Kartikeya : రాక్షస గుణాలు అంతం కావాలంటే...
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:53 AM
గణేశుడు గణాలన్నిటికీ రాజైతే కార్తికేయుడు సర్వసైన్యాధ్యక్షుడు. మన శరీరంలో కుడివైపున ఉండే పింగళా నాడిని ప్రభావితం చేసే శక్తికి ప్రతీకగా ఉంటాడు. ఆ శక్తి మన ప్రాణశక్తితో అనుసంధానమై ఉంటుంది. కార్తికేయుడి అనుగ్రహం పొందడం వల్ల... తేజస్సు, చక్కటి క్రియాశీలత, చెడుని అంతమొందించే అంతర్గత దైవశక్తి లభిస్తాయి.
నేడు సుబ్రహ్మణ్య షష్ఠి
గణేశుడు గణాలన్నిటికీ రాజైతే కార్తికేయుడు సర్వసైన్యాధ్యక్షుడు. మన శరీరంలో కుడివైపున ఉండే పింగళా నాడిని ప్రభావితం చేసే శక్తికి ప్రతీకగా ఉంటాడు. ఆ శక్తి మన ప్రాణశక్తితో అనుసంధానమై ఉంటుంది. కార్తికేయుడి అనుగ్రహం పొందడం వల్ల... తేజస్సు, చక్కటి క్రియాశీలత, చెడుని అంతమొందించే అంతర్గత దైవశక్తి లభిస్తాయి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాక... తనకు మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరాడు. అలాంటి వరం సాధ్యం కాదని బ్రహ్మదేవుడు చెప్పగా... తారకాసురుడు బాగా ఆలోచించి, శివుడి కుమారుడి చేతిలో మాత్రమే మరణించే వరం ఇవ్వాలని అడిగాడు. ఎందుకంటే ఆ సమయానికి శివుని భార్య సతీదేవి అగ్నిలోకి దూకి ఆత్మార్పణ చేసుకుంది. ఆ బాధతో శివుడు హిమాలయాల్లో తపస్సులో లీనమై ఉన్నాడు. శివుడు తపస్సును భగ్నం చేసే సాహసులెవరూ లేరు. ఒకవేళ శివుడు తపస్సు నుంచి బయటకు వచ్చినా... ఆయనకు భార్య లేదు కాబట్టి కుమారుడు కలిగే అవకాశం లేదని తారకాసురుడు భావించాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు.
కుమారస్వామి జననం...
ఆ తరువాత తనను చంపేవారెవరూ లేరనే గర్వంతో తారకాసురుడు విర్రవీగాడు. ముల్లోకాలను తన దారుణ కృత్యాలతో గడగడలాడించాడు. దేవేంద్రుణ్ణి తరిమేసి స్వర్గలోక ఆధిపత్యాన్ని తీసుకున్నాడు. అప్పుడు తమకు తరుణోపాయం సూచించాల్సిందిగా దేవతలందరూ నారదుణ్ణి వేడుకున్నారు. సతీదేవి పర్వతరాజైన హిమవంతుడి కుమార్తెగా... పార్వతి పేరుతో మళ్ళీ జన్మించిందని, ఆమె శంకరుడికి పత్ని అవుతుందని నారదుడు చెప్పాడు. ఆ తరువాత దేవతలందరూ కలిసి సప్తర్షుల సాయంతో శివ పార్వతులకు వివాహం జరిపించారు. వారి సంతానమే కుమారస్వామి లేదా కార్తికేయుడు. ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆయనకు ‘షడాననుడు’, ‘షణ్ముఖుడు’ అని, నెమలి ఆయన వాహనం కాబట్టి ‘శిఖి వాహనుడు’ అని, ఋషి పత్నులైన కృత్తికల దగ్గర పెరగడం వల్ల ‘కృత్తికాసూనుడు’, ‘కార్తికేయుడు’ అనే నామాలు ఏర్పడ్డాయి. ఆయనను సుబ్రహ్మణ్యస్వామి, మురుగన్, వేలాయుధన్, దండపాణి.. ఇలా అనేక పేర్లతో పిలుస్తారు.
తారకాసుర సంహారం...
కార్తికేయుడి జననం మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరిగింది. ఆయన ద్వారా తమకు స్వేచ్ఛ రాబోతోందని దేవతలు సంతోషించగా, తారకాసురుడి అనుచరుల్లో నిరాశ, భయాందోళనలు పెరిగాయి. కుమారస్వామికి విశ్వామిత్ర మహర్షి ‘గుహ’ అనే నామాన్ని ఇస్తూ... వేదజ్ఞానాన్ని ప్రసాదించాడు. అగ్ని దేవుడు ‘శకి’్త అనే ఆయుధాన్ని ఇచ్చాడు. అనంతరం కైలాసానికి యువరాజుగా కార్తికేయుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. వివిధ దేవతలు తమ ఆయుధాలను, శక్తులను బహుమతులుగా ఇచ్చారు. దేవతల సేనాధిపతిగా ప్రకటించారు. కొంతకాలానికి తారకాసురుడు నాశనమయ్యే సమయం వచ్చింది. వారిద్దరి మధ్యా జరిగిన యుద్ధంలో తారకాసురుడు మరణించాడు. గణేశుడు గణాలన్నిటికీ రాజైతే కార్తికేయుడు సర్వసైన్యాధ్యక్షుడు. మన శరీరంలో కుడివైపున ఉండే పింగళా నాడిని ప్రభావితం చేసే శక్తికి ప్రతీకగా ఉంటాడు. ఆ శక్తి మన ప్రాణశక్తితో అనుసంధానమై ఉంటుంది. కార్తికేయుడి అనుగ్రహం పొందడం వల్ల... పసిపిల్లల్లో ఉండే అమాయకత్వంతో కూడిన తేజస్సు, చక్కటి క్రియాశీలత, చెడుని అంతమొందించే అంతర్గత దైవశక్తి లభిస్తాయి. భగవంతుడి పట్ల వినయ విధేయతలు, నాయకత్వ లక్షణాలు, అందరికీ మార్గదర్శకత్వం చేయగల శక్తి, దైవికమైన జ్ఞానం, వివేకం కలుగుతాయి. మన సూక్ష్మ శరీరంలో కార్తికేయుడి స్థానం కుడివైపు మూలాధార చక్రంలో ఉంటుంది. మన లోపల ఉన్న కుండలినీ శక్తి ఆ చక్రాన్ని దాటి పైకి రావాలంటే... మనలో కార్తికేయుడి గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు ఏమిటో, కార్తికేయుడి ఆశీస్సులు ఎలా పొందాలో శ్రీమాతాజీ నిర్మలాదేవి తన ప్రవచనాల్లో వివరించారు.
కార్తికేయుడి నివాసం మన సూక్ష్మ శరీరంలోని కుడివైపున మూలాధార చక్రమే అయినా... పింగళి నాడి మొత్తం మీద ఆయన ప్రభావం ఉంటుంది. అందుకే ఆయనకు ‘సుపింగళా’ అనే పేరు ఏర్పడింది. మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు.... పింగళానాడి మొత్తం శుభ్రమవుతుంది. మనలోని మూలధార చక్రం, ఆజ్ఞా చక్రం ఒకదానితో ఒకటి పరిపూర్ణమైన సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి మూలాధార చక్రం కుడిభాగం శుభ్రమైతే ఆజ్ఞాచక్రం కుడిభాగం కూడా శుభ్రపడుతుంది. మనలో అహంకారాన్ని నియంత్రించుకొనే శక్తిని మెరుగుపరుస్తుంది. మనలోని రాక్షస గుణాలు అంతం కావాలంటే కార్తికేయుడి అనుగ్రహం కావాలి. అంటే కుడివైపున మూలధార చక్రం బలంగా ఉండాలి. ఈ చక్రం శుభ్రమయ్యేకొద్దీ మనలోని అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. అంతర్గత ప్రశాంతత కలుగుతుంది. కార్తికేయుడి ఆశీస్సులు ఉన్న వ్యక్తి ఇతరులను శాసించగలుగుతాడు. ఇలా శాసించగలిగే శక్తి పురుషులకు వారి మాటల ద్వారా, చురుకుదనం ద్వారా, వ్యక్తిగత విజయాలద్వారా లభిస్తే... మహిళలకు సహనం, హుందాతనం, క్షమాగుణం, కరుణ, అందరినీ ఆదరించే గుణం ద్వారా లభిస్తుంది.
సాధారణంగా కొన్ని దేవాలయాలలో రెండు సర్పాలు ఒకదానితో ఒకటి మెలికలు తిరుగుతూ ఉన్న శిల్పం మనకు కనిపిస్తుంది. ఆ శిల్పంలోని రెండు సర్పాలు మన సూక్ష్మ శరీరంలో ఇడా, పింగళా నాడులు ఒకదానితో ఒకటి మెలికలు తిరిగి... ఆరు శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను ఎలా ఏర్పరుస్తాయో సూచిస్తాయి. వీటినే ‘చంద్రనాడి, సూర్యనాడి’ అని కూడా పిలుస్తారు. మన వెన్నెముక అడుగు భాగాన త్రికోణాకార ఎముకలో ఉండే కుండలినీ శక్తి... ఈ రెండు నాడుల మధ్య ఉండే సుషమ్నా నాడి ద్వారా పైకి వచ్చి, మన మాడు పైభాగంలో ఉండే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి, మన చుట్టూ ఉన్న, సర్వవ్యాపితమైన భగవంతుడి పరమ చైతన్య శక్తితో ఐక్యం అవుతుంది. అప్పుడే సాధకుడికి యోగప్రాప్తి కలుగుతుంది. ప్రతి నిత్యం సహజయోగ సాధన ద్వారా దీన్ని సాధించగలమనీ, కార్తికేయుడి గుణాలను, శక్తులను మనలో స్థిరపరుచుకోగలమననీ శ్రీమాతాజీ నిర్మలాదేవి తన ప్రవచనాల్లో స్పష్టం చేశారు.