ధ్యానం ఎందుకు చేయాలి?
ABN , Publish Date - Dec 20 , 2024 | 06:47 AM
మన దేశం యోగభూమి. ఇందులో ప్రతి అణువు దైవికమైన చైతన్యంతో నిండి ఉంటుంది. యోగ, ధ్యానం భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు.
మన దేశం యోగభూమి. ఇందులో ప్రతి అణువు దైవికమైన చైతన్యంతో నిండి ఉంటుంది. యోగ, ధ్యానం భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు. అటువంటి ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కొన్నేళ్ళ క్రితం ప్రకటించింది. ఈ సందర్భంగా ధ్యానం అంటే ఏమిటి? దాన్ని ఎలా చెయ్యాలి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అనే అంశాల గురించి సహజయోగ ధ్యాన పద్ధతిని ఆవిష్కరించిన శ్రీమాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ద్వారా తెలుసుకుందాం.
అదే మానవ జన్మ పరమార్థం
ధ్యానం అంటే మీరు మీ ఆత్మతో ఒకటిగా ఉండే స్థితి. ఆ స్థితి నిర్విచార స్థితిలో లభిస్తుంది. అందులోనే ఆత్మతత్త్వం వృద్ధి చెందుతుంది. నిర్విచార స్థితి అంటే ఆలోచనారహిత స్థితి. ధ్యానం భగవంతుడితో ఎంత సుందరమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందంటే... మన సమస్యలన్నీ ఆ ధ్యానావస్థలో వాటంతట అవే పరిష్కారమవుతాయి. ఎందుకంటే ధ్యానం మనల్ని మనం అంతర్గతంగా భగవంతుడికి సమర్పించుకొనే పూజ. మనల్ని మనం తెలుసుకోవాలంటే మనం ఇంకా సూక్ష్మంగా మారాలి. మన లోపలికి చూసుకోగలగాలి. అప్పుడే ‘మనం ఆత్మస్వరూపులం’ అని తెలుస్తుంది. మానవుడి ఆధ్యాత్మిక ఉత్థానం కోసం... కుడి పార్శ్వం, ఎడమ పార్శ్వం కాకుండా... మధ్యే మార్గం అయిన సుషుమ్నా నాడిపై ప్రయాణం చేయాలని గ్రహించిన గోరఖ్‌నాథ్, ఆదినాథ్, మశ్చీంద్రనాథ్ లాంటి యోగిపుంగవులు మన దేశంలో ఉండేవారు. వారు మానవుల సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేశారు. మానవునిలో ఆధ్యాత్మిక ఉన్నతిని ఏ విధంగా సుసాధ్యం ఎలా చేయాలో శోధించి, ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. మానవుల వెన్నెముక చివరి భాగంలో త్రికోణాకారంలో ఉండే సాక్రమ్ ఎముకలో అవశిష్టమై ఉన్న ఒక దివ్యశక్తిని వారు గుర్తించారు. ఇది అందరిలో జన్మతః ఉంటుంది. మానవులు సాధించాల్సిన అత్యున్నత స్థితి లేదా అంతిమ లక్ష్యం... శాశ్వతమైన ఆ శక్తిని కనుక్కోవడమే. అదే మనలోని ఆత్మ. ఆత్మతో మనం ఏకీకరణ కావడమే మానవ జన్మ పరమార్థం. అదే సహజయోగ మూల సూత్రం. మనం బాల్యంలో బాహ్యపరంగా ఆ దైవశక్తితో పూర్తి అనుసంధానత కలిగి ఉంటాం. కాని పెరిగి పెద్దయ్యాక... మనలో అరిషడ్వర్గాలు, ఆలోచనలు లాంటి అవరోధాలు పెరుగుతాయి. భగవంతుడితో బాహ్యమైన ఆ సంబంధాన్ని కోల్పోతాం.
ఆ మూడూ ఏకీకరణ చెందితే...
మనలోని కుండలినీ శక్తి జాగృతమై, బ్రహ్మరంధాన్ని ఛేదించి, సర్వవ్యాపిత దివ్యశక్తితో అనుసంధానం కావాలి. అదే ఆత్మసాక్షాత్కారం. ఈ శక్తి మనలోపలే అంతర్గతంగా నిక్షిప్తమై ఉంది. కుండలినీశక్తి జాగృతం అరుయినప్పుడు, ఆ శక్తి ఆరు కేంద్రాలద్వారా పయనించి, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి, పరమ చైతన్యశక్తితో అనుసంధానమైనప్పుడు... ఆ స్థితి మన భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పరిపుష్ఠం చేస్తుంది. సహజయోగ ధ్యానంలో ఇది సునాయాసంగా జరుగుతుంది.
అదొక్కటే మార్గం...
‘ద్యానం సర్వార్ధ సాధనమ్...’ అంటే ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా... అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అంతర్గతమైన, బాహ్యపరమైన ఎదుగుదల కలుగుతుంది. మనలోని చక్రనాడులన్నీ శక్తిమంతం కావడం వల్ల సద్గుణాలు పెంపొందుతాయి. తద్వారా మీతోపాటు మీ చుట్టూ ఉన్న సమాజం కూడా ప్రయోజనం పొందుతుంది. మీలో నిక్షిప్తమైన ఈ నిధిని సాధించడం ద్వారా మీ దుఃఖాలకు, సమస్యలకు అతీతంగా ఉంటారు. ధ్యానంలో స్థిరపడాలంటే... పసిపిల్లల్లో ప్రతిబింబించే అమాయకత్వం, నిర్మలత్వం మీలో ప్రతిఫలించాలి. ధ్యానం ద్వారా చిత్తం అంతర్ముఖంగా వెళ్ళి... లోపాలు సరిదిద్దుకొనే స్థాయికి చేరుకోవాలి. ధ్యానంద్వారానే ధర్మిక శక్తిని, విచక్షణ శక్తిని, క్షమాగుణాన్ని పెంపొందించుకోగలుగుతాం. మనకు సంతృప్తిని, శాంతిని, ప్రశాంతతను ఇవ్వాలని, సమాజహితమైన, ప్రపంచ మానవాళికి శ్రేయస్సు కలిగించే వాటిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించడానికి, ఆ వినతిని ఆయన దృష్టికి తీసుకువెళ్ళడానికి వాస్తవికమైన మార్గం ధ్యానం ఒక్కటే. మనం ప్రార్థనలో కోరుకొనే కోరికలకు ఆయన సమాధానం కానీ, పరిష్కారం కానీ ధ్యానం ద్వారానే దొరుకుతుందనేది సహజయోగ సాధకులు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం.
అలజడితో ఉన్న సరస్సు ఆకాశంలోని సూర్యుణ్ణి సరిగ్గా ప్రతిబింబించలేదు. అదే విధంగా ఆలోచనల సుడులు తిరుగుతున్న మనసు... సర్వవ్యాపితమైన దైవశక్తిని సరిగ్గా ప్రతిబింబించలేదు. కాబట్టి ఆలోచనలన్నిటినీ నిశ్శబ్దం చెయ్యాలి. తద్వారా ప్రశాంతతను పొందిన మనస్సు మన మెదడులో వివేకం కలిగిస్తుంది. అప్పుడు హృదయం, మెదడు, చిత్తం... ఈ మూడు ఏకీకరణ చెందుతాయి. మనం ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలుగుతాం. ’
డాక్టర్ పి. రాకేష్ 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ