పించాలో తెలుసుకుందాం.
వంటింటి పనులు: తల్లిదండ్రులు వంట చేసేటపుడు సహాయం చేయమని అడిగితే పిల్లలు సంతోషపడతారు. కూరగాయలు కడగడం, వాటి తొక్కు తీయడం వంటివి చెప్పి చేయించండి. బ్రెడ్‌కు వెన్న రాయడం, శాండ్‌విచ్‌లు తయారు చేయడం, గుడ్లు గిలక్కొట్టడం, ఉడికించిన గుడ్లకు పెంకు తీయడం, చపాతీలు పామడం, బియ్యం కడగడం, వంట పూర్తయిన తరవాత స్టవ్ శుభ్రం చేయడం, చిన్న పళ్లాలు-గిన్నెలు-గ్లాసులు కడగడం వంటి వాటిని పిల్లలకు నేర్పించండి. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
చెత్త బుట్ట: పనికిరాని కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర చెత్తను నిర్దేశిత బుట్టలో వేయాలని పిల్లలకు చెప్పండి. తడి చెత్త, పొడి చెత్తలను వేరుచేసే విధానాన్ని తెలియజెప్పాలి. చెత్తను తీసుకెళ్లే పారిశుధ్య కార్మికులు ఇంటి ముందుకి వచ్చినపుడు వారికి చెత్త బుట్టలను ఇచ్చే పనిని పిల్లలకు చెప్పి చేయించండి. దీనివల్ల పిల్లలకు పరిశుభ్రత విలువ, పర్యావరణ రక్షణ తదితర అంశాలు అర్దమవుతాయి.
ఇంటి పనులు: తల్లిదండ్రులు ఇంట్లో చేసే పనుల్లో సులభమైనవాటిని పిల్లలకు అప్పజెప్పడం మంచిది. మొక్కలకు నీళ్లు పోయడం, బల్బు లేదా ట్యూబ్‌లైట్ మార్చడం, నీళ్లు పట్టడం, కిరాణా కొట్టు నుంచి అవసరమైనవాటిని కొనుక్కుని రావడం, సంతకెళ్లి పండ్లు లేదా కూరగాయలు తీసుకురావడం, రేషన్ షాపు ముందు క్యూలో నిల్చోవడం వంటి వాటిని పిల్లలచేత చేయించాలి. దీనివల్ల పిల్లల్లో సానుకూల దృక్పథం, సంభాషణా నైపుణ్యం పెరుగుతాయి. తోటివారితో మెలగాల్సిన తీరు అర్థమవుతుంది. ఏదైనా సమస్య వస్తే సొంతంగా పరిష్కరించుకునే తెలివి అలవడుతుంది.
గది సర్దడం
పిల్లలకు వారి గదిని అందంగా ఉంచుకోవడం నేర్పించాలి. ఉదయం నిద్ర లేవగానే వారు కప్పుకున్న దుప్పటి మడతపెట్టి దానిని నిర్దేశిత స్థానంలో ఉంచమని చెప్పి చేయించాలి. మంచం మీద దుప్పటిని చక్కగా పరచడం, దిండుని సరిగా పెట్టడం నేర్పించాలి. బొమ్మలతో ఆడుకున్నాక వాటిని అరల్లో సర్దమని చెప్పాలి. పాఠశాలకు తీసుకెళ్లే బ్యాగ్, పుస్తకాలను నిర్లక్ష్యంగా పడేయకుండా టేబుల్ మీద సర్దుకోవడం చేసి చూపించాలి. సెలవు రోజుల్లో గదిని ఊడవడం, తుడవడం; కిటికీ తలుపులు, ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేయడం వంటి వాటిని పిల్లలతో చేయించాలి.
సమయపాలన: పిల్లలకు అన్ని పనులను సమయానుసారం చేయడం నేర్పించాలి. ఉదయాన్నే లేవడం, ఆలస్యం కాకుండా పాఠశాలకు వెళ్లడం, బద్దకించకుండా హోం వర్క్ చేసుకోవడం, సమయానికి నిద్రపోవడం అలవాటు చేయాలి. పనులను వాయిదా వేయడాన్ని ప్రోత్సహించవద్దు. ఎప్పటి పనులు అప్పుడే చేయమని కచ్చితంగా చెప్పి చేయించండి. దీనివల్ల పిల్లలకు సమయపాలన అలవడుతుంది. ఇది వారి ఉన్నత స్థితికి కారణమవుతుంది కూడా.
పొదుపు
డబ్బుని పొదుపుగా వాడడం ఎలానో పిల్లలకు తెలియజెప్పాలి. వారికిచ్చే పాకెట్‌మనీని అవసరం మేరకు వాడుకుని మిగిలిన మొత్తాన్ని దాచమని చెప్పాలి. దాచుకున్న డబ్బుతో మంచి పుస్తకాలు లేదంటే ఇష్టమైన బొమ్మలు కొనుక్కోవడం, స్నేహితులకు పుట్టినరోజున బహుమతులు ఇవ్వడం వంటివి నేర్పించాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దని గట్టిగా చెప్పాలి.