Share News

Love : ఈ ప్రేమ నిజం కాదు!

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:36 AM

రేడియోనో, టీవీనో పెడితే... ప్రేమతో నిండిన సినిమా పాటలు 24 గంటలూ వినిపిస్తాయి. ప్రేమకు బలైపోయిన దేవదాసులు, లైలా మజ్నూ కథలు సరేసరి.

Love : ఈ ప్రేమ నిజం కాదు!

రేడియోనో, టీవీనో పెడితే... ప్రేమతో నిండిన సినిమా పాటలు 24 గంటలూ వినిపిస్తాయి. ప్రేమకు బలైపోయిన దేవదాసులు, లైలా మజ్నూ కథలు సరేసరి. ఇలా ప్రేమ మన జీవితాన్ని ఆక్రమించుకుంటూ ఉంటుంది. చాలామందిలో ‘నేను ప్రేమించగలనా?’ అనే సందేహాన్ని సమాజంలోని ఈ వాతావరణం పుట్టిస్తూ ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి సిద్ధాంతంలో కూడా ప్రేమ ఒక ముఖ్యమైన అంశం. అయితే దాని కోణం వేరు.

వాస్తవిక జీవితంలో ప్రేమ పేరుతో ముడిపడిన బాంధవ్యాలు అనతికాలంలోనే నిరాశ, ద్వేషం, అసూయ, క్రౌర్యం కింద మారుతాయి. దంపతులకు వైవాహిక జీవితంలో ఆశించిన వాంఛలు తీరనప్పుడు, విధేయతలో లోపాలు కనిపించినప్పుడు... తొలి దశలో ఉన్న ప్రేమ మాయమై, ద్వేషం మిగిలిపోతుంది. ‘ప్రేమకు ద్వేషంతో ఏదైనా సంబంధం ఉందా? కొండంత ధైర్యాన్ని, శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించవలసిన ప్రేమ అధైర్యానికి, అనుమానాలకు ఎలా దారితీస్తుందో చెప్పమంటా’రు కృష్ణమూర్తి. ఆయన సిద్ధాంతం ప్రకారం ‘వినడం’, ‘చూడడం’ అనేవి మానవ బాంధవ్యాలలో చాలా ముఖ్యమైన ప్రక్రియలు. ఆయన దృష్టిలో ఆ మాటలకు నిర్వచనాలు వేరు. మనం ఎదుటివారిని చూడం, వారు చెప్పేది వినం. అంటే... ఎదుటి వ్యక్తిని చూస్తున్నప్పుడు మన అహంకారం - అంటే ‘నేను’ అనే భావం, మనోవికారాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, కోరికలు, ఇష్టాయిష్టాలు, ఉద్వేగాలు... ఆ ఎదుటి వ్యక్తికి, మన కళ్ళకు మధ్య అడ్డుగోడలా నిలబడతాయి. మనం వాటిని ఆ వ్యక్తికి ఆపాదిస్తాం. తెలిసో, తెలియకో వాటినే ఆ వ్యక్తిలో చూస్తాం తప్ప... ఆ వ్యక్తిని నిజంగా చూడం. మన దృష్టి మీద, అవగాహన మీద లెక్కలేనన్ని ప్రభావాలుంటాయి. మనం నిరంతరం వాటి వశంలో ఉంటాం.


ప్రభావాల నియంతృత్వం

నిర్మొహమాటంగా చెప్పాలంటే ఎదుటి మనిషి మనం చేరుకోలేని ఒక పరాయి ద్వీపం. అతడి అంతరంగంలో దాగి ఉన్న రాగద్వేషాలు, ఆలోచనలు, వాంఛలు, భయాలు, గాయాలు మనకు కనపడవు. వాటిని మనం కేవలం ఊహించుకుంటాం. ఈ ఊహకు మించి మనకు అతని గురించి ఏమీ తెలీదు. ప్రభావాలు మన కళ్ళకు కళ్ళాల్లా ఉన్నంత కాలం ఎదుటి వ్యక్తి నేరుగా, ప్రత్యక్షంగా మన అనుభూతిలోకి రాడు. అందుకే ‘‘ఎవరైనా ‘నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను’ అంటే అది చాలా సందేహాస్పదం. నీ ఊహకు మించి అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నీకు తెలీదు, మరి ఆ వ్యక్తిని ప్రేమించడం ఎలా వీలవుతుందో చెప్పు’’ అంటారు కృష్ణమూర్తి. వినడంలో కూడా అదే సమస్య. ఎదుటి వాడు చెప్పేది వింటున్నప్పుడు కూడా మన మీద ప్రభావాల నియంతృత్వం ఉంటుంది. వారు చెప్పేది అర్థం చేసుకొనే మనస్థిమితం మనకు ఉండదు. ‘‘ప్రేమించడంలో మొదటి మెట్టు ఎదుటి వ్యక్తిని చూడడం, ఆ వ్యక్తిని సంపూర్ణంగా తెలుసుకోవడం. అంటే మొదట నేను నామీద ఉన్న ప్రభావాల్ని అన్నిటినీ వదిలించుకుని, మనస్సుని శుభ్రపరిచి, ఎదుటి వాడిని చూడగలగాలి. అన్ని ప్రభావాలను విసర్జించినప్పుడు మనిషికి నిజమైన స్వేచ్చ వస్తుంది. స్వేచ్ఛ పొందిన మనిషికి భయం ఉండదు. భయంలేని స్వేచ్చాజీవికి మాత్రమే ప్రేమించే తాహతు ఉంటుంది’’ అని ఆయన చెబుతారు. ఇదంతా విన్నవారిలో ‘‘నన్ను పూర్తిగా తమ అదుపులో పెట్టుకున్న ఈ ప్రభావాల్ని నేను ఎలా వదిలించుకోవాలి?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ‘‘దానికి ఏదైనా మానసిక విశ్లేషణ లాంటి టెక్నిక్‌, యోగాసనాల్లాంటి అభ్యాసం, ఏదైనా మంత్రం, ఉపదేశం ఉంటుందా?’’ అని అడుగుతారు. ఈ సందర్భంలో మనకు కృష్ణమూర్తి ప్రత్యేకత కనిపిస్తుంది. టెక్నిక్‌, అభ్యాసం, ఉపదేశం లాంటివి మనిషికి స్వేచ్చని ఇవ్వలేవు. ఉన్న ప్రభావాల్ని వదిలించుకునే బదులు మనిషి కొత్త ప్రభావాల పరాధీనతకు గురౌతాడు. ఈ కారణం వల్లే కృష్ణమూర్తి మనకు ఏ మార్గమూ చూపరు, ఏ నియమాలనూ విధించరు.

ఎలా బయటపడాలి?

‘మనిషి రకరకాల ప్రభావాల స్వాధీనంలో ఉన్నాడు’ అనే విషయాన్ని ఒక సిద్ధాంతపరంగా, ఒక ఆలోచనాపరంగా విశ్లేషించి... వాటిని వదిలించుకోవడానికి శ్రమపడడం వల్లనో, దాన్ని ఒక సాధనగా మార్చుకోవడం వల్లనో ఏ ఫలితమూ ఉండదు. తీవ్రమైన పంటినొప్పిని ఎలా వాస్తవమైన విషయంగా గుర్తించి, భరిస్తామో అదే తీవ్రతతో మన మీద ఉండే ప్రభావాలను గుర్తించగలిగితే... అవి వాటంతట అవే మాయమైపోతాయి. అప్పుడు మనం సంపూర్ణమైన స్వతంత్రతను, ప్రేమించడానికి అనివార్యమైన యోగ్యతను పొందే అవకాశం ఉంటుంది. మానవ సంబంధాలలో తలెత్తే అన్ని సమస్యలకు పరిష్కారం... ప్రభావాల నియంతృత్వాన్ని గుర్తించడంలో ఉంటుంది.

గుంటూరు వనమాలి

Updated Date - Dec 06 , 2024 | 04:36 AM